Sakshi News home page

జగన్ దీక్షపై సర్కార్ల ఉపేక్ష

Published Sun, Sep 1 2013 12:46 AM

ys jagan Hunger strike  Sarkar oblivion

అమలాపురం, న్యూస్‌లైన్ :రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల ఐక్యత కోసం ఒక పార్టీ అధినేత ప్రాణాలు పణంగా పెట్టి ఆమరణ నిరాహారదీక్ష చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూసినట్టు చూస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి నిరసించారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న దీక్షపై తక్షణం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి మన్‌మోహన్‌సింగ్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ దీక్షకు మద్దతుగా పార్టీ పిలుపు మేరకు శనివారం అమలాపురంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు  పట్టణ పోలీసు స్టేషన్‌ను ముట్టడించి జైల్‌భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. హైస్కూల్ సెంటరు నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక గాంధీవిగ్రహం వద్ద కొంతసేపు ఆగి సమైక్యాంధ్రకు, జగన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. పోలీసు స్టేషన్ వద్ద సీఐ ద్వారంపూడి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సైలు అంకబాబు, జి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. 
 
 ఆందోళనకారులు మూసిన గేట్లను నెట్టుకుని పోలీసుస్టేషన్ ఆవరణలోకి దూసుకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. సుమారు గంట పాటు ఆందోళన చేసిన పార్టీ శ్రేణులు ‘జగన్ ఆరోగ్యం మెరుగుపడాలి, ప్రభుత్వాల నిరంకుశ వైఖరి నశించాలి, జై జగన్’ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చిట్టబ్బాయి మాట్లాడుతూ రాష్ట్రంలో మూడుప్రాంతాలకు సమన్యాయం చేయాలని జగన్ చేస్తున్న దీక్షను ప్రభుత్వం పోలీసు బలంతో భగ్నం చేసేందుకు ప్రయత్నించిందన్నారు. తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా దీక్ష కొనసాగిస్తున్న జగన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించినందున ఆయన డిమాండ్లను పరిష్కరించేందుకు రాష్ట్రపతి, ప్రధాని చొరవ చూపాలన్నారు.
 
 పెట్టుబడిదారులది కాదు..ప్రజా ఉద్యమం
  సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం సీమాంధ్రలో 32 రోజులుగా ఉద్యమం జరుగుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం అన్యాయమని కుడుపూడి అన్నారు. జనం స్వచ్ఛందంగా ఉద్యమం చేసినా స్పందన లేకపోగా, కొంతమంది ఇది పెట్టుబడుదారులు చేయిస్తున్న ఉద్యమం అని ఆరోపించడం దారుణమన్నారు. పెట్టుబడిదారుల ఉద్యమం ఇలా నెలల తరబడి సాగదని స్పష్టం చేశారు. కాగా చిట్టబ్బాయితో సహా ఆందోళన చేస్తున్న 51 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు మిండగుదిటి మోహన్, చింతా కృష్ణమూర్తి, పార్టీ పట్టణ, మండల కమిటీ కన్వీనర్లు మట్టపర్తి నాగేంద్ర, జంపన రమేష్‌రాజు, నిమ్మకాయల హనుమంత శ్రీనివాస్‌రావు, పచ్చిమాల శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చెల్లుబోయిన శ్రీను, స్టీరింగ్ కమిటీ సభ్యులు బొల్లవరపు ఛాయాదేవి, టేకి రాజగోపాలరావు, కుడుపూడి త్రినాథ్, కాశి మునికుమారి, పంపన పద్మలత, యల్లమిల్లి రాజ్‌మోహన్, నల్లా రమేష్, పినిపే రాధాకృష్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement