ఓటుతో బుద్ధి చెప్పండి | Sakshi
Sakshi News home page

ఓటుతో బుద్ధి చెప్పండి

Published Mon, Aug 28 2017 12:51 AM

YS Jaganmohan Reddy comments on chandrababu government

మూడున్నరేళ్ల మోసకారి పాలన 
కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు

 
(కాకినాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : చైతన్యవంతులైన కాకినాడ ప్రజలు కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు ఓటేసి రాష్ట్ర భవిష్యత్తు మార్పునకు శ్రీకారం చుట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఏడాది తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికలనే కురుక్షేత్ర మహాసంగ్రామానికి కాకినాడ ఎన్నికలు నాంది పలకాలన్నారు. కేవలం ఎన్నికలలో గట్టెక్కడం కోసమే అన్ని వర్గాలకు అసంఖ్యాక హామీలిచ్చి తర్వాత మోసం చేయడం చంద్రబాబు నైజం అన్నారు. అన్నింటా మోసాలతోనే మూడున్నరేళ్లు కాలం గడిపేశారని చెప్పారు.

వాటి అమలు కోసం డిమాండు చేసినవారిపై కన్నెర్ర జేస్తున్నారని, కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వం అవసరమా? దీనికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ఇలాంటి రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం, జవాబుదారీతనం కోసం పోరాడుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పౌరులు మద్దతు పలకాలని కోరారు. ధర్మానికీ అధర్మానికీ మధ్య జరుగుతున్న పోరులో ధర్మం వైపు నిలబడాలని విన్నవించారు. ఈనెల 29న జరగనున్న కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజయిన ఆదివారం ఆయన కాకినాడలో విస్తృత ప్రచారం నిర్వహించారు. పలు రోడ్డు షోల్లో పాల్గొన్నారు. ఉదయం అన్నమ్మ ఘాటి, మధ్యాహ్నం 3 గంటలకు డెయిరీఫారం సెంటర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనా తీరుపై ధ్వజమెత్తారు. మోసానికి, వంచనకు మారుపేరుగా మారాడని విమర్శించారు. జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే....
 
అన్నింటా మోసమే..
‘‘బాబు అధికారంలోకి వచ్చి మూడున్నర ఏళ్లు అయింది. ఎన్నికలకు ముందు ఏమి చెప్పారో ఇప్పుడేమి చేశారో మీరే చెప్పండి. ప్రతి పేద వాడికీ మూడు సెంట్ల స్థలం అన్నాడు, ప్రతి పేదకూ ఇల్లు అన్నాడు. ఈ మూడున్నర ఏళ్లలో ఒక్క ఇల్లన్నా కట్టించాడా? (లేదు, లేదు అంటూ ప్రజలు రెండు చేతులెత్తి చూపించారు) దీన్నేమంటాం.. మోసం.. చంద్రబాబు మోసం చేశాడు. రేషన్‌ సరుకుల పంపిణీలోనూ ఇలాగే జరిగింది.
 
ప్రతి ఇంటికీ రూ.78వేల బాకీ...
బాబొస్తేనే జాబు వస్తుందని, లేకుంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 39 నెలలు అయింది. ఆయన చెప్పిన లెక్కప్రకారమే ప్రతి ఇంటికీ రూ.2 వేల చొప్పున రూ.78 వేలు బాకీ పడ్డారు. బాబు బాబు ప్రభుత్వం ముష్టి వేసినట్టు రూ. 35 వేలు... అదీ ఎప్పటికో ఇస్తోంది. ఇటువంటి పాలన మనకు అవసరమా? (వద్దే వద్దు అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.)
 
నిజం చెప్పనివాడు నారా చంద్రబాబు....
ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ వాగ్దానాన్నీ చంద్రబాబు నెరవేర్చలేదు. ఆయన నైజమే అంత. చంద్రబాబు చస్తే నిజం చెప్పడు. జీవితంలో అబద్ధాలు చెప్పని వ్యక్తి సత్యహరిశ్చంద్రుడు అయితే ఒక్క నిజం చెప్పని వ్యక్తి చంద్రబాబు. ఇదే చంద్రబాబు 2014 ఆగస్టులో సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా తూర్పుగోదావరి సహా అన్ని జిల్లాలకు అనేక హామీలిచ్చారు. మూడున్నర ఏళ్లు గడిచినా వాటికి అతీగతీ లేదు.
 
