మేం చేసింది త్యాగం కాదా? | Sakshi
Sakshi News home page

మేం చేసింది త్యాగం కాదా?

Published Fri, Dec 9 2016 3:41 AM

మేం చేసింది త్యాగం కాదా? - Sakshi

  పోలవరం నిర్వాసితుల ఆవేదన
 రుణాలు మాఫీ కాలేదన్న రైతులు, మహిళలు

సాక్షి, రాజమహేంద్రవరం: ‘‘రాజధాని, పోలవరం రెండూ అభివృద్ధి కోసమే చేస్తున్నారు. అక్కడ రైతులకు రూ.కోట్లల్లో పరిహారం ఇస్తున్నారు. వారిని త్యాగమూర్తులు అంటున్నారు. కనీసం మమ్మల్ని పట్టించుకోవడంలేదు, పరిహారం ఇవ్వడం లేదు. ఆదుకోవాలని అడిగితే జైల్లో పెట్టించారు. మేం చేసింది త్యాగం కాదా? రాజధానికి భూములు ఇచ్చిన రైతులూ, మేమూ ఒకటి కాదా?’’ అన్ని నిర్వాసిత రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  వైఎస్సార్ సీపీ అధినేత, విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా గురువారం వీఆర్ పురం మండలం రేఖపల్లిలో నిర్వాసిత రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ముఖాముఖి నిర్వహించారు. పలువురు రైతులు తమ గోడును ఆయనతో వెళ్లబోసుకున్నారు. ‘పోలవరం ప్రాజెక్టుకు అందరికన్నా ముందు మేము భూములిచ్చాం. అప్పుడు ఎకరాకు రూ.1.10 లక్షల పరిహారం ఇచ్చారు.
 
  ఆ లక్షతో ఇప్పుడు పదిసెంట్ల పొలం కూడా రాదు. ఇప్పుడు పరిహారం ఎక్కువ ఇస్తున్నారు. ఇదే విషయం ఇటీవల చింతూరుకు వచ్చిన సీఎం చంద్రబాబుకు చెప్పాం. మాకు కూడా ఎంతో కొంత పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వేడుకున్నాం. ఆదుకోవాలని అడిగినందుకు జైల్లో పెట్టించారు’ అని వాపోయారు. మాకు న్యాయం చేయాలని ఇప్పుడు మీ ద్వారా అడుగుతున్నామని చెప్పారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని మహిళలు... వ్యవసాయ, బంగారు రుణాలు మాఫీ చేయలేదని రైతులు తెలిపారు.
 

Advertisement
Advertisement