ఆ విజయమే మహోదయం | Sakshi
Sakshi News home page

ఆ విజయమే మహోదయం

Published Wed, May 11 2016 1:34 AM

ఆ విజయమే మహోదయం - Sakshi

  రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కలెక్టరేట్ వద్ద జగన్ ధర్నా
  ఎండను సైతం లెక్కచేయకుండా... వెల్లువలా తరలివచ్చిన జనం
  అధిక సంఖ్యలో హాజరైన యువత.. మహిళలు

 
 మిట్ట మధ్యాహ్నం ... మండుటెండను పండు వెన్నెల్లా భావించారు. సడలని మా ఉక్కు సంకల్పం ముందు సలసలకాగే ఈ గ్రీష్మతాపం వెలవెలబోవల్సిందేనంటూ భానుడికే సవాల్ విసిరినట్టుగా దీక్షా కంకణం కట్టుకున్న జనం తండోపతండాలుగా తరలివచ్చారు. దారులన్నీ కలెక్టరేట్ వైపే ... అడుగులన్నీ సభా వేదికవైపే ... జగనన్నకు మద్దతుగా ‘రండోరన్న దండుగా  వెళ్దా’మంటూ పిడికిలి బిగించారు. ప్రత్యేక హోదాయే భావి తరానికి మహదానందమని ఎలుగెత్తి చాటారు. వేల గొంతుకలు ఒక్కటై ఆ విజయమే మాకు మ’హోద’యమని ముక్త కంఠంతో నినదించారుు.
 
 అమలాపురం/ మండపేట : తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని... అప్పుడే తమ బతుకులు బాగుపడతాయని... హోదా రావాలంటే అది మాటతప్పని, మడమతిప్పని పోరాటయోధుడు జగనన్నతోనే సాధ్యమని నమ్మిన జనం కాకినాడకు కడలి కెరటాల్లా తరలివచ్చారు. మెట్ట.. ఏజెన్సీ.. డెల్టా అనే తేడా లేకుండా జిల్లా నలుమూలల నుంచి జనం తరలిరావడంతో సాగరతీర నగరమైన కాకినాడ.. పరిపాలనా కేంద్రమైన కలెక్టరేట్ జనసంద్రమైంది. దాహంతో గొంతెండుతున్నా ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి’ అని దిక్కులు పిక్కటిల్లేలా నినదించడంతో కలెక్టరేట్ ప్రాంతం హోరెత్తిపోయింది.
 
 రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద మంగళవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ప్రతిపక్ష నాయకుడు, పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ధర్నాకు మద్దతుగా రావడంతో జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. వీరే కాకుండా మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలిరావడం ద్వారా ప్రత్యేక హోదాపై తమ ఆకాంక్షను బలంగా చాటారు.
 
  కలెక్టరేట్ వద్ద తొమ్మిది గంటల నుంచి జనం రాక ఆరంభమైంది. గంటలోనే కలెక్టరేట్ బయట జనంతో కిటకిటలాడింది. ఆ ప్రాంతంలో నిలబడేందుకు చోటు లేకపోవడంతో చాలామంది కలెక్టరేట్, మున్సిపల్, జెడ్పీ అతిథి భవనాల గోడల మీద నిలబడిపోయారు. మరికొంతమంది కలెక్టరేట్ ప్రాంగణంలోకి చొచ్చుకు వచ్చారు. సభా వేదిక వెనుక వైపు కూడా జనంతో నిండిపోయింది.
 
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 12.40 గంటలకు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. జగన్ పర్యటన ఆలస్యమైనా, ఎండ మండిపోతున్నా జనం లెక్కచేయలేదు. అభిమాన నేత వేదిక మీదకు రాగానే ఆ ప్రాంతం ప్రత్యేక హోదా, జగన్ జిందాబాద్ అనే నినాదాలతో హోరెత్తిపోయింది. ఇంతటి ఆప్యాయతను ఇంతటి ప్రేమాభిమానాలు పంచుతున్న ప్రతీ అక్కకు, చెల్లెమ్మకు, అవ్వకు, సోదరునికి, స్నేహితునికి,  అందరికీ  చేతులు జోడించి శిరస్సు వంచి పేరుపేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అని జగన్ జనం హర్షధ్వానాల మధ్య ఆప్యాయతను పంచారు.  
 
 మీకు ప్రత్యే హోదా కావాలా? వద్దా? అని, మీకు ఉద్యోగాలు కావాలా? వద్దా? అని జగన్ ప్రశ్నించినప్పుడు ప్రజలు చేతులెత్తి కావాలని నినదించారు. మీకు ఉద్యోగాలు కావాలంటే? మీ బతుకులు బాగుపడాలంటే మనకు ఏం కావాలి? అని జగన్ ప్రశ్నిస్తు ‘మాకు ప్రత్యేక హోదా కావాలని’ అని జనం పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ‘రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఆకాంక్ష ప్రత్యేక హోదా నాకు కాకినాడలో కనిపిస్తోంది’ అని జగన్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. మనకు హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు సింగపూర్, జపాన్ వెళ్లాల్సిన అవసరం లేదని జగన్ ప్రస్తావించినప్పుడు జనం చప్పట్లతో తమ మద్దతు తెలిపారు. అనంతరం జగన్ పార్టీ నేతలతో కలిసి కలెక్టరేట్‌లో డీఆర్వో యాదగిరికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు.
 
 విమానాశ్రయం నుంచే స్వాగత నీరాజనాలు
 జిల్లాలో జరిగే ధర్నాలో పాల్గొనేందుకు ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి మధురుపూడి విమానాశ్రయానికి ఉదయం 11.35కు చేరుకున్నారు. విమానాశ్రయం గేటు వద్ద పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజాలు వందలాది మంది మహిళలతో స్వాగతం పలికారు. కొమ్ముబూరలతో స్వాగతం పలికిన తీరు ఆకట్టుకుంది. మహిళతో జగన్ కొద్దిసేపు ముచ్చటించారు. దోసకాయలపల్లి చేరుకోగానే రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్, దేవీపట్నం జెడ్పీటీసీ నండూరి గంగరావుల ఆధ్వర్యంలో గిరిజనులు జగన్‌ను కలిసి విలీనమండలాల సమస్యలను ప్రస్తావించారు.
 
 వచ్చే నెల మూడో తారీఖున విలీన మండలంలో చేపట్టే తన పర్యటనపై జగన్ చర్చించారు. గ్రామంలో సర్పంచ్ కర్రి సూర్యకుమారి, రైతు నేత కర్రి నాగేశ్వరరావు, మండల పార్టీ నాయకుడు కోరాటి శ్రీను జగన్‌ను కలిశారు. రాజానగరం ఏడీబీ రోడ్డులో మాజీ ఎంపీ గిరిజాల వెంకటేస్వామినాయుడు ఆధ్వర్యంలో కడియం మండలానికి చెందిన నాయకులు కలిశారు. అక్కడ నుంచి జగన్ నేరుగా కాకినాడ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ధర్నా అనంతరం జగన్ సామర్లకోటలో షుగర్ ప్యాక్టరీ అతిథిగృహంలో పెద్దాపురం పార్టీ కో ఆర్డినేటర్ ఆధ్వర్యంలో పార్టీ సామర్లకోట మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు ఆవాల లక్ష్మీనారాయణతోపాటు నాయకులు జగన్‌ను కలిశారు.  
 
 ఇటీవల వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు జగన్‌మోహన్ రెడ్డి నగదు, షీల్డు అందజేశారు. బైపీసీలో 160కి 130 మార్కులు వచ్చిన ఆచంట హేమకు, ఎంపీసీలో 160కి 128 మార్కులు యర్రంశెట్టి రిషితకు 10 వేల నగదు, షీల్డులను జగన్ అందజేశారు.
 
 క్యాడర్‌లో ఉత్తేజం
 ప్రత్యేక హోదా కోసం కలెక్టరేట్ వద్ద పార్టీ చేపట్టిన ధర్నా విజయవంతం కావడం క్యాడర్‌లో ఉత్తేజాన్ని నింపింది. పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాకా కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహించిన ఆందోళన విజయవంతం కావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. దీనికితోడు ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కావడంతో పార్టీ శ్రేణులే కాకుండా మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలిరావడం, పార్టీ యంత్రాంగం ఒక తాటిమీదకు రావడం, అన్ని నియోజకవర్గాల నుంచి కో ఆర్డినేటర్లు, రాష్ట్ర, జిల్లా నాయకులు సమిష్ఠగా పనిచేయడమే ఈ విజయూనికి కారణంగా విశ్లేషుకులు భావిస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement