సామాన్యులపై పెనుభారం: జగన్ | Sakshi
Sakshi News home page

సామాన్యులపై పెనుభారం: జగన్

Published Sat, Jun 21 2014 2:02 AM

సామాన్యులపై పెనుభారం: జగన్ - Sakshi

సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రైల్వే చార్జీలను ఉన్నట్టుండి భారీగా పెంచడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు..ప్రయాణికుల చార్జీలను ఏకంగా 14.2 శాతం పెంచడం వల్ల సామాన్యులపై మోయలేని భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సరుకు రవాణా చార్జీల పెంపు అనేక రంగాలపై ప్రభావం చూపుతుందని, దాని వల్ల కూడా సామాన్యులపైనే పెనుభారం పడుతుందని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారని,  చార్జీల పెంపుతో వారి నడ్డి విరిచారని విమర్శించారు. పెంపు వల్ల నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదముందని, పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో కేంద్రం రైల్వే చార్జీలను ఏకపక్షంగా పెంచడం దారణమని పేర్కొన్నారు.
 
 తక్షణం తగ్గించాలి: సీపీఎం
 రైల్వే చార్జీల పెంపును సీపీఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ తీవ్రంగా ఖండించింది. పెంచిన చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. గత కాంగ్రెస్ పభుత్వం ఎన్నో భారాలు మోపి సామాన్యుల జీవితాలను దుర్బరం చేసిందని, బీజేపీ ప్రభుత్వం దాని దారిలో నడుస్తోందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఓ ప్రకటనలో ఆరోపించారు.

Advertisement
Advertisement