అధికారంలోకి వచ్చిన వారంలోపే సీపీఎస్‌ రద్దు | Sakshi
Sakshi News home page

అధికారంలోకి వచ్చిన వారంలోపే సీపీఎస్‌ రద్దు

Published Fri, Nov 17 2017 9:12 AM

YS Jagan Guaranteed to Financial help Two Families - Sakshi

ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో బైపాస్‌ రోడ్డు వద్ద గురువారం ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నాయకులు కలిశారు. తమకు పదవీ విరమణ ప్రయోజనాలను దూరం చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌) విధానాన్ని రద్దు చేయాలని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వారంలోపే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇవ్వడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. సీపీఎస్‌ విధానంతో నష్టపోయిన రెండు బాధిత కుటుంబాలు జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాయి. వారి కష్టాలు విన్న జగన్‌ ఇరు కుటుంబాలకూ తక్షణమే రూ.50 వేల చొప్పున సాయం అందించాలని స్థానిక నాయకులకు సూచించారు.

రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది
‘‘అయ్యా.. నా కుమారుడు పందిటి సురేష్‌ 2009లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు. మా దురదృష్టం కొద్దీ సురేష్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో అనారోగ్యంతో మృతి చెందాడు. వైద్యం కోసం రూ.10 లక్షల దాకా ఖర్చు చేశాం. ఆ బిల్లులను అందజేస్తే ప్రభుత్వం నుంచి రూ.1.75 లక్షలే వచ్చాయి. నా కోడలికి ఉద్యోగం లేదు. పెన్షనూ రాలేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమూ రాలేదు. మేమంతా రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందయ్యా..’’ – రాజమ్మ, ఆళ్లగడ్డ పట్టణం, ఎల్‌ఎం కాంపౌండ్‌

మీరే న్యాయం చేయాలయ్యా..
‘‘అయ్యా.. నాది పేద కుటుంబం. నా కుమారుడు బండి సురేష్‌ 2009 డీఎస్సీలో తెలుగు పండిట్‌గా ఉద్యోగంలో చేరాడు. అంతలోనే విధి చిన్నచూపు చూసి 2010లో మృతిచెందాడు. ప్రభుత్వం నుంచి దహన సంస్కారాలకు రూ.10 వేలు మాత్రమే వచ్చాయి. అంతకు మించి మా కుటుంబానికి ఎలాంటి ప్రయోజనాలూ అందలేదు. మా కుటుంబానికి మీరే న్యాయం చేయాలయ్యా..’’
– వెంకటసుబ్బమ్మ, జీనేపల్లి, శిరివెళ్ల మండలం

Advertisement

తప్పక చదవండి

Advertisement