అభిమాన జల్లు | Sakshi
Sakshi News home page

అభిమాన జల్లు

Published Fri, Aug 18 2017 2:28 AM

అభిమాన జల్లు - Sakshi

జోరువానలోనూ జగన్‌ రోడ్‌షోకు పోటెత్తిన జనం
అడుగడుగునా ఆత్మీయ స్వాగతం
వీధివీధిలో గజమాలలు, వీర తిలకంతో బ్రహ్మరథం
రోడ్‌షోకు వెళ్లొద్దని కూలిచ్చి బంధించిన అధికార పార్టీ
అయినా వెల్లువెత్తిన జనాభిమానం
3 కి.మీ. రోడ్‌షోకు 9 గంటల సమయం


సాక్షి బృందం, నంద్యాల: జోరువాన కురుస్తోంది. అయినా జనం ఏమాత్రమూ లెక్కచేయలేదు. మహిళలు, యువకులు, చిన్నారులు, వృద్ధులు..ఇలా అన్ని వయసుల వారు వీధుల వెంట బారులుతీరారు. అభిమాన నేతను చూసేందుకు ఆత్రుత పడ్డారు. జగనన్న కనిపించగానే కేరింతలు కొడుతూ ‘పూల వర్షం’ కురిపించారు. గజమాలలు వేసి.. వీరతిలకం దిద్ది.. అభిమానాన్ని చాటుకున్నారు. రోడ్‌షో ప్రారంభమైన నంద్యాల పట్టణంలోని పెద్దాసుపత్రి ప్రాంతంతో పాటు ఏకలవ్యనగర్, సుంకులమ్మ గుడి, మారుతీనగర్, మంచినీళ్లబావి, హరిజనపేట, చెన్నకేశవస్వామి గుడిసెంటర్, జిలేబీ సెంటర్, షాదిక్‌నగర్‌కు చెందిన 21, 22 వార్డుల మహిళలు వేల సంఖ్యలో పోటెత్తారు. జగనన్నను చూసి చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. యువతీ యువకులు, చిన్నపిల్లలు సైతం సెల్ఫీలు తీసుకునేందుకు, కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు.  ఏ వీధిలో చూసినా జన తరంగంతో జగనన్న తొమ్మిదోరోజు రోడ్‌షో గురువారం దిగ్విజయంగా కొనసాగింది.

జననేత ఆప్యాయత.. ప్రజానీకం పులకింత
జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు పోటీపడ్డ యువకులు, విద్యార్థులు, మహిళలను ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించడంతో వారు పులకించిపోయారు. ప్రభుత్వ వైద్యశాల సమీపంలో తొమ్మిదో తరగతి చదువుతున్న పావని అనే విద్యార్థిని జగనన్నతో సెల్ఫీ తీసుకునే సమయంలో ఆప్యాయతతో ‘బాగా చదువు తల్లీ..’ అని చెప్పడంతో ‘అలాగే అన్నా..’ అంటూ సంబరçపడింది. లక్ష్మిదేవి, పార్వతి అనే మహిళలు ఏకలవ్యనగర్‌లో జగనన్నకు పూలమాల వేసేందుకు వెళ్లడంతో ‘బాగున్నారా అమ్మా..’ అంటూ పలకరించారు. దీంతో వారు ఉప్పొంగిపోయారు. హుసేనమ్మ, పర్వీన్, మౌలాబీ అనే వృద్ధులను జగన్‌ ఆప్యాయంగా ‘అవ్వా’ అంటూ పలకరించడంతో  వారు పొంగిపోయారు. ఇలా పలువురు మహిళలను పలకరిస్తూ జగన్‌ ముందుకు సాగారు.  మంచినీటి బావి వద్ద తన ప్రసంగంలో ‘ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు’ అంటూ పేరుపేరునా పలకరించడంతో పెద్దఎత్తున చప్పట్లు కొట్టి, చేతులు ఊపి హర్షం ప్రకటించారు.

కూలిచ్చి బంధించినా ఆగని అభిమానం
వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రోడ్‌షో ఉందని తెలుసుకున్న టీడీపీ నాయకులు పలు కాలనీల్లో రోడ్‌షోకు వెళ్లవద్దంటూ దినసరి కూలి రూ.300 ఇస్తామని జనాన్ని లారీల్లో తరలించేందుకు ప్రయత్నించారు. అయితే.. పలువురు తాము జగనన్న వెంటే ఉంటామని స్పష్టం చేయడంతో వారు కంగుతున్నారు.

3కి.మీ రోడ్‌షోకు 9గంటలు..
జననేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రోడ్‌షో కేవలం మూడు కి.మీ దూరం ఉన్నప్పటికీ జనాభిమానం పోటెత్తడంతో తొమ్మిది గంటల సమయం పట్టింది. సాయంత్రం షాదిక్‌నగర్‌లో వర్షం కురుస్తున్నా అభిమానులతో పాటు ముస్లిం మహిళలు ఏ మాత్రమూ లెక్క చేయకుండా జగన్‌ రాకకోసం ఎదురుచూశారు. జగన్‌ రాగానే వర్షంలోనే తడుస్తూనే ముస్లిం మహిళలు పెద్దఎత్తున పూల వర్షం కురిపిస్తూ.. కరచాలనం కోసం పోటీ పడ్డారు. వారందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించడంతో ఆనందంతో పొంగిపోయారు. జగన్‌ వర్షంలో తడుస్తున్నప్పుడు అభిమానులు సైతం వర్షం అధికమైందంటూ కేకలు వేయడమే కాకుండా ‘జగనన్న వచ్చాడు.. వర్షం కురిసిందం’టూ కేరింతలు కొట్టారు.

అడుగడుగునా హర్షధ్వానాలు..
రోడ్‌షోలో భాగంగా నూనెపల్లె మంచినీళ్ల బావి వద్ద  వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించే సమయంలో ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకులన్నీ అందుతున్నాయా అని అడగ్గా.. మహిళలు, యువకులు ‘లేదు.. లేదు..’ అంటూ చేతులూపారు. బియ్యం కూడా ఇవ్వడం లేదంటూ కేకలు వేశారు. పొదుపు మహిళల రుణాలన్నీ మాఫీ అయ్యాయా? ఒక్కరూపాయి అయినా చంద్రబాబు మాఫీ చేశారా? అని అడగడంతో మహిళలు రెండు చేతులూ ఊపుతూ ‘లేదు.. లేదు..’ అని సమాధానమిచ్చారు. పేదలకు ఒక్క సెంటయినా ఇళ్ల స్థలాలు ఇచ్చారా అని పేర్కొనడంతో లేదన్నారు.

 ఇలా రైతు రుణమాఫీ, పక్కా గృహాలు, పింఛన్లు తదితర విషయాలపై ప్రసంగించే సమయంలో ప్రజలు రెండు చేతులు ఊపుతూ తమ స్పందన తెలియజేశారు. ‘నంద్యాల అభివృద్ధి నాకు వదిలేయండి.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తా’నని చెప్పడంతో పెద్దఎత్తున  హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దేశం సులోచన, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, నాయకులు సత్యనారాయణరెడ్డి, భీమిరెడ్డి, డాక్టర్‌ సిద్ధారెడ్డి, రాగే పరుశురాం, కౌన్సిలర్‌ అనిల్‌ అమృతరాజ్, సుబ్బరాయుడు, మురళి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement