తిరుమలలో పోలీసుల పోరు! | Sakshi
Sakshi News home page

తిరుమలలో పోలీసుల పోరు!

Published Tue, Feb 18 2014 2:44 AM

You can fight the poli

    టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి,పోలీసులకు మధ్య విభేదాలు
     సర్దిచెబుతూ కాలం గడుపుతున్న అధికారులు
     ‘కాసుల దర్శనాలే’ గొడవకు కారణం?

 
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమలలో పోలీసుల మధ్య పోరు కొనసాగుతోంది. భక్తులకు భద్రత కల్పించాల్సిన టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ, పోలీసు సిబ్బంది తరచూ ఘర్షణకు దిగుతున్నారు. తమకు తెలిసిన వారిని దర్శనానికి దేవాలయంలోకి పంపించే విషయం, అదనపు లడ్డు కౌంటర్ల వద్ద టికెట్ల విషయాల్లో టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందికి, స్థానిక పోలీసులకు తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘటనలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను పరిశీలిస్తే ఇది మనకు అర్థమవుతుంది.
 
నమోదైన ఘర్షణలు
వైకుంఠం ఒకటో గేటు వద్ద 2011 డిసెంబర్ 16న ఒక కానిస్టేబుల్ ఇద్దరు భక్తులను లోపలికి పంపుతుండగా వైకుంఠం టీటీడీ సెక్యూరిటీ వారు అభ్యంతరం చెప్పారు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది.

నడకదారి క్యూ వద్ద టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది 2012 ఏప్రిల్ 22న కొందరిని తీసుకెళుతుండగా పోలీసులు ఆపివేశారు. దీంతో గొడవ జరిగింది.
     
సుపథం క్యూ వద్ద 2012 అక్టోబర్ 6న ఎస్‌ఐ, టీటీడీ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది.
     
రూ.300 క్యూ వద్ద 2013 మార్చి 3న టీటీడీ సిబ్బంది, పోలీసులకు మధ్య వివాదం చోటు చేసుకుంది. అప్పటి ఆలయ డెప్యూటీ ఈవో రమ ణ వారికి సర్దిచెప్పారు.
     
వైకుంఠం ఒకటి ప్రవేశ ద్వారం వద్ద 2013 ఆగస్టు 4న పోలీసులు, టీటీడీ సెక్యూరిటీ వారు గొడవకు దిగారు. వీరికి సీవీఎస్‌వో అశోక్ కుమార్ సర్ది చెప్పాల్సి వచ్చింది.
     
అదనపు లడ్డూల కోసం టిక్కెట్ కౌంటర్ వద్ద 2013 నవంబర్ 29న ఇరువర్గాల వారికి గొడవ జరిగింది. ఏవీఎస్‌వో విశ్వనాథం సర్దిచెప్పారు.
 
రికార్డుల్లో నమోదయినా..

 ఈ సంఘటనలన్నీ టీటీడీ రికార్డుల్లో నమోదయ్యా యి. అయినా అధికారులు సాదాసీదాగానే తీసుకుం టున్నారు. ఈ సంఘటనలకు బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు చేపట్టి ఉంటే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం లేదు. పోలీసులు, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది కలిసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సింది పోయి వారే ఘర్షణకు దిగుతున్నారు. టీటీడీ వారు కూడా జరుగుతున్న సంఘటనలను ఉన్నతాధికారుల దృష్టికి తీసు కురావడంలో విఫలమవుతున్నారు. తాము ఎక్కువని స్థానిక పోలీసులు, కాదు మేమే ఎక్కువని టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది భావించడం వల్లనే ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ పద్ధతి మారాల్సిన అవసరం ఉంది.
 
దర్శనానికి వెళుతున్నది తెలిసినవారేనా?
 
తిరుమలలో ఇప్పటి వరకూ పోలీసులకు, విజిలెన్స్ వారికి ఘర్షణ జరిగింది భక్తులను దర్శనానికి పంపించే క్యూల వద్ద, లడ్డూ టిక్కెట్ కౌంటర్ల వద్దే. భక్తుల మధ్య తోపులాటలు చోటు చేసుకోకుండా చూడ్డంతో పాటు పిక్‌పాకెటర్స్‌ను కనిపెట్టడం వీరి బాధ్యత. అయితే వీరు భక్తుల నుంచి డబ్బు తీసుకుని బంధువులనో, తెలిసినవారనో చెప్పి దర్శనానికి పంపుతున్నారనే విమర్శలున్నాయి. ఇక్కడ విధులు నిర్వహించే వారిలో చాలా మంది సిబ్బంది ఇలాంటి దర్శనాలు చేయిస్తున్నారని సమాచారం.
 

Advertisement
Advertisement