17వ రోజు పాదయాత్ర డైరీ | Sakshi
Sakshi News home page

17వ రోజు పాదయాత్ర డైరీ

Published Sun, Nov 26 2017 1:00 AM

ys jagan prajasankalpayatra 17th day diary - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

25–11–2017, శనివారం
రామకృష్ణాపురం, కర్నూలు జిల్లా

ఆటవిక సంస్కృతికి చరమగీతం పాడాలి

పత్తికొండ నియోజకవర్గంలో గత 24 సంవత్సరాలుగా తెలుగు దేశం పార్టీయే అధికారంలో ఉంది. కానీ, నియోజకవర్గంలో ఎక్కడ చూసినా దారిద్య్రం తాండవిస్తోంది. రోడ్డు, రవాణా, ప్రజారోగ్యం, గృహ కల్పన, తాగునీటి సౌకర్యం.. అన్నీ దీనావస్థలో ఉన్నాయి. ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. ఈ స్థితికి మోక్షం ఎప్పుడో?

చెరుకులపాడు గ్రామంలోకి  ప్రవేశించగానే కొద్ది నెలల క్రితం జరిగిన దారుణ మారణకాండ గుర్తుకు వచ్చి మనసు కలత చెందింది. అధికార పార్టీ నాయకుల అవినీతి, అక్రమాలను ప్రశ్నించాడని, వారి రాజకీయ భవిష్యత్తుకు ఎక్కడ అడ్డంకిగా మారతాడోనని భయపడి నారాయణరెడ్డిగారిని దారుణంగా హత్య చేయించారు. ఇది ఏ సంస్కృతికి నిదర్శనం? మనం ఎటువైపు పయనిస్తున్నాం? ఈ రాక్షస పాలన అంతం కావాలి. ఈ ఆటవిక సంస్కృతికి చరమగీతం పాడాలి. అధికార పార్టీ ఎంతటి దౌర్జన్యాలకు, అణచివేతకు పాల్పడుతున్నా, మన వెన్నంటి నిలిచిన కార్యకర్తలకు మనోధైర్యాన్నివ్వాలని, భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్నా.. నమ్ముకున్న జనం కోసం, పార్టీ కోసం పోరాడుతున్న శ్రీదేవమ్మ గారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. అందుకే రాష్ట్రంలోనే మొట్టమొదటగా శ్రీదేవమ్మ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశాను. 

ఈ రోజు నాగరాజు అనే ఆర్టీసీ డ్రైవర్‌ కలిశాడు. 1974లో ఆర్టీసీలో చేరిన ఆయన 35 సంవత్సరాలు సంస్థకే జీవితాన్ని అంకితం చేసి, ఆరోగ్యాన్ని సైతం కోల్పోయి, 2008లో పదవీ విరమణ చేశాడు. ఆయన అందుకున్న చివరి జీతం 18,000 రూపాయలు. ఇప్పుడు వస్తున్న పింఛన్‌ 1,650 రూపాయలు! గుండె బరువెక్కింది. అంత చిన్న మొత్తంతో వృద్ధాప్యంలో బతుకు బండిని ఎలా లాగగలడు? జీవితానికి కనీస భద్రత కూడా ఉండనవసరం లేదా? పదవీ విరమణ తర్వాత ఏ ఉద్యోగికైనా అభద్రత లేకుండా ప్రశాంతంగా జీవించడానికి కావాల్సిన భరోసా కల్పించాలి. 

స్కూల్లో మధ్యాహ్న భోజనం వండే మహిళలు కలిశారు. గత ఆరు నెలలుగా తమకు రావాల్సిన చెల్లింపులు రాలేదని వాపోయారు. అలాగే మోడల్‌ స్కూల్‌ సిబ్బంది కలిశారు. వారికి ఐదు నెలలుగా వేతనాలివ్వడం లేదట. పేద పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించి, వారి హాజరును మెరుగుపరిచి, అక్షరాస్యతను పెంపొందించడానికి ఉద్దేశించిన మధ్యాహ్న భోజన పథకంపై ఈ ప్రభుత్వానికి ఎంత శ్రద్ధో! 

ప్రభుత్వ హాస్టళ్లను, స్కూళ్లను మూసివేయించడం, ప్రతిష్టాత్మకమైన మోడల్‌ స్కూళ్లలో పని చేసే అధ్యాపకులకు కూడా వేతనాలు ఇవ్వకపోవడం, ఆ స్కూళ్లలో తగిన సౌకర్యాలు కల్పించకపోవడం.. ఈ చర్యలన్నీ మీ బినామీలైన కార్పొరేట్‌ విద్యా మాఫియాకు లబ్ధి చేకూర్చడం కాదా? మీ పాలనలో, మీ అండదండలతో ఇప్పటి వరకు అనేక రాజకీయ హత్యలు జరగడం వాస్తవం కాదా? హత్యా రాజకీయాలను ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరీ ప్రోత్సహించడాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు?   
- వైఎస్‌ జగన్‌ 

Advertisement
Advertisement