పులివెందుల తరహాలో నంద్యాల అభివృద్ధి | Sakshi
Sakshi News home page

పులివెందుల తరహాలో నంద్యాల అభివృద్ధి

Published Sat, Aug 12 2017 1:59 AM

పులివెందుల తరహాలో  నంద్యాల అభివృద్ధి - Sakshi

ఆదరించండి... మీ అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుంటా
చంద్రబాబు పాలనలో మూడేళ్లుగా కేసీకి నీరు రాలేదు
అవినీతి పాలన అంతానికి మీరే నాంది పలకాలి
కేసీ ఆయకట్టు స్థిరీకరణ కోసం ‘గుండ్రేవుల’ నిర్మిస్తాం
రోడ్‌షోలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
జనసంద్రమైన పాండురంగాపురం, పోలూరు
పూలబాటతో స్వాగతం పలికిన ప్రజలు


నంద్యాల నుంచి సాక్షి ప్రతినిధి : ‘నంద్యాలను పులివెందుల నియోజకవర్గం తరహాలో అభివృద్ధి చేస్తాం. ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత నాదే. ఆదరించండి..మీ అభిమానాన్ని నా గుండెల్లో పెట్టుకుంటా. అవినీతి పాలన అంతానికి మీరే నాంది పలకాలి. రాబోవు కురుక్షేత్ర యుద్ధంలో విజయానికి ఇక్కడి నుంచే బీజం వేయాల’ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. ‘నంద్యాల ఉప ఎన్నిక ధర్మానికి –అధర్మానికి, న్యాయానికి –అన్యాయానికి మధ్య జరుగుతోంది.ఈ పోరాటంలో మీరంతా ధర్మం, న్యాయానికి మద్దతుగా నిలవాలని  కోరుతున్నా. రాక్షస పాలనకు చరమగీతం పాడండి’ అంటూ  పిలుపునిచ్చారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడో రోజైన శుక్రవారం నంద్యాల మండలం క్రాంతినగర్, చాపిరేవుల, సుబ్బారెడ్డిపాళెం, బాపూజీనగర్, పాండు రంగాపురం, ఊడుమాల్పురం, పోలూరు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కోసం నంద్యాలను జిల్లా కేంద్రంగా మార్చనున్నామన్నారు. తద్వారా ఇక్కడ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు.

చంద్రబాబు మరోమారు మోసగిస్తున్నారు
‘రైతులకు రుణమాఫీ చేస్తానని మోసగించారు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు అన్యాయం చేశారు. ఇంటింటికీ ఉద్యోగమన్నారు.. లేదంటే నెలకు రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. వీటిలో ఒక్కటైనా అమలు చేశారా? చెప్పిన అబద్ధాలే చెప్పి సీఎం పీఠం చేజిక్కించుకున్నారు. మళ్లీ అలాంటి అబద్ధాలతో నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా టేప్‌ రికార్డర్‌ ఆన్‌ చేస్తున్నారు. బాబు మాటు నమ్మి మరోమారు మోసపోవద్ద’ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రిగా 2014 ఆగస్టు 15న కర్నూలులో జాతీయ జెండా ఆవిష్కరించి, ఈ జిల్లాకు అనేక హామీలు గుప్పించారని గుర్తు చేశారు. ఎయిర్‌పోర్టు, స్మార్ట్‌సిటీ, సూపర్‌ స్పెషాలిటీì ఆస్పత్రి, ఉర్దూ యూనివర్సిటీ, కేసీ కెనాల్‌ స్థిరీకరణకు గుండ్రేవుల ప్రాజెక్టు, సిద్ధశ్వరం అలుగు నిర్మిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వీటిలో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. ‘మా నాన్న గారి హయాంలో కేసీ కెనాల్‌ పరిధిలో రెండు పంటలకు నీరు వచ్చేది. ఈ మూడేళ్లుగా ఒక్క పంటకు కూడా నీరు అందని పరిస్థితి చూస్తున్నాం. కేసీ కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరణ కోసం గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తామ’ని హామీ ఇచ్చారు.

