పోగుపడిన బంధం జగనన్నతో జవసత్వాలు | Sakshi
Sakshi News home page

పోగుపడిన బంధం జగనన్నతో జవసత్వాలు

Published Wed, Mar 13 2019 12:46 PM

YS Jagan Promise To Handloom Workers - Sakshi

ఖాయిలా పడ్డ చేనేత రంగాన్ని ఆదుకునేందుకు, నేతన్నల జీవితాల్లో వెలుగు నింపేందుకు వైఎస్సార్‌సీపీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ ఎంతగానో తోడ్పడనుంది. అలాగే ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ‘నవరత్నాలు’ ఈ రంగానికి పూర్వ వైభవం తీసుకురానున్నాయి. జగన్‌ తమపై చూపిన ఆదరణతో నేతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చేనేత రంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న ఆ పార్టీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్తకేతిరెడ్డి వెంకటరామిరెడ్డికే తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు.     

ధర్మవరం :దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన చేనేత రంగం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా చతికిలపడింది. చేనేతలు తయారు చేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం, వారు నేసిన పట్టు చీరలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో చేనేతలు పడరానిపాట్లు పడుతున్నారు. కర్నాటక, తమిళనాడు, కేరళ తదితర ప్రాంతాలకు వలసలు వెళ్లి అలవాటు లేని కూలీనాలీ చేసుకుని జీవిస్తున్నారు. ఈ రంగంలో చేయి తిరిగినవారు కూడా ఇతర పనులు చూసుకోవాల్సి వచ్చింది. రేయింబవళ్లూ భార్యాభర్తలిద్దరూ కష్టపడ్డా బతకడానికి అవసరమైన డబ్బురాక మగ్గాలను మూసివేసే పరిస్థితి నెలకొంది.

జిల్లాలో 60వేల మంది చేనేత కార్మికులున్నట్లు సంఘాల నేతలు చెబుతున్నా అధికారులు 40 వేల మందికి మాత్రమే గుర్తింపు కార్డులు అందజేశారు. వారిలో 2015 – 16 సంవత్సరంలో 1,000 మందికి మాత్రమే బ్యాంకర్లు రుణాలు ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల్లో 90 శాతం మందికి రుణాలు అందనేలేదు. దీంతో వారు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోంది. వాటిని తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు.
చేనేత కార్మికుల కష్టాలు గమనించిన వైఎస్సార్‌ తన హయాంలో ఐసీఐసీఐ లాంబార్డ్‌ స్కీం ద్వారా వారికి హెల్త్‌కార్డులు ఇచ్చారు. అయితే టీడీపీ ప్రభుత్వం వీటిని పూర్తిగా విస్మరించడంతో కనీస వైద్యసేవలు అందక వృద్ధులైన చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు చేనేత కార్మికులు ప్రమాదవశాత్తూ మృతి చెందితే రూ.1లక్ష దాకా పరిహారం అందించే మహాత్మాగాంధీ బంకర్‌ బీమా యోజన పథకాన్ని కూడా నిలిపేశారు. ముడిపట్టును అందజేసే డిపోలను నిర్వహించే విషయంలో టీడీపీ నాయకుల మధ్య నెలకొన్న వివాదం కారణంగా ధర్మవరంలో జాతీయ చేనేత అభివృద్ధి పథకం దాదాపు రెండున్నరేళ్లుగా ఆగిపోయింది. జిల్లాలో చేనేతలకు చెల్లించాల్సిన ముడిపట్టు రాయితీ బకాయిలు రూ.20.54 కోట్లకు చేరాయి.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 120 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు అధికా రులు ధృవీకరించారు. కానీ వాస్తవానికి 200 మందికి పైగా బలవన్మరణాలకు పాల్పడినట్లు చేనేత సంఘాలు చెబుతున్నాయి. ఒక్క ధర్మవరం పట్టణంలోనే ఈ రెండున్నర సంవత్సరాల్లో 36 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

 వైఎస్‌ జగన్‌ భరోసా
మగ్గం నేసే ప్రతి చేనేత కార్మికునికీ ప్రతినెలా మొదటి వారంలోనే రూ.2వేలు అందజేస్తారు
ఎన్‌హెచ్‌డీసీ పథకాన్ని పునరుద్ధరించి ముడిపట్టు కొనుగోలుపై 10శాతం రాయితీని ప్రతినెలా ఇస్తారు.
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకాన్ని పునరుద్ధరించి ఉచితంగా వైద్యం అందిస్తారు
చేనేత కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి విరివిగా రుణాలు ఇప్పిస్తారు
ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి చేనేత కార్మికుని కుటుంబానికీ తక్షణసాయంగా రూ.5లక్షలు ఇస్తారు.

నేతన్నలకు అండగా వైఎస్సార్‌సీపీ
2016 జనవరి నెలలో బలవన్మరణాలు పొందిన చేనేత కార్మికులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహనరెడ్డి పరామర్శించారు. ధర్మవరం పట్టణంలో మొత్తం 11 మంది కార్మికుల ఇళ్లకు వెళ్లి భరోసా ఇచ్చారు. వారిని ఆర్థికంగా ఆదుకున్నారు.
ముడిపట్టు రాయితీ పథకం అస్తవ్యస్తంపై వైఎస్సార్‌సీపీ ఎప్పటికప్పుడు ఉద్యమిస్తూ వచ్చింది. ఆ పార్టీ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం నియోజకవర్గంలో గత ఏడాది జులైలో, ఈ ఏడాది జనవరి, ఆగష్టు నెలల్లో సంతకాల సేకరణ చేసి, సెరిఫెడ్‌ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. ఆగష్టులో ధర్నా సందర్భంగా నెలరోజుల్లోపు చేనేతలకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోతే రిలే దీక్షలు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో 37 రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహనరెడ్డి ధర్మవరం వచ్చి రిలే దీక్షలను విరమింపజేశారు.
ఆత్మహత్యలు చేసుకన్న చేనేత కార్మికులకు అండగా నిలవాలని, నిద్రపోతున్న టీడీపీ ప్రభుత్వాన్ని తట్టిలేపాలన్న ఉద్దేశంతో కేతిరెడ్డి ధర్మవరంలో రెండు రోజులపాటు భిక్షాటన చేశారు. తద్వారా పోగైన మొత్తాన్ని ఆత్మహత్యలు చేసుకున్న చేనేతల కుటుంబాలకు అందజేశారు.

Advertisement
Advertisement