అండగా నేనున్నా... | Sakshi
Sakshi News home page

అండగా నేనున్నా...

Published Wed, Oct 17 2018 6:40 AM

YS Jagan Mohan Reddy Padayatra In Vizianagaram District - Sakshi

సాక్షిప్రతినిధి, విజయనగరం: ప్రత్యర్థుల గుండెలదురుతున్నాయి... జననేతకు అడుగడుగునా వస్తున్న ప్రజా స్పందన చూసి. అధికార పార్టీ నేతల కుతంత్రాలు అడుగడుగునా చిత్తవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలు తెలియజేస్తున్న వాస్తవాలు చూసి. ఎస్‌కోట నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభమయ్యే ముందు రోజు నుంచి వ్యతిరేక ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ  దుష్ఫ్రచారానికి ఒడిగట్టిన అధికారపక్షం అదే సంస్కృతి ని  విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం ని యోజకవర్గాల్లో కొనసాగింది. 

తాజాగా బొబ్బిలి నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేని ఆ పార్టీ నాయకులు బాడంగి మండలం ముగడ గ్రామంలోనూ ఫ్లెక్సీలను అర్ధరాత్రి వేళ తొలగించి వారి అక్కసు వెళ్లగక్కారు. అధికార పార్టీ నేతలు ఎన్ని దుష్ప్రచారాలు, దుశ్చర్యలకు పాల్పడినా ప్రజలు మాత్రం జననేతకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ‘ముగడ పిలుపు... జగన్‌ పిలు పు...’ ‘జగన్‌ కావాలి...జగన్‌ రావాలి...’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ వారి మద్దతును తెలియజేశారు. పెద్ద సంఖ్యలో వృద్ధులు, మహిళలు, రైతులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, వి ద్యార్థులు పాదయాత్రలో పాల్గొని జగనన్న అడుగులో అడుగు వేస్తూ సంపూర్ణ మద్దతు తెలిపారు.

బాడంగిలో స్పందన భేష్‌!
జిల్లాలో జననేత కొనసాగిస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్రకు బొబ్బిలి నియోజకవర్గంలో అఖం డ స్వాగతం లభించింది. మంగళవారం బాడంగి మండలం లక్ష్మీపురం క్రాస్‌ నుంచి పాదయాత్ర మొదలై బాడంగి మీదుగా ముగడ గ్రామానికి చేరుకుంది. అక్కడి నుంచి భోజన విరామానంతరం చిన భీమవరం క్రాస్, పెద భీమవరం మీదుగా రాత్రి బస వద్దకు చేరుకుంది. లక్ష్మీపురం క్రాస్‌ వద్ద ఉదయం పాదయాత్ర ప్రారంభించే సమయానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వేదపండితులు మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించారు. దారిపొడవునా మహిళలు బారులు తీరా రు. అభిమాన నాయకుడు రాగానే నుదుట విజ య తిలకం దిద్ది హారతులు పట్టారు. బాడంగిలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని జననేత సమక్షంలో పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. 

ఆ మాటే వారికి కొండంత అండ
జననేతకు అడుగడుగునా వినతులు వెల్లువెత్తా యి. ఆయన ఓదార్పు మాట వారికికొండంత భరోసానిస్తోంది. టీడీపీ అ«ధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెరకును పండించే వారికి కష్టాలకు అంతులేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత వైఎస్సార్‌ హయాంలో నియమితులైన 104 సర్వీసు ఉద్యోగుల బతులు ఇప్పుడు దుర్భరంగా మారాయని, సకాలంలో వేతనాలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేలాది టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవటంతో వి ద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతుందని విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు చెప్పారు.

 వేగావతినదిపై వంతెన నిర్మిస్తామని మంత్రి సుజయ్‌ మాట ఇచ్చి మరిచిపోయారని గొల్లాది గ్రామస్తులు విపక్షనేతను కలిసి వివరించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే విశ్వబ్రాహ్మణలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామన్న జననేతకు వారు ధన్యవాదాలు తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు కళాశాలల్లో పని చేస్తోన్న ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారిందంటూ వాపోయారు. రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లయినా... తెలం గాణాలో పని చేస్తున్న ఆంధ్ర ఉపాధ్యాయులకు విముక్తి లభించలేదని సొంత రాష్ట్రానికి బదిలీ చేయటం లేదని పలువురు ఉపాధ్యాయులు తమ గోడు వినిపించారు. పాదయాత్రలో పలుచోట్ల వైఎస్‌ జగన్‌ను కలసిన వివిధ వర్గాలవారు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అందరితో ఆప్యాయంగా మాట్లాడిన వైఎస్‌ జగన్‌ వారిలో భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. 

నాయకుని వెంట నడిచిన సైనికులు: 
పాదయాత్రలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రామ్స్‌ కమిటీ కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజ్, బొబ్బిలి, నెల్లిమర్ల  నియోజకవర్గాల సమన్వయకర్తలు శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, పెనుమత్స సాంబశివరాజు, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, నెల్లిమర్ల జెడ్పీటీసీ గదల సన్యాసినాయుడు, బాపట్ల మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్థనరెడ్డి, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ ఎస్‌.వి.రమణరాజు, పెనుగొండ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.శంకరనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

ఏమ్మా పిల్లాడి కళ్లకు ఏమైంది? 
ప్రజా సంకల్ప యాత్రలో ఇసుక వేస్తే రాలనంత జనం. ఎంతో మంది తమ కష్టాలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బాడంగి మండలం పెద భీమవరానికి చెందిన మహిళ పిట్ట నరసమ్మ జగనన్న వద్దకు మానసిక వ్యాధి గ్రస్థులయిన తన ఇద్దరు పిల్లలను చూపించి ఆదుకోవాలని కోరేందుకు వచ్చింది. కానీ పెద్ద ఎత్తున జనం రావడంతో ఆ తోపులాటలో ఇబ్బంది కల్గించడం ఇష్టం లేక నమస్కారమన్నా అని పలకరించి వచ్చేయబోతుండగా గమనించిన జగన్‌ మోహన్‌ రెడ్డి ఏమ్మా మీ పిల్లలకు ఏమైంది? కళ్లు ఎందుకలా ఉన్నాయి? అని స్వయంగా అడిగి తెలుసుకుని వారి అనారోగ్యాన్ని తెలుసుకున్నారు.

 దీంతో నరసమ్మ మాట్లాడుతూ మా పిల్లలు కృష్ణ, తులసిలు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని కన్నీటి పర్యంతమైంది. పిల్లలను ఆదుకునేందుకు తన వ్యక్తిగత సిబ్బందికి సూచనలు చేసి అక్కడి నుంచి పాదయాత్రలో లీనమైపోయారు జగన్‌. పిల్లల విషయాన్ని చెప్పేందుకు మొహమాట పడిన నరసమ్మ స్వయంగా జగన్‌ మోహన్‌ రడ్డి గుర్తించి అడగటంతో ఆమె ఆనంద భాష్పాలు రాల్చుతూ తన పిల్లల వివరాలను వివరించింది. గొర్రెల కాపరి అయిన భర్త తెచ్చే సంపాదనతో పిల్లలను పెంచుతున్నాం తప్ప వైద్యం చేయించే స్థోమత లేదనీ చెప్పుకొచ్చింది. 

Advertisement
Advertisement