నమ్మకం.. విశ్వసనీయతే నాస్తి
‘చంద్రబాబు లాగా నా వద్ద డబ్బు లేదు. మూడున్నరేళ్లలో రూ.3.5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. తానా అంటే తందానా అనే అనుకూలమైన మీడియా ఛానెళ్లు చంద్రబాబుకు ఉన్నట్లు నాకు లేవు. ఆయనకున్నన్ని పత్రికలూ లేవు. నాకున్న ఆస్తి నాన్నగారు ఇచ్చిపోయిన ఇంత పెద్ద కుటుంబమే. వైఎస్‌ జగన్‌ అంటే నమ్మకం, వైఎస్‌ జగన్‌ అంటే విశ్వసనీయత. నాన్నగారి లాగే సంక్షేమ పాలన చేపట్టాలని ‘నవరత్న’ పథకాలను ప్లీనరీలో ప్రవేశపెట్టాం. వాటిని ఇంటింటికీ తీసుకెళ్లాలి. ఈ ఎన్నికలే గీటురాయి కావాల’ని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌  పిలుపునిచ్చారు.

రోడ్‌షోకు విశేష స్పందన
వైఎస్‌ జగన్‌ రోడ్‌షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎంత ఆలస్యమైనా ప్రజలు రోడ్ల వెంబడి వేచిచూశారు. వృద్ధులు సైతం జననేతను చూసేందుకు ఎగబడ్డారు. ‘మా బిడ్డ ఊరి నుంచి వెళ్తుంటే చూడకుండా ఎలా ఉండగలం నాయనా?!’ అంటూ నడవలేని స్థితిలో నడుం వంకరగా మారినా ఊతకర్ర సాయంతో నిల్చున్న వృద్ధురాలు పోలూరు సుబ్బమ్మ పేర్కొనడం గమనార్హం. వారి ఆకాంక్షకు అనుగుణంగా వైఎస్‌ జగన్‌ సైతం వృద్ధులు, మహిళలు, వికలాంగులు ఇలా కన్పించిన ప్రతి ఒక్కర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.  ప్రతిపల్లెలోనూ పసిబిడ్డల్ని  అక్కున చేర్చుకొని ఆత్మీయత పంచారు. పోలూరు గ్రామానికి చెందిన సుబ్బరాయుడు ఇటీవల మృతి చెందగా.. ఆయన కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శించారు.

పోటెత్తిన పాండురంగాపురం, పోలూరు
వైఎస్‌ జగన్‌ రోడ్‌షో సందర్భంగా పోలూరు, పాండురంగాపురం గ్రామాలు పోటెత్తాయి. చిన్నాపెద్ద  తేడా లేకుండా ఈ గ్రామస్తులంతా రోడ్‌షోకు తరలివచ్చారు.  జగన్‌ వస్తున్న రహదారి వెంబడి పూలబాట వేశారు. పూలతోనే రోడ్డుపై స్వాగతం పలుకుతూ రాతలు రాశారు. పాండురంగాపురం గ్రామప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆరాధ్యదైవాన్ని ఊరేగించినట్లుగా రోడ్‌షో కొనసాగించారు. పోలూరులో వేలాది మంది  గ్రామ నడిబొడ్డుకు చేరి జగన్‌ను స్వాగతించారు. మిద్దెలపై సైతం వేచివుండి జననేత ప్రసంగానికి జేజేలు పలికారు. రోడ్‌షోలో బాపూజీనగర్‌ వాసులు.. ‘నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నాం. ఎకరా స్థలం ఇస్తే మేమూ చెరువు నిర్మించుకుంటాం. పాండురంగాపురం వాసులతో ఇప్పించండి’ అని కోరారు. తనపై అభిమానంతో తోటి రైతులకు అండగా నిలవాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి పీపీ నాగిరెడ్డి పాల్గొన్నారు.  

ప్రచారంలో ఓదార్పు
ఈ నెల 3న నంద్యాలలో జరిగిన బహిరంగ సభకు హాజరై గుండెపోటుతో మృతి చెందిన పోలూరుకు చెందిన తప్పెట సుబ్బరాయుడు అనే దళితుడి ఇంటికి వైఎస్‌ జగన్‌  వెళ్లి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. జగన్‌ను చూసి సుబ్బరాయడు భార్య కన్నీటి పర్యంతమైనప్పుడు ఆమెను ఓదారుస్తూ... ‘అధైర్య పడొద్దమ్మా..నేను అండగా ఉంటా’నని హామీ ఇచ్చి ముందుకు కదిలారు. జగన్‌ ఓదార్పుతో సుబ్బరాయుడు కుటుంబానికి స్వాంతన చేకూర్చినట్లయ్యింది.

సుబ్బరాయుడు కుటుంబాన్ని ఓదార్చుతున్న
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Advertisement
Advertisement