ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభ చరిత్రలో నిలిచిపోవాలి | Sakshi
Sakshi News home page

ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభ చరిత్రలో నిలిచిపోవాలి

Published Sat, Jan 5 2019 8:11 AM

YS Jagan Mohan Reddy Public Meeting in Ichapuram Srikakulam - Sakshi

శ్రీకాకుళం(పీఎన్‌కాలనీ): ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ఈ నెల 9వ తేదీన ఇచ్ఛాపురంలో ముగియనుందని, ముగింపు సభ చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఏడాదిపైగా 3500 కిలోమీటర్లు పైచిలుకు పాదయాత్ర చేస్తూ ప్రజాసమస్యలపై జగన్‌ అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. చివరి బహిరంగసభ జన ప్రభంజనం సృష్టించేలా జయప్రదం చేయాలని కోరారు. శ్రీకాకుళం నగరంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  కార్యాలయంలో పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అధ్యక్షతన ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభపై సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ సత్తా ఏంటో ఈ ముగింపు సభకు వచ్చే జనాలను బట్టి తెలుస్తుందన్నారు. జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర, బహిరంగ సభలకు వేలాదిగా తరలివచ్చారని ఎక్కడా వైఫల్యం చెందలేదన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినప్పుడు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగిందని చెప్పారన్నారు. జగనన్న ఆశలను పదిలంగా ఉంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, రానున్న ఎన్నికల సీజన్‌లో పార్టీ శ్రేణులంతా సైనికుల్లా కష్టపడి పనిచేయాలని కోరారు. ముగింపు సభకు వచ్చే జనాలను చూసి టీడీపీ నాయకులు మన పనైపోయింది, తట్టాబుట్టా సర్దుకుని ఇంటికి వెళ్లిపోవాల్సిందేనన్న భావం వారిలో కలగాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, కార్యవర్గ సభ్యులు, మండల పార్టీ నాయకులు, బూత్‌కమిటీ కన్వీనర్లు, సభ్యులు, పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్‌ అభిమానులు అందరూ వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటూ ముగింపు సభకు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు.

అంచనాలకు అందకుండా...
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో అందరి చూపు ఇచ్ఛాపురంలో జరగనున్న పాదయాత్ర ముగింపు సభపైనే ఉందన్నారు. ఈ ముగింపు సభ ఎవ్వరికి అంచనాలకు దొరక్కుండా ఉండాలన్నారు. దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇదే ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగింపు చేసి పైలాన్‌ నిర్మించి 2004 ఎన్నికల్లో విజయదుందుభి మోగించారన్నారు. అదే స్ఫూర్తితో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పూర్తిచేస్తున్నారని, అదే విధంగా విజయ దుందభి మోగించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన ప్రజాసంకల్పయాత్రకు ప్రజల నుంచి అపురూప ఆదరణ లభించిందన్నారు. ముగింపు సభకు ముందుగానే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కేడరంతా సన్నాహక సమావేశాలు నిర్వహించి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కంబాల జోగులు, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్తలు పిరియా సాయిరాజ్, నర్తు రామారావు, ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, పలాస సమన్వయకర్త శీదిరి అప్పలరాజు, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్‌ మాట్లాడుతూ పాదయాత్ర ముగింపు సభ విజయవంతానికి కృషిచేస్తామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముగిసిందని అందుకు పార్టీ శ్రేణులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసంకల్పయాత్ర స్వాగత కార్యక్రమానికి ఏస్థాయిలో జనాలు వచ్చారో అదే స్థాయిలో ముగింపు కార్యక్రమానికి రావాలని కోరారు. అంతేకాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి అధికంగా పార్టీ ముఖ్యులు హాజరవుతారన్నారు. అందుకు తగ్గుట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని పిరియా సాయిరాజ్‌ తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్యులు పాలవలస విక్రాంత్, అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, చింతాడ మంజుల, తమ్మినేని చిరంజీవి నాగ్‌(నాని), ఎన్ని ధనుంజయరావు, సురంగి మోహనరావు, కె.ఎల్‌.ప్రసాద్, గొండు కృష్ణమూర్తి, మూకళ్ళ తాతబాబు, గొండు రఘురాం, పీస శ్రీహరి, పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ మండల నాయకులు, బూత్‌కమిటీ కన్వీనర్లు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement