అర్ధ సత్యాలు, అబద్ధాలే.. | Sakshi
Sakshi News home page

`అర్ధ సత్యాలు, అబద్ధాలే..

Published Sun, Mar 8 2015 1:33 AM

అర్ధ సత్యాలు, అబద్ధాలే.. - Sakshi

హైదరాబాద్: గవర్నర్ ప్రసంగం అంతా అర్ధసత్యాలు, అబద్ధాలతో కూడుకుని ఉందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించిన అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభ లాబీల్లోని తన చాంబర్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు వల్లించారని తప్పుపట్టారు. "తుళ్లూరులో రాజధానికోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారనేది పెద్ద అబద్ధం. భూములను స్వచ్ఛందంగా ఇచ్చారో, లేక ఒత్తిడి చేసి.. వేధింపులకు గురిచేసి తీసుకున్నారో, అక్కడ భూములు పోగొట్టుకున్న వారి బాధేమిటో వాళ్లకే అర్థం అవుతుంది" అని ఆయన అన్నారు. "అక్కడ రైతులు ఎకరాకు లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ సంపాదిస్తున్నారు. ఏడాదికి మూడు నాలుగు పంటలు పండుతున్నాయి. రైతుకూలీలు కూడా పొలాల్లోనే ఉంటూ కూలి చేసుకుంటున్నారు.

భర్త రూ.500, భార్య రూ.300 చొప్పున సంపాదించుకుంటూ... నెలకు 20 నుంచి రూ.25 వేల ఆదాయం పొందుతున్నారు. వారి పిల్లలను కార్పొరేట్ కళాశాలల్లో చదివించుకుంటున్నారు. నారాయణ కళాశాలలో చదువుకునే పిల్లలు ఫీజులు కట్టడం ఒక్కరోజు ఆలస్యమైతే.. రోజుకు 26 సార్లు రైతు కూలీలకు ఫోన్లు చేసి ఫీజులు కట్టమని ఒత్తిడి తెస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో వారు జీవించడానికి ఆధారపడిన భూమిపోతే వారెలా బతకాలి? వారికి ఆధారమేమిటి?" అని జగన్ ప్రశ్నించారు. "అక్కడికెళ్లి వారి బాధలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. రైతులకు ఇష్టం లేకపోయినా భూములు లాక్కుంటున్నారు. రైతులను వేధిస్తున్నారక్కడ.. (కొందరు టీవీ చానల్ ప్రతినిధులను ఉద్దేశించి) నేను పర్యటనకు వెళ్లినపుడు మీరూ అక్కడ ఉన్నారు కదా! మైక్‌లు పెడితే రైతులేం చెప్పారో  చూశారు కదా..." అని అంటూ ధర్మం, అధర్మానికి మధ్య పోరాటం జరుగుతున్నపుడు ధర్మమే గెలుస్తుందని జగన్ పేర్కొన్నారు.

ప్రజలనే అడగాలి..
పవన్‌కల్యాణ్ కూడా మీకు తోడయినట్లున్నారని ఓ విలేకరి ప్రశ్నించగా... జగన్ నవ్వుతూ ‘‘ఆయన ఏం మాట్లాడుతున్నారో ప్రజలనే అడగాలి. నిన్న ఏం మాట్లాడారు, ఈ రోజు ఏం మాట్లాడారు. రేపు ఏం మాట్లాడతారో ప్రజలే ఆయన్ను అడగాలి’’ అని సమాధానమిచ్చారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తప్పులు జరిగాయని పవన్ చేసిన విమర్శలను ప్రస్తావించగా... ‘‘వైఎస్ చనిపోయి ఏడేళ్లయింది. చనిపోయిన వ్యక్తి గురించి ఇపుడు కొందరు మాట్లాడుతున్నారు. ఇపుడు జరుగుతున్న వాటిని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అని ఆయన ధ్వజమెత్తారు. ‘‘కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న చివరిరోజుల్లో ఇచ్చిన జీవో 13పై అప్పట్లో ఆయన మంత్రివర్గంలోని నలుగురు మంత్రులు ఫిర్యాదు చేస్తే గవర్నర్ దానిని పక్కన పెట్టేశారు. పెండింగ్‌లో ఉన్న ఆ ఆర్డర్‌ను ఉపసంహరిస్తూ మళ్లీ జీవో 22ను తాజాగా జారీ చేశారు. దీన్నెవరూ అడగరు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని 22 శాతం ఎక్సెస్(అధిక వ్యయానికి)కు ఇచ్చారు. ఆ ప్రాజెక్టు నిర్మాణ వ్యవధి ఒక్క ఏడాది, మళ్లీ దానికి బోనస్.. కాంట్రాక్టర్‌కోసం మొత్తం విధానాన్నే సమూలంగా మార్చేశారు. పవన్‌కల్యాణ్‌కు ఈ జీవో కనిపించలేదా? టెండర్ల విధానాన్నే మార్చేశారు కదా!’’ అని జగన్ ప్రశ్నించారు.

కేంద్ర బడ్జెట్‌పై బాబుది డ్రామా
"కేంద్ర బడ్జెట్ రాష్ట్రాన్ని నిరాశపర్చిందనడంలో రెండో మాటే లేదు. కానీ కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రుల చేత నువ్వు(చంద్రబాబు) మాట్లాడించిందేది? ఆంధ్రాకు నిరాశ ఎదురైందని చెప్పడం తప్ప మీ కేంద్ర మంత్రులతో ఎందుకు రాబట్టలేకపోతున్నారు? మీ మంత్రులను కేంద్రంలో కొనసాగిస్తూ, రాష్ట్రంలో బీజేపీ మంత్రులను కూడా కొనసాగిస్తూ రాష్ట్రానికి నిరాశ మిగిలిందని సన్నాయి నొక్కులు నొక్కుతూ మాట్లాడుతున్నారు. ఏమిటిదంతా డ్రామా కాదా? ఇది డ్రామానో కాదో చూసే వాళ్లకెవరికైనా కనిపిస్తుంది" అని జగన్ అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎదురైన నిరాశ గురించి ప్రతిపక్ష నేత ఎందుకు మాట్లాడటం లేదని టీడీపీ చేస్తున్న విమర్శలను ప్రస్తావించగా... "పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రోజే మా పార్టీ తరఫున  ఆర్థికవేత్త, అన్నిరకాలా అర్హతలున్న వ్యక్తి డీఏ సోమయాజులు స్పందించారు. మా పార్టీ వైఖరేంటో స్పష్టంగా తెలియజేశారు. కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని ఆరోజే చెప్పారు" అని జగన్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement