అందరి చూపు.. వైఎస్సార్‌సీపీ వైపు | Sakshi
Sakshi News home page

అందరి చూపు.. వైఎస్సార్‌సీపీ వైపు

Published Mon, Jan 7 2019 1:57 PM

YS jagan YSR kadapa Praja Sankalpa Yatra Special Story - Sakshi

ఇప్పుడు అందరి చూపు.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపుఉంది. పలు పార్టీల నాయకులు,కార్యకర్తలు స్వచ్ఛందంగా చేరుతున్నారు.. రాబోవు రోజుల్లోవలసలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషకులుపేర్కొంటున్నారు.. దీంతో జిల్లారాజకీయ చిత్రపటం మారబోతోంది.. వచ్చే ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసేందుకు ఆ పార్టీ శ్రేణులుసమాయత్తం అవుతున్నాయి.

సాక్షి ప్రతినిధి కడప: ముందే కంచుకోట, పైగా నిత్యం ప్రజా ప్రయోజనాలకు పరిమితమై పోరా టం, ఆపై అపార ప్రజా మద్దతు వెరసి వైఎస్సార్‌సీపీ జిల్లాలో దూకుడు మీదుంది. 2014లో పదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలు సాధించిన ఆ పార్టీ రాబోవు ఎన్నికల్లో టీడీపీని క్లీన్‌బౌల్డ్‌ చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తోంది. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అందుకు ఊతంగా నిలుస్తోంది.
కడప గడపలోని ఇడుపులపాయలో వైఎస్సార్‌సీపీ పురుడు పోసుకుంది. అక్కడే రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించుకుంది. దశ–దిశ నిర్ణయించుకొని 2011 కడప పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో యావత్‌ భారతదేశం ఆకర్షించేలా 5,45,672 ఓట్ల మెజార్టీ సాధించింది. అప్పటి వరకూ వందేళ్లు చరిత్ర అంటూ చెప్పుకోసాగిన కాంగ్రెస్‌ పార్టీని, మూడు దశాబ్దాల చరిత్రగా చెప్పుకున్న టీడీపీకి.. ఆ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతయ్యేలా చేసింది. అనక 2012 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో 18 స్థానాలకు 16 స్థానాలు, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో కైవసం చేసుకుంది. కాగా 2014లో త్రుటిలో అధికారం చేజారింది. 67 అసెంబ్లీ స్థానాలు దక్కించుకొని అనతి కాలం లోనే సత్తా చాటుకుంది.

అప్పట్లో వైఎస్సార్‌ జిల్లాలోని 10 స్థానాల్లో 9 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యుర్థులు విజయం సాధించారు. ఈ క్రమంలో గడిచిన నాలుగేళ్లుగా ప్రజా పోరాటాల్లో ఆ పార్టీ ముందంజలో ఉంది. అనేక ఉద్యమాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాటం చేస్తూ.. హోదా ఉద్యమాన్ని సజీవంగా నిలిపింది. రైతులు కార్మికులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమిం చింది. అలాంటి పరిస్థితుల్లో కుట్రలు, కుతంత్రాలు తెరపైకి వచ్చాయి. వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు టీడీపీ వల వేసి అక్కున చేర్చుకుంది. అయినా మొక్కవోని దీక్షతో ప్రజా పోరాటాలే శరణ్యమని దీటుగా నిలిచింది. అసెంబ్లీలో సైతం అవే కుట్రలు తెరపైకి రావడంతో.. ప్రజా క్షేత్రంలో పోరాటానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్‌సీపీ పురుడు పోసుకున్న అదే ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్పయాత్రకు శ్రీకారం చుట్టారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విజయవాడ, పశ్చిమగోదా వరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం మీదుగా శ్రీకాకుళం చేరుకున్నారు. తుది అంకానికి చేరిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 9న ఇచ్ఛాపురంలో ముగియనుంది. ఈ యాత్ర కొనసాగడం ఆరంభమైనప్పటి నుంచి అంచెలంచెలుగా ప్రజాభిమానం పెల్లుబికుతోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీలో చేరిన సీఆర్‌సీ
తెలుగుదేశం పార్టీ క్రియాశీలక నేతగా ఎదిగి, ప్రజారాజ్యం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన మాజీ మంత్రి సి.రామచంద్రయ్య వైఎస్సార్‌సీపీలో చేరారు. 1985లో కడప ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఆపై టీడీపీలో ట్రబుల్‌ షూటర్‌గా గుర్తింపు పొందారు. పీఆర్‌పీ ఏర్పాటుతో ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత చిరంజీవికి ముఖ్య సలహాదారుడిగా నిలిచారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలపై సమగ్ర అవగాహన ఉంది. రాయలసీమ పట్ల ప్రస్తుత చంద్రబాబు సర్కార్‌ అవలంబిస్తున్న వివక్షత ధోరణిపై సీఆర్‌సీ అనేక పర్యాయాలు ఆవేదన వ్యక్తం చేశారు. తాజా రాజకీయ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ను ఇతర రాష్ట్రాలకు దీటుగా నిలపగల్గే నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డేనని భావించి వైఎస్సార్‌సీపీలో చేరారు. సీఆర్‌సీ చేరికతో కడప, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీకి అదనపు బలం చేకూరింది. అలాగే మైదుకూరు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మాచునూరు చంద్ర, చెన్నూరు మాజీ ఎంపీపీ శివరామిరెడ్డి, ఎర్రగుంట్ల మండలం మూలే హర్షవర్ధన్‌రెడ్డి తదితర ప్రముఖులు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరే కాకుండా జిల్లా వ్యాప్తంగా వందలాది మంది గ్రామ స్థాయి నాయకులు చేరారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకూ వైఎస్సార్‌సీపీ పటిష్టంగా నిలు స్తోంది. ఆ పార్టీకి ఉన్న ప్రజామద్దతు కారణంగా మరో రెండు నెలల్లో రాజంపేట, బద్వేలు, రైల్వేకోడూరు, రాయచోటి, మైదుకూరు తదితర నియోజకవర్గాల్లో భారీగా వలసలు ఉన్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

త్యాగాలకు అండగా నిలుస్తోన్న ప్రజానీకం
వైఎస్సార్‌సీపీ అంటే త్యాగాలకు నిలయంగా మారింది. గడిచిన కొంత కాలంగా అదే విషయమై చరిత్ర వివరిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే పదవులను త్యజించి వైఎస్సార్‌సీపీ స్థాపించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ విజయమ్మను జిల్లా ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఆ తర్వాత వైఎస్‌ కుటుంబానికి అండగా నిలిచి.. ఎమ్మెల్యే పదవులను త్యజించిన రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు అప్పటి ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథరెడ్డి, శ్రీనివాసులుకు సైతం తర్వాత ఉప ఎన్నికల్లో ఘన విజయం చేకూర్చారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం కడప, రాజంపేట ఎంపీ పదవులను వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తృణప్రాయంగా త్యజించారు. ప్రాంతం కోసం పదవులను ఫణంగా పెట్టి ప్రజాక్షేత్రంలో ప్రజల వెన్నంటే ఉంటున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుల త్యాగాలకు వైఎస్సార్‌ జిల్లా ప్రజానీకం అండగా నిలుస్తోందని చరిత్ర రుజువు చేస్తోంది. ఈ తరుణంలో రాబోవు ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సర్వ సన్నద్ధమైయ్యారని పరిశీలకులు భావిస్తున్నారు.

రాజంపేట టీడీపీ నేతలు భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీ పార్టీలో 2018 డిసెంబర్‌ 8న చేరారు. శ్రీకాకుళంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దగ్గరికి వెళ్లి, ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారిలో మాజీ కౌన్సిలర్, మన్నూరు సింగల్‌ విండో మాజీ అధ్యక్షుడు కటారు సుబ్బరామిరెడ్డి, బీసీ నేత పిండిబోయిన రాముయాదవ్‌ , బీసీ నాయకుడు రాము యాదవ్, చంద్రశేఖర్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, సుబ్బనరసారెడ్డి, శంకర్‌రెడ్డి,  వెంకటసుబ్బమ్మ, కూండ్ల రమణారెడ్డి, బిల్లా నరేష్, జక్కల సురేష్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement