Sakshi News home page

అభ్యర్థుల ఎంపికలో జగన్‌ బిజీబిజీ

Published Fri, Mar 15 2019 3:07 AM

Ys Jagan busy in the selection of candidates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలకు అందుబాటులో ఉంటూ, విజయావకాశాలు ఉన్న అభ్యర్థుల ఎంపికకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. ఈ నెల 16న ఇడుపులపాయలో తొలి జాబితా విడుదల చేయాలని పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందన్న అంచనాలు బలంగా ఉండటంతో పెద్ద సంఖ్యలో ప్రముఖులు, ఆశావహులు పార్టీలో చేరుతున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఓ పక్క వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూనే, మరోపక్క అభ్యర్థుల ఎంపికలో తలమునకలవుతున్నారు. ఆశావహులు, పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతూ రాత్రి పొద్దుపోయే దాకా జిల్లాల వారీగా జాబితాలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా జాబితాను సిద్ధంచేసినట్లు సమాచారం. ప్రధానంగా ప్రజలకు అందుబాటులో ఉండే నేతలు, గెలుపు అవకాశాలు. స్థానిక సమీకరణలు, సామాజిక సమతుల్యం వంటి అంశాల ప్రాతిపదికనే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారని పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. క్షేత్రస్థాయి సమాచారంతో పాటు వివిధ మార్గాల ద్వారా తెప్పించుకున్న నివేదికలు జగన్‌ వద్ద సిద్ధంగా ఉన్నాయి.

ప్రతి నియోజకవర్గానికి పలువురు నేతలు పోటీ పడుతుండటంతో, జగన్‌ తన నివేదికల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికలో మొహమాటాలకు, ఒత్తిళ్లకు తావివ్వకుండా వైఎస్‌ జగన్‌ ఒక పద్ధతి ప్రకారం ఎంపిక చేస్తున్నట్లు తెలిసింది. పార్టీకి విజయావకాశాలు బాగా మెరుగ్గా ఉన్నాయని ప్రజల్లో విస్తృత చర్చ సాగుతున్న నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో ఆశావహులు ఎక్కువయ్యారు. దీంతో వారితో సంప్రదింపులు జరుపుతూ ఏకాభిప్రాయాన్ని సాధిస్తున్నారు. ఇందుకోసం జిల్లాల వారీగా ఉన్న పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తల సహకారాన్ని కూడా జగన్‌ తీసుకుంటున్నారు. టికెట్‌ లభించడంలేదని తెలుసుకుని అసంతృప్తితో ఉన్న నేతలతో ఆయన మాట్లాడించి పరిస్థితులను చక్కబెడుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నందున ఇప్పుడు టికెట్‌ రాకపోయినా, పార్టీ అభ్యర్థి విజయానికి చిత్తశుద్ధితో కృషిచేసిన వారికి భవిష్యత్తులో తప్పకుండా మంచి ప్రాధాన్యత కల్పిస్తానని జగన్‌ వారికి భరోసా ఇస్తున్నారు. దీంతో నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని వారు జగన్‌కు చెబుతున్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement