ఆ విషయంలో చంద్రబాబే నెంబర్‌వన్‌: వైఎస్‌ జగన్‌

23 Mar, 2019 15:58 IST|Sakshi

అవినీతి, ఎమ్మెల్యేల కొనుగోలులో చంద్రబాబే నెంబర్‌వన్‌

చేసిన అభివృద్ధి చెప్పకుండా మరోసారి అవకాశం ఇ‍వ్వమంటున్నారు

గిరిజన యూనివర్సిటీ,  ఇంజనీరింగ్‌ కాలేజీ నిర్మిసాం

పాడేరు ఎన్నికల ప్రచార సభలో వైఎస్‌ జగన్‌

సాక్షి, విశాఖపట్నం, పాడేరు: ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ని మద్యం అమ్మకాల్లో, రైతుల అత్మహత్యల్లో నెంబర్‌వన్‌గా నిలిపారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అబద్ధాల ద్వారా ప్రజలను మోసం చేసి, గిరిజనులను, దళితులను అన్యాయానికి గురిచేసిన చంద్రబాబుకు మోసపూరిత సీఎంగా దేశంలో నెంబర్‌వన్ స్థానం ఇ‍వ్వచ్చని ఎద్దేవా చేశారు.  ఐదేళ్ల తన పాలనలో ప్రజలకు  ఏం చేశారో చెప్పకుండా.. మీ భవిష్యత్తు తన చేతిలోనే ఉందని మరోసారి మోసానికి దిగే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో పేదవాడి బతుకులు  ఏమైనా బాగుపడ్డాయా అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నం జిల్లా పాడేరులో జరిగిన ఎన్నికల ప్రచారం సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. పాడేరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాగ్యలక్ష్మి, అరకు లోక్‌సభ అభ్యర్థి గొడ్డేటి మాధవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. 


సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ... ‘‘సుధీర్ఘమైన పాదయాత్రలో రాష్ట్రంలోని గిరిజనులు, దళితులు ఏవిధంగా కష్టాలు పడుతున్నారో దగ్గరనుంచి చూశాను. చంద్రబాబు నాయుడిపాలనలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఆరు గిరిజన అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం చంద్రబాబుకు నచ్చలేదు. అందుకే వారిపై కక్ష్యసారింపు చర్యలకు పాల్పడుతున్నారు. దివంగత వైఎస్సార్‌ హయాంలో ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. గిరిజనులకు ఏడు లక్షల ఎకరాల భూ పంపిణీ చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. మా నాన్న గారు పోతూపోతూ మా కుటుంబాన్ని మీ చేతుల్లో పెట్టారు. మీ అందరికి అండగా ఉండమని మమల్ని మీ దగ్గరికి పంపారు. ఇటీవల మహానాయకుడు అనే సినిమాలో దొంగల్లుడు అనే క్యారెక్టర్‌ మాదీరిగా.. చేయనిది చేసిట్టుగా.. చేసింది చేయట్టుగా  చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. సొంత మామానే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. ధర్మారాజుకు ధర్మం చేయడమెలాగో ఆయనే నేర్పిన విధంగా అబద్ధాలు మాట్లాడుతారు. ఇలాంటి వ్యక్తి చేతిలో మన భవిష్యత్తును పెడతామా?.

వెనుకబడిన ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ, మెడికల్‌ కాలేజీ ఎంతో అవసరం. గిరిజన ప్రాంతాల్లో 500లకు పైగా జనాభా ఉంటే పంచాయతీలను చేయాల్సి ఉంది. ఎన్నో ఏళ్లుగా వాటికై డిమాండ్‌ చేస్తున్నా టీడీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదు. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాటిని నిర్మిస్తామని హామీ ఇస్తున్న. అధికార పార్టీ అండదండలతో బాక్సైట్‌ మాఫీయా చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతల పోరాటంతో అదికాస్తా తక్కుముఖం పట్టింది. మన ప్రభుత్వంలో మైనింగ్‌ను పూర్తిగా నిషేధిస్తాం. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన గిద్ది ఈశ్వరీ బాక్సైట్‌ మైనింగ్‌ గురించి చంద్రబాబుపై అనేక విమర్శలు చేశారు. ఐదేళ్ల కాలంలో 560 అవార్డులు తీసుకువచ్చా అని ‍ప్రచారం చేస్తున్నారు. అవినీతి, అక్రమాలు, రైతుల ఆత్మహత్యలు, తాగుడు ఏపీగా మార్చినందుకు ఆయనకు నిజంగానే అవార్డులు ఇవ్వాలి.

ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు డబ్బు సంచులు పట్టుకుని ప్రజలు మభ్యపెట్టడానికి మరోసారి బయలుదేరారు. ఆయనిచ్చే మూడువేలకు మోసపోవద్దు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటాం. నవరత్నాలు ద్వారా పేదల బతుకులు మారుతాయని నాకు బలంగా నమ్మకముంది. తల్లికి అన్నం పెట్టలేని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాడన్నాన్నడంటా.. అలా ఉంది చంద్రబాబు నాయుడు వ్యవహారం. ఐదేళ్ల పాలనలో ఏమీ చేయకుండా.. తనను మరోసారి గెలిపిస్తే అభివృద్ది చేస్తామని చెప్పుకుంటూ ఓట్లు అడుగుతున్నారు. ఏ సమావేశానికి పోయినా ఏపీని నెంబర్‌వన్‌ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. పేద ప్రజలను మోసం చేయడంలో ఆయనే నెంబర్‌వన్‌, నిరుద్యోగులను, విద్యార్థులను, రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేయడంలో చంద్రబాబే నెంబర్‌వన్‌, ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేను కొనుగోలు చేయడంలో ఆయనే నెంబర్‌వన్‌. ఇలాంటి వ్యక్తి సీఎంగా మనకు అవసరమా?.’’ అని వ్యాఖ్యానించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు