సూర్య కిరణం.. ఆశల దీపం | Sakshi
Sakshi News home page

సూర్య కిరణం.. ఆశల దీపం

Published Tue, Jan 8 2019 1:48 PM

YS jagan YSR kadapa Praja Sankalpa Yatra Special Story - Sakshi

కష్టం ఎంతైనా భయపడవద్దు.. సంకల్పం ముందు ఎంతటి కన్నీళ్లయినా నిలబడవు.. మీ కష్టానికి నేనున్నా.. ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కొంటానని భరోసా ఇస్తున్నా.. అందరి కష్టాలు నాకు తెలుసు.. టీడీపీ సర్కారులో సామాన్యులు ఎలా నలిగిపోతున్నారో ఎరుకే.. అంటూ అందరిలో ధైర్యాన్ని నింపుతూనే సామాన్యుల దగ్గరికి వెళ్లి.. యోగ క్షేమాలు తెలుసుకుంటూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర సాగించారు. దారి పొడవునా రైతులను పలుకరిస్తూ.. దారిలో ఉన్న చిరు వ్యాపారుల కష్టనష్టాలు తెలుసుకుంటూ.. ప్రతిక్షణం కష్టజీవి పడుతున్న శ్రమలో భాగమయ్యేలా పయనించారు. అలుపెరగని బాటసారిలా ఆయన సాగిస్తున్న పాదయాత్రకు ఓ పక్క జనం పోటెత్తుతుండగా.. మరో పక్క ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అడుగులో అడుగేస్తామంటూ యువత కదం తొక్కింది. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు వారం రోజుల పాటు  ప్రతిపక్ష నేత వెంట నడిచారు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా జిల్లా వాసులు అనేక మంది ఆయన అడుగు జాడల్లో ముందుకు వెళుతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు తోడు నీడగా ఉంటున్నారు. ఆయన పడుతున్న కష్టంలో పాలుపంచుకోవాలన్న సంకల్పంతోనే వేల కిలోమీటర్లు అని తెలిసినా ముందుకు కదిలినట్లు యువత పేర్కొంటోంది.

సాక్షి కడప : ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రను 2017 నవంబరు 6న ఉదయం ఇడుపులపాయలో.. తన తండ్రి వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించి ప్రారంభించారు. పాదయాత్ర వేలాది మంది జనతరంగంతో అలరారింది. ఎక్కడ చూసినా పోటెత్తిన జనం మధ్య.. జననేత జగన్‌తో కలిసి అడుగులో అడుగేసేందుకు పోటీ పడుతున్న యువతతో ఉత్సాహంగా సాగింది. 6 నుంచి 13వ తేదీ వరకు సాగిన యాత్రలో జిల్లా వాసులు లక్షలాది మంది పాలుపంచుకున్నారు. హారతులు పట్టి బొట్టు పెట్టారు. అడుగులో అడిగేశారు. కష్టాలు చెప్పుకున్నారు. సంతోషాన్ని పంచుకున్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు ప్రతిపక్ష నేతకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. జిల్లాలోని వేల మంది యువకులు.. కులం, మతం, వర్గం బేధం లేకుండా.. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ప్రతిపక్ష నేత వెంట కదిలారు. ఏడు రోజుల పాటు ఇడుపులపాయ నుంచి దువ్వూరు మండలం ఇడమడక వరకు వైఎస్‌ జగన్‌ వెంట తండోప తండాలుగా ముందుకు సాగారు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా జిల్లా వాసులు అనేక మంది ఆయన అడుగు జాడల్లో ముందుకు వెళుతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు తోడు నీడగా ఉంటున్నారు. ఆయన పడుతున్న కష్టంలో పాలుపంచుకోవాలన్న సంకల్పంతోనే వేల కిలోమీటర్లు అని తెలిసినా ముందుకు కదిలినట్లు యువత పేర్కొంటోంది.

తల్లిచాటు బిడ్డలా.. రాగిసంగటి ఆరగించి..
2017 నవంబరు 13న దువ్వూరు నుంచి ప్రారంభమైన ప్రజాసంకల్ప పాదయాత్రలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. జనం మధ్యన.. హోరెత్తుతున్న నినాదాల మధ్య సాగుతున్న పాదయాత్రలో ఒక్కసారిగా ప్రతిపక్ష వైఎస్‌ జగన్‌ పొలం వైపునకు అడుగులు వేశారు. పసుపు పంట వేయడానికి సంబంధించి పొలాన్ని సిద్ధం చేస్తున్న రాజుపాళెం మండలం టంగుటూరు గ్రామానికి చెందిన అన్నాచెల్లెలు నంద్యాల ఊపయ్య, సుభద్ర వద్దకు వెళ్లారు. పొలానికి సంబంధించి ఏ పంట వేస్తున్నారు.. పెట్టుబడులు ఎలా.. దిగుబడి పరిస్థితి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పసుపు పంట ఎక్కడ చూసినా తెగుళ్లకు గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని, అంతే కాకుండా దిగుబడులు ఉంటున్నా మద్దతు ధర ఉండడం లేదని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తే పంటలకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతామని ప్రతిపక్ష నేత పేర్కొన్నారు. ఇంతలోనే తమ కోసం క్యారీలో పొద్దునే తెచ్చుకున్న రాగి సంగటి, ఉల్లిపాయ ముక్కలను ఆ తల్లి తీసుకొచ్చింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రతిపక్ష నేతకు ఆప్యాయంగా సంగటి ముద్దలను తినిపించడమే కాకుండా ఉల్లిపాయ అందించింది. సాధారణంగా పల్లె సీమల్లో పొద్దునే లేచింది మొదలు పొలం వద్దకు సంగటి, కారం, ఉల్లిపాయ తీసుకెళ్లడం సాధారణంగా జరుగుతుంది.   వైఎస్‌ జగన్‌ కూడా వారితో మమేకమై, ఆమె ఆప్యాయంగా పెడుతున్న రాగి సంగటి ముద్దలను తిని.. వారి యోగక్షేమాలు తెలుసుకుని అక్కడి నుంచి ఉపక్రమించారు.

ఎన్నో.. ఎన్నెన్నో..
ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి ముగిసేంత వరకు అన్ని వర్గాలతో మమేకమవుతూ.. కష్టసుఖాలు తెలుసుకుంటూ.. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ముందుకు సాగారు. ఏడు రోజుల పాటు.. 93.8 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో ఎన్నో విశేషాలు, మరెన్నో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. రాజన్న బిడ్డతో.. ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర నడిచివచ్చి యువతులు, చిన్నారులు, వృద్ధులు, మహిళలు మమేకమై బాధలు చెప్పుకున్నారు. ఈ సందర్భంలో మైదుకూరు మండలం మూడిళ్లపల్లెకు చెందిన ఓ యువతి తన భర్త నిత్యం తాగుతూ.. మద్యం మత్తులో పడుకుంటున్నాడని.. పూర్తి స్థాయిలో మద్యాన్ని దూరం చేయాలని కోరింది. ఊరిలో బెల్ట్‌ షాపు ఉండడంతో ఎప్పుడూ మద్యం తెచ్చుకుంటూ బానిసయ్యాడని, నేను కష్టపడుతున్నానని వివరించింది. అంతేకాదు ఉన్న భూమిని అమ్మాలని చూస్తుండడంతోనే బాధ తట్టుకోలేక మీకు చెప్పుకుంటున్నానని వివరించగా.. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే అక్కచెల్లెమ్మలకు మద్యం కష్టాలు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.

ఎంతో కమిట్‌మెంట్‌తో ఉన్నారు
ఈ రాష్ట్రానికి ఉత్తమ భవిష్యత్తు ఉండేలా పటిష్టమైన ప్రణాళిక, ఎంతో కమిట్‌మెంట్‌తో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారు. పాదయాత్రలో ప్రతి ఒక్కరూ సూచనలు, సలహాలు, సమస్యలు చెబుతుంటే.. చాలా ఓపికగా వింటూనే బాగా ఆకలింపు చేసుకుంటూ.. ఇవి చేయాలనే తపనతో ఉన్నారు. ఎందుకంటే ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు చేస్తున్న పాదయాత్రలో నేను ఆయన వెంటే నడుస్తున్నాను. ఆయన ప్రజల సమస్యల పట్ల చూపుతున్న చొరవ, ఆలకించే విధానం నాకు నచ్చింది. ఎలాంటి కోపతాపాలు లేకుండా చిన్న పిల్లలను మొదలుకొని ముదుసలి వరకు అందరినీ పలకరిస్తూ వారికున్న సమస్యలను తెలుసుకుంటూ తగిన సమాధానాలు ఇస్తూ.. ఒక పక్క నాయకులు ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తూ పాదయాత్ర సాగిస్తున్నారు. చంద్ర ఇది మనం ఎందుకు చేయకూడదు అని జగన్‌ సారు చెబుతుంటారు. సార్‌..! ఇలా చేస్తే బాగుంటుంది అంటే.. పక్కనే ఉన్న మరొకరు అలా కాదు ఇలా అయితే పథకం విజయవంతం అవుతుందని చెబుతున్నప్పుడు.. జగన్‌మోహన్‌రెడ్డి దీన్ని ఆచరణలో పెడదామన్నప్పుడు నాకు చాలా సంతోషమనిపిస్తుంది. ప్రజల సాధక బాధకాలు వింటూ వారికి ఇలా చేస్తే మేలు చేకూరుతుందని అంటున్నప్పుడు.. బహిరంగ స¿¶భల్లో మాట్లాడుతున్నప్పుడు.. ఈ పథకాన్ని అమలు చేస్తారు మాకు మేలు జరుగుతుందని ప్రజలు చర్చించుకుంటూ ఉంటే.. జిల్లా వాసిగా నా ఆనందానికి అవదులు లేన్నట్లు ఉంటుంది. నిజంగా జగన్‌మోహన్‌రెడ్డి మదిలో ప్రజలకు మేలు చేసే గొప్ప ఐడియాలు చాలా ఉన్నాయి.  – గుత్తిరెడ్డి చంద్రహాసరెడ్డి, వెంకటగారిపల్లె, చింతకొమ్మదిన్నె

ప్రొద్దుటూరులోని మెయిన్‌రోడ్డులో బొగ్గులు అమ్ముకుంటున్న ఉస్మాన్‌ఖాన్‌ దగ్గరికి వెళ్లిన ప్రతిపక్ష నేత కష్టనష్టాల గురించి అడగ్గానే.. ఏడేళ్లవుతోంది.. కేరళ నుంచి వచ్చాను.. కానీ ఐదారు సార్లు దరఖాస్తు చేసినా పింఛన్‌ రాలేదని మొరపెట్టుకున్నారు. ఆ సంఘటన అక్కడ అందరినీ కదిలించింది. ఎందుకంటే ఉస్మాన్‌ వృద్ధుడు కావడం, బొగ్గులు అమ్ముకుంటూ రోజుకు రూ. 50–60 మాత్రమే మిగులుతున్నట్లు తెలుపడంతో జగన్‌ చలించిపోయారు. దువ్వూరు మండలం కానగూడూరు వద్ద తోట సుబ్బరాయుడు, రామతులసి వచ్చి వైఎస్‌ జగన్‌కు కప్పులో టీ తీసుకొచ్చి అందించారు. వారి కోరిక మేరకు అందరి మధ్య టీ తాగి వారితో కాసేపు ముచ్చటించారు. ఇలా అందరి కష్టాల్లోనూ మమేకమై తెలుసుకుంటూ భరోసానిస్తూ ముందుకు సాగారు.

Advertisement
Advertisement