పాదయాత్ర @ 3500 కిలోమీటర్లు | Sakshi
Sakshi News home page

పాదయాత్ర @ 3500 కిలోమీటర్లు

Published Sun, Dec 23 2018 5:16 AM

YS Jagan PrajaSankalpaYatra @ 3500 km - Sakshi

వేలాది మంది జనం సాక్షిగా, పార్టీ నేతలు, కార్యకర్తల జైజగన్‌ నినాదాల నడుమ శనివారం ప్రజా సంకల్ప యాత్ర మరో మైలు రాయిని అధిగమించింది. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో గత ఏడాది నవంబర్‌ 6వ తేదీన ఒక్క అడుగుతో మొదలైన ఈ యాత్ర.. వందలు.. వెయ్యి.. రెండు వేలు.. మూడు వేలు దాటుకుని 3,500 కిలోమీటర్లనూ అధిగమించింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని రావివలస ఈ చారిత్రక ఘట్టానికి వేదికైంది. ఇందుకు గుర్తుగా జగన్‌ మామిడి మొక్కను నాటారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇప్పటిదాకా పాదయాత్ర సాగిన జిల్లాల్లో ఆబాలగోపాలం వైఎస్‌ జగన్‌ వెంట అడుగులో అడుగేసింది. పాలకుల మోసాలను, అవినీతిని, అబద్ధాల పురాణాన్ని జగన్‌ ఊరూరా నడిరోడ్డులో నిగ్గదీసి కడిగేస్తుంటే అన్ని వర్గాల ప్రజలు జైకొట్టారు. జగన్‌ సీఎం అయితేనే అందరి కష్టాలు తీరతాయని ఆకాంక్షించారు. ‘అన్నా.. నాలుగున్నరేళ్లుగా కష్టాలే.. అడుగడుగునా వేధింపులే.. ఇక భరించలేం.. మేమంతా మీ వెంటే.. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనంపుతాం..’ అంటూ మహిళలు, యువత బహిరంగంగా శపథం చేయడం కనిపించింది.

మన బాగు కోసం రాజన్న బిడ్డ నడుచుకుంటూ వస్తున్నాడని అవ్వాతాతలు ఓపికతో ఎదురు చూస్తుండటమూ కనిపించింది. ఇన్నాళ్లూ మోసపోయాం.. మీరే మా నాయకుడంటూ జగన్‌ను తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అక్కున చేర్చుకుని కష్టాలు ఏకరువు పెట్టడం.. వారందరికీ జగన్‌ ధైర్యం చెప్పడమూ చూశాం. దారిపొడవునా జగన్‌ అందరి కష్టాలు ఓపికతో విని ధైర్యం చెబుతూ, భవిష్యత్తుపై భరోసా ఇస్తున్న తీరు ‘లీడర్‌ అంటే ఇలా ఉండాలి’ అనేలా చేసింది. పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వారి చేష్టలే చెప్పకనే చెబుతున్నాయి. టెక్కలిలో సభకు జనం రాకుండా చేయాలని పడరాని పాట్లు పడటం కనిపించింది. ఇదే రోజు సీఎం శ్రీకాకుళంలో ధర్మపోరాట దీక్ష అంటూ సభ ఏర్పాటు చేశారు. భారీగా బస్సులు, లారీలు, కార్లు పంపారు. ఇవేవీ జగన్‌ సభకు తరలి వస్తున్న జనాన్ని ఆపలేకపోవడం చూస్తుంటే ఎంతగా ఆదరణ ఉందో తెలుస్తోంది. 3,500 కి.మీ అధిగమించి చారిత్రక ఘట్టానికి వేదికైన రావివలసలో జగన్‌కు జనం ఘన స్వాగతం పలికారు.    
– టెక్కలి

Advertisement

తప్పక చదవండి

Advertisement