అతిరాస కులానికి కార్పొరేషన్‌ : వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

అతిరాస కులానికి కార్పొరేషన్‌

Published Mon, Jun 11 2018 1:56 PM

YS Jagan Meet Atirasa Caste People - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అధికారంలోకి రాగానే అతిరాస కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 186వ రోజు సోమవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణ శివారులో అతిరాస కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగించారు. ‘ఆ రోజుల్లో నాన్నగారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి బీసీ కమిషన్‌ ఏర్పాటు చేసి మీ కులానికి న్యాయం చేయగలిగారు. దురదృష్టవశాత్తు నాన్నగారు చనిపోయాక వచ్చిన చంద్రబాబు ఈ నాలుగేళ్లుగా ఏం చేస్తున్నాడనేది మీ అందరికీ తెలుసు. రేషన్‌ కార్డు, పెన్షన్, ఇల్లు.. ఏది కావాలన్నా, ఏ సంక్షేమ కార్యక్రమం చేతికి అందాలన్నా మొట్టమొదట అడిగేది జన్మభూమి కమిటీ నుంచి రికమండేషన్‌.

జన్మభూమి కమిటీల దగ్గరికి వెళితే వాళ్లు అడిగే మొట్టమొదటి ప్రశ్న మీరు ఏ పార్టీకి ఓటేశారని. కొద్దో గొప్పో ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా లంచం లేనిదే ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం. ఇవన్నీ తెరమరుగయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్‌. దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనం అధికారంలోకి రాగానే మీరు అడిగిన కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడంతోపాటు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటా. దీంతోపాటు బీసీలను చట్టసభల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేపడతాం. ఇంతకు ముందే చెప్పాను.. నేరుగా పోటీ పడి చట్టసభల్లోకి రాలేని బీసీ కులాలు ఉన్నాయి. అటువంటి ప్రాతినిధ్యంలేని కులాల నుంచి వీలైనంత ఎక్కువ మందిని ఎమ్మెల్సీలుగా చట్టసభల్లోకి తీసుకొస్తాం. మీరు చెప్పిన ప్రతి అంశాన్నీ పరిశీలిస్తాను’ అని జగన్‌ అన్నారు.  

అన్నీ సమస్యలేనన్నా..: సోమవారం వైఎస్‌ జగన్‌ గౌరిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించగానే వివిధ వర్గాల ప్రజలు సమస్యలను ఏకరువుపెట్టారు. పింఛన్లు ఇవ్వడం లేదని, ఇల్లు మంజూరు చేయడం లేదని, జన్మభూమి కమిటీ సభ్యులు వేధిస్తున్నారని, రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని జగన్‌ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ‘అన్నా.. నాలుగేళ్లుగా అన్నీ సమస్యలే.. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా చంద్రబాబు మమ్మల్ని మోసం చేశారు. మీరొస్తేనే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. మీ వెంటే ఉంటాం’ అని పలువురు పేర్కొన్నారు.  

వైఎస్సార్‌ మా కుల దైవం
కొండ, అటవీ ప్రాంతాలకు దగ్గర్లో ఉండే అతిరాస కుల ప్రజలు బీసీ సర్టిఫికెట్‌కు నోచుకోవడం లేదు. దీంతో రేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు దూరమయ్యారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అప్పట్లో పాదయాత్ర చేపట్టి మా ప్రాంతానికి వచ్చినప్పుడు మా సమస్యలు, మా దీనస్థితిని చెప్పుకున్నాం. ఆయన అధికారం చేపట్టాక బీసీ కమిషన్‌ ఏర్పాటు చేసి రిపోర్టు తెప్పించుకుని అతిరాస కులాన్ని బీసీల్లో చేర్చుతూ జీవో ఇచ్చారు. మాకు ఇంత మేలు చేసిన రాజశేఖరరెడ్డిని మా కులదైవంగా ఆరాధిస్తున్నాం. ఆయన మరణానంతరం కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. బీసీలుగా గుర్తించడం లేదు. మీరొస్తేనే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న 92 వేల మంది అతిరాసలం మీ వెంటే ఉంటాం. మీరు సీఎం అయ్యాక మాకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి మా పిల్లలకు చదువులు, ఉద్యోగాలు, సంక్షేమ కార్యక్రమాలు అందించేలా చర్యలు తీసుకోవాలి.    
– ఇళ్ల భాస్కరరావు, అతిరాస కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 

నేడు ‘తూర్పు’నకు ప్రజా సంకల్ప యాత్ర 
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర నేడు తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పోగ్రాం కో ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి గోదావరి నదిపై ఉన్న రోడ్డు కం రైలు వంతెన మీదుగా 3 గంటలకు పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం చేరుకుంటుందన్నారు. జిల్లాలో 16 నియోజకవర్గాల్లో సుమారు 270 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందని చెప్పారు.  

Advertisement
Advertisement