కాలరు పట్టుకుని నిలేసే పరిస్థితి రావాలి...
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోకపోతే ఇక ఈ రాజకీయ వ్యవస్థకు అర్థమేమిటి? మరో ఏడాదిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్ర మహాసం గ్రామానికి... నంద్యాల ప్రజలు వేసిన ఓటు నాంది కాగా.. రెండో ఓటు కాకినాడ కార్పొరేషన్‌ నుంచి పడాలి... ఈ రెండు నగరాలను నేను ఎప్పుడూ మరచిపోను. వాటి అభివృద్ధి బాధ్యత నాకు వదిలేయండి. రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనతోనే ప్రజలకు మంచిరోజులు. మైకు పట్టుకుని ప్రజల ముందు ఏదయినా చెప్పి ఓట్లు వేయించుకుని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని చేయకపోతే కాలరు పట్టుకుని నిలదీస్తారన్న భయం రాజకీయ నాయకుల్లో రావాలి.

అప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. లేకుంటే చంద్రబాబు లాంటి నాయకులు రేపొద్దున్న ఎన్నికలప్పుడు మీవద్దకు వచ్చి ప్రతి ఇంటికో మారుతీ కారు ఇస్తానంటాడు, కేజీ బంగారం అంటాడు. అందుకే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చాలి. న్యాయం వైపు, ధర్మంవైపు నిలబడండి. న్యాయానికి మీ ఓటు వేయండి. మోసం చేస్తున్న చంద్రబాబు లాంటి పాలకులు వద్దని చెప్పండి.’’ అని జగన్‌ విజ్ఞప్తి చేశారు.
 
అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్‌కు పరిష్కారం... 
అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో అగ్రిగోల్డ్‌ సమస్యను పరిష్కరిస్తాం. అసెంబ్లీలోనే నేనీ విషయాన్ని ప్రస్తావించాను. వేయి కోట్లు ఇస్తే 14 లక్షల మందికి మేలు జరుగుతుంది. చంద్రబాబుకు చెప్పినా మానవత్వం లేని ఆయన పట్టించుకోలేదు. నంద్యాలలో కూడా ఈ విషయాన్ని చెప్పాను.
 
మోసాలపై నిలదీస్తే కేసులా?
ఎన్నికల ముందు మాట ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేయడం ధర్మమేనా? ఇచ్చిన హామీలు నెరవేర్చమని నిలదీసేవారిపై కేసులు బనాయిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక ముగిసిన తర్వాత టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. నడిరోడ్డు మీద తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్చినవాళ్ల మీదగానీ, కత్తులతో వీరంగం సృష్టించిన వాళ్లపై గానీ కేసులు పెట్టలేదు. ఇలాంటి పాలన మనకు కావాలా అని అడుగుతున్నా. ఓటుకు కోట్లు కేసులో ఆడియో టేపులతో అడ్డంగా దొరికిపోయినా బాబుపై కేసులు ఉండవు. తనను హీరోగా చూపించుకునేందుకు పుష్కరాల్లో 29 మందిని చంపేసినా కేసులు ఉండవు.  కాపులు రిజర్వేషన్ల కోసం కంచాలు మోగిస్తే కేసులు పెట్టారు.  ఎన్నికలప్పుడు మాటలు చెప్పి మోసం చేసిన పాలన ఇది.

అధికారంలోకి వచ్చాక అధికారాన్ని దుర్విని యోగం చేస్తున్న పాలన ఇది.  ప్రభుత్వం టీడీపీది అయినందున ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీకి ఓటువేస్తే మురిగి పోయిన ట్టేనని బాబు వ్యాఖ్యానిస్తున్నారు. ఏడాది లోపే ఎన్నికలు వస్తాయని బాబే చెప్తున్నందున ఆయనకు వేసే ఓటే మురిగిపోతుంది. ఏడాది తర్వాత చంద్రబాబు పాలన ఉండదు. వచ్చేది మనందరి పాలన. కాకినాడ మున్సిపల్‌ కౌన్సిల్‌కు మన అభ్యర్థులను గెలిపించుకుంటే ఏడాది తర్వాత మన పాలనలో మనమే నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. 
 
ఇది కబ్జాల సర్కార్‌.. 
కాకినాడ ఎమ్మెల్యే పేరు మార్చుకున్నారు కబ్జాల కొండబాబు అని. ఆయన ఏటిమొగ దగ్గర 50 ఎకరాలు కబ్జా చేసేశాడు. అతనే కాదు విశాఖ నుంచి విజయవాడ, తిరుపతి వరకూ టీడీపీ నేతలు భూకబ్జాలు చేసేస్తున్నా చంద్రబాబు చూస్తూనే ఉన్నారు తప్ప వారిపై చర్చలు లేవు. ప్రజల భూరికార్డుల్లో పేర్లను మార్చేసి, ఆ పత్రాలతో బ్యాంకుల్లో రుణాలు తెచ్చేసుకుంటున్నారు. ప్రజాధనాన్ని వేల కోట్లలో కొల్లగొడుతున్నారు. ఇలాంటి మోసకారి ప్రభుత్వం మనకు అవసరమా?

Advertisement
Advertisement