తుంపర్తి వంకలో చిక్కుకుపోయిన యువకులు | Sakshi
Sakshi News home page

తుంపర్తి వంకలో చిక్కుకుపోయిన యువకులు

Published Thu, Sep 12 2013 3:03 AM

Young people trapped floods water

 ధర్మవరం టౌన్, న్యూస్‌లైన్: వరద నీటిలో చిక్కుకుని బయటకు రాలేక అవస్థలు పడుతున్న నలుగురు యువకులను గ్రామస్తుల సాయంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఐదు గంటల పాటు శ్రమించి రక్షించారు. వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం పట్టణానికి చెందిన సుధీర్ రెడ్డికి తుంపర్తి గ్రామ సమీపంలో తోట ఉంది. అతని మిత్రులైన సంజీవరెడ్డి, ప్రకాష్, నరేంద్రలు మంగళవారం ఆ తోటకు వెళ్లి అక్కడే బస చేశారు.  రాత్రి కురిసిన వర్షానికి తోటకు ఇరువైపులా ఉన్న మల్లాకాల్వ వంక, చిత్రావతి నదుల్లో ప్రవాహం ఉధృతమైంది. రాత్రి ఒంటి గంట సమయంలో తోటలోకి నీరు ప్రవేశించిన విషయం గమనించిన యువకులు బయటకు రావడానికి ప్రయత్నించి, నీటి ఉధృతి కారణంగా విఫలమయ్యారు.
 
 తాము నీటి మధ్యలో చిక్కుకుపోయిన విషయాన్ని సెల్‌ఫోన్ల ద్వారా బంధువులకు చేరవేశారు. దీంతో వారు ధర్మవరం రూరల్ పోలీసులకు, అగ్నిమాపక సి బ్బందికి సమాచారం అందించగా, రూరల్ సీఐ నరసింగప్ప, ధర్మవరం ఫైర్ ఆఫీసర్ షరీఫ్‌లు తుంపర్తికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. గ్రామంలోని రైతుల వద్ద ఉన్న తాళ్లను, తమ వద్ద ఉన్న తాళ్లను కలిపి, దాదాపు 5 గంటల పాటు శ్రమించి అవతలి గట్టుకు చేరుకున్నారు. యువకులను తాళ్ల సాయంతో సురక్షితంగా ఇవతలికి చేర్చారు. విషయం తెలుసుకున్న ధర్మవరం డీఎస్పీ షేక్ నవాబ్‌జాన్, తహసీల్దార్ రామచంద్రారెడ్డి, ప ట్టణ సీఐ ఆంజనేయులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిం చారు.
 
 యువకులు వంకలో చిక్కుకుపోయారని తెలుసుకున్న తుంపర్తి, పోతులనాగేపల్లి, మోటుమర్ల గ్రామస్తులు పెద్ద ఎత్తున చిత్రావతి నది వద్దకు చేరుకున్నారు. వారిని సురక్షితంగా బయటికి తీసుకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ తెల్లవారు జామున మెళకువ రావడంతో  బయటకు వచ్చి చూడగా తోటకు ఇరువైపులా నీరు ఉధృతంగా ప్రవహిస్తూ కనిపించిందన్నారు. దాంతో తాము తీవ్ర ఆందోళనకు గురయ్యామని, అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగానే నీరు తోటలోకి వచ్చేసిందన్నారు. దీంతో చేసేది లేక  బంధువులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.
 

Advertisement
Advertisement