ప్రజాసంకల్పయాత్ర 3 నుంచి ప్రారంభం | Sakshi
Sakshi News home page

ప్రజాసంకల్పయాత్ర 3 నుంచి ప్రారంభం

Published Thu, Nov 1 2018 8:28 AM

YS Jagan Praja Sankalpa Yatra Starts From 3rd November - Sakshi

విజయనగరం, పార్వతీపురం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్ప యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) పిలుపునిచ్చారు. పార్వతీపురం పట్టణంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలతో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి జరిగిన తరువాత మొట్టమొదటిసారిగా పార్వతీపురం బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారని తెలిపారు. ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి నవంబర్‌ 6 నాటికి ఏడాది కాలం పూర్తి చేసుకోవడం మరో విశేషమన్నారు. ఇంత ప్రాధాన్యత కలిగిన బహిరంగ సభ పార్వతీపురం వేదికగా జరగడం నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావించాలన్నారు. పార్వతీపురంలో జరగబోయే బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి ఏం మాట్లాడబోతారని యావత్తు రాష్ట్ర ప్రజలతో పాటు దేశంలోని రాజకీయ ప్రముఖులు ఎదురు చూస్తున్నారన్నారు.

ఈ నెల 3న పాదయాత్ర మళ్లీ ప్రారంభమవుతుందని, 4న ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్‌ మోహన్‌రెడ్డి పార్వతీపురం నియోజకవర్గంలో అడుగు పెడతారని, 6న పార్వతీపురం పాతబస్టాండ్‌లో బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. సభకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు తరలిరావాలని పిలుపునిచ్చారు. అరకు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ జగన్‌ మోహన్‌ రెడ్డి జనంకోసం పరితపిస్తున్నారని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా అధైర్యపడకుండా ముందుకు సాగుతున్న ధైర్యశీలిగా కొనియాడారు. ఆయనను చూసి నేర్చుకోవల్సింది ఎంతో ఉందన్నారు. మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, బూత్‌ కన్వీనర్లు సమన్వయంతో  పనిచేసి ప్రజా సంకల్పయాత్రను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు మాట్లాడుతూ పార్వతీపురం నియోజకవర్గంలో జరిగే ప్రజా సంకల్పయాత్రను విజయవంతం చేయడానికి ప్రతీ కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలన్నారు.

ఎవరికి ఎలాంటి సందేహాలు వచ్చినా, సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తీసుకువస్తే తగిన పరిష్కారమార్గం చూపిస్తానన్నారు. సీనియర్‌ నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేయడానికి సమష్టిగా కృషిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసెల్‌ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, మండల కన్వీనర్‌ బోను రామినాయుడు, ఫ్లోర్‌ లీడర్‌ మంత్రి రవికుమార్, జిల్లా వాణిజ్య విభాగం నాయకులు ఇండుపూరు గున్నేష్, సీనియర్‌ నాయకులు యందవ నిర్మలాకుమారి, మజ్జి నర్సింగరావు, అంబటి శ్రీరాములనాయుడు, అప్పలనాయడు, మాజీ సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement