కాపు రిజర్వేషన్లపై జగన్‌ మాటలను వక్రీకరిస్తున్నారు | Sakshi
Sakshi News home page

కాపు రిజర్వేషన్లపై జగన్‌ మాటలను వక్రీకరిస్తున్నారు

Published Tue, Jul 31 2018 11:18 AM

YS Jagan Mohan Reddy Words Distorted Says YSRCP MLA Adimulapu suresh - Sakshi

యర్రగొండపాలెం (ప్రకాశం): జగ్గంపేట సభలో కాపుల రిజర్వేషన్లకు సంబంధించి వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాట్లాడిన మాటలను ఒక వర్గం మీడియా, టీడీపీ, కొందరు నాయకులు రాజకీయ స్వార్థం కోసం వక్రీకరించి జగన్‌ వ్యాఖ్యల స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి,  సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ సోమవారం వేర్వేరు ప్రకటనలో ప్రకటనల్లో మండిపడ్డారు. జగన్‌పై బురదజల్లే ప్రయత్నాన్ని మానుకోవాలని హితవు పలికారు. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కాపులతో సహా ఆయా రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న వారి డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

ఇవన్నీ తెలిసి తనకు ఓట్లు వేస్తే ఆరు నెలల్లో రిజర్వేషన్‌ కల్పిస్తామని కాపులకు చంద్రబాబు హామీ ఇచ్చి నిలువునా మోసం చేశారన్నారు. మంజునాథ కమిషన్‌ను ఏర్పాటు చేసిన చంద్రబాబు ఆ కమిషన్‌ చైర్మన్‌ సంతకం లేకుండా నివేదిక స్వీకరించి బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే న్యాయపరమైన అడ్డంకులు లేకుండా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో పొందుపరచుకునేలా చంద్రబాబు ఎందుకు ప్రయత్నం చేయలేకపోయారని జంకె వెంకటరెడ్డి ప్రశ్నించారు. నాలుగేళ్లపాటు కేంద్రంలో అధికారంలో ఉండి, చంద్రబాబు 9వ షెడ్యూల్‌లో రిజర్వేషన్లు పెట్టించి ఉంటే ఈ పరిస్థితి రాదన్నారు.

తమిళనాడు, కర్నాటక తరహాలో బీసీల ప్రయోజనాలు, హక్కులకు భంగం కలగకుండా, ఏ మాత్రం నష్టం జరగకుండా 50 శాతానికి మించి కాపులకు రిజర్వేషన్లు వచ్చి ఉండేవి కాదా అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబులా తాను గాలి మాటలు చెప్పలేనని, బూటకపు హామీలు ఇవ్వలేనని జగ్గంపేట సభలో జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారన్నారు. తుని ఘటనకు స్పందనగా కాపుల రిజర్వేషన్లపై ఆ రోజు తమ పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాటలకు పార్టీ కట్టుబడి ఉందని, తాము ఎప్పుడూ మాట మార్చలేదని స్పష్టం చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడంపై వైఎస్సార్‌ సీపీ చిత్తశుద్ధితో ఉందన్నారు.

కాపుల్లో ఆర్థికాభివృద్ధికి ఐదేళ్లలో 5 వేల కోట్లు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు రూ.1300 కోట్లు మాత్రమే ఇచ్చారని, చంద్రబాబు ఇస్తానన్న రూ.5 వేల కోట్లకు రెట్టింపు స్థాయిలో అంటే రూ.10 వేల కోట్లు ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారన్నారు. కాపుల మీద ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలని ప్రశ్నించారు. బీసీల ప్రయోజనాలు, హక్కులకు భంగం కలగకుండా ఏ మాత్రం నష్టం వాటిల్లకుండా కాపు రిజర్వేషన్ల విషయంలో సలహాలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. టీడీపీ–బీజేపీ ఇచ్చిన హామీలకు నాదీ బాధ్యత అని చెప్పిన పవన్‌కల్యాణ్‌ వారిని ప్రశ్నించకుండా, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌ సీపీని ప్రశ్నించడంలో ఆంతర్యం ఏమిటని అన్నారు. ముద్రగడ పద్మనాభం ఒక అజెండా పెట్టుకుని వేరొకరితో రాజకీయంగా ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో వైఎస్సార్‌ సీపీపై, జగన్‌పై అభాండాలు వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

Advertisement
Advertisement