Sakshi News home page

జగన్ రిమాండ్ 3 వరకు పొడిగింపు

Published Fri, Sep 20 2013 8:13 PM

జగన్ రిమాండ్ 3 వరకు పొడిగింపు - Sakshi

తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు అక్టోబరు 3 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీ.బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను కూడా కోర్టు వచ్చే నెల 3 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం చెంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు.

అలాగే ఇతర ఛార్జిషీట్లలో నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి బీపీ.ఆచార్య, రాంకీ సంస్థల అధినేత అయోధ్యరామిరెడ్డి, గనుల శాఖ మాజీ డెరైక్టర్ వీడీ రాజగోపాల్, నిమ్మగడ్డ ప్రకాష్, ఈశ్వర్ సిమెంట్స్ పూర్వ ఎండీ సజ్జల దివాకర్‌రెడ్డి, దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్‌దాల్మియా, ఉద్యోగులు సంజయ్ ఎస్.మిత్రా, నీల్‌కమల్‌బేరి, జయ్‌దీప్‌బసు తదితరులు కోర్టు ఎదుట హాజరుకాగా...సీనియర్ ఐఏఎస్ అధికారులు వెంకట్‌రామిరెడ్డి, మన్మోహన్‌సింగ్, శ్యామూల్, శ్రీలక్ష్మి, ఫార్మా కంపెనీల ప్రతినిధులు హాజరునకు మినహాయింపు కోరుతూ వారి తరఫు న్యాయవాదులు పిటిషన్‌లు దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు వచ్చేనెల 3కు వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా ఇదే కేసులో నిందితుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావుకు వెన్నునొప్పి చికిత్స కోసం ప్రత్యేక కోర్టు ఇటీవల 45 రోజులు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన కారణంగా కోర్టుకు హాజరుకాలేకపోతున్నట్లు మోపిదేవి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఇదిలా ఉండగా అన్ని చార్జిషీట్లను కలిపి విచారించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్, దర్యాప్తు పూర్తయ్యే వరకూ అభియోగాల నమోదు ప్రక్రియను ఆపాలంటూ ఇతర నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్‌లపై విచారణను కోర్టు ఈనెల 23కు వాయిదా వేసింది.

Advertisement

What’s your opinion

Advertisement