రెస్టు రూమ్‌కెళ్లినా రాజకీయమేనా! | Sakshi
Sakshi News home page

రెస్టు రూమ్‌కెళ్లినా రాజకీయమేనా!

Published Fri, Sep 5 2014 3:04 AM

రెస్టు రూమ్‌కెళ్లినా రాజకీయమేనా! - Sakshi

అధికార పక్షానికి ప్రతిపక్ష నేత జగన్ చురకలు
మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలంటూ హితవు

 
 సాక్షి, హైదరాబాద్: ‘శాసనసభలో ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. రెస్టు రూమ్‌కు వెళ్లినా రాజకీయం చేస్తారా?’ అని విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార పక్షాన్ని నిలదీశారు. రాజధానిపై గురువారం అసెంబ్లీలో సీఎంచంద్రబాబు సుదీర్ఘ ప్రకటన చేసిన తర్వాత, విపక్ష సభ్యుడు రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ మాట్లాడారు. అనంతరం బీజేపీ సభ్యుడు సత్యనారాయణకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో జగన్ లేచి బయటకు వెళ్లారు. వెంటనే మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకొని.. ‘ముఖ్యమైన అంశం మీద చర్చ జరుగుతోంది. విపక్ష నేత సభలో లేరు. మళ్లీ వస్తారో లేదో తెలియదు. హడావుడి చేయించి జారుకున్నారు. చర్చించకుండా ఇంటికి జారుకోవడం విపక్ష నేతల లక్షణం కాదు. జగన్ చల్లగా ఇంటికి జారుకున్నారు’ వంటి వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. సత్యనారాయణ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
 
 నాలుగైదు నిమిషాల తర్వాత జగన్ తిరిగి తన స్థానానికి వచ్చి కూర్చున్నారు. యనమల వ్యాఖ్యలను పార్టీ సభ్యులు ఆయనకు చెప్పారు. స్పందించిన జగన్.. ‘రెస్టురూమ్‌కు వెళ్లినా రాజకీయం చేస్తారా? ఎంత దారుణమైన పరిస్థితి సభలో ఉంది. ఎంత అప్రజాస్వామికం. ముందుగా చర్చించకుండానే ముఖ్యమంత్రి రాజధానిపై సభలో ప్రకటన చేశారు. రెండున్నర గంటలు మాట్లాడారు. అధికార పక్ష సభ్యులు ఏ స్థాయికి దిగజారిపోతున్నారు? మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి’ అంటూ చురకలు వేశారు. ఇరుకున పడిన యనమల నీళ్లు నములుతూ.. తన వ్యాఖ్యలకు స్పందించి విపక్ష నేత వెనక్కి వచ్చినందుకు ధన్యవాదాలంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు.

Advertisement
Advertisement