'ప్రతిపక్షం ఏం చెబుతుందో వినండి...' | Sakshi
Sakshi News home page

'ప్రతిపక్షం ఏం చెబుతుందో వినండి...'

Published Mon, Mar 16 2015 12:26 PM

'ప్రతిపక్షం ఏం చెబుతుందో వినండి...' - Sakshi

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం పట్టిసీమ ప్రాజెక్ట్పై దద్దరిల్లింది. నదుల అనుసంధానం అంశం అసెంబ్లీలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. దీనిపై చర్చించేందుకు దాదాపు రెండు గంటల సమయం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేసింది.  పట్టిసీమపై చర్చించడానికి తగిన సమయం ఇవ్వాలని ఆ పార్టీ కోరగా, 344 నిబంధన కింద అంత సమయం ఇవ్వలేమని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు.

ఎంతో కీలకమైన ఈ అంశంపై  20 నిమిషాల చర్చతో ముగించాలని ప్రభుత్వం భావిస్తోందని ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇష్టమొచ్చిన కాంట్రాక్టర్కు ఎక్కువ రేటుకి టెండర్లు ఇచ్చారని, ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తేవాలన్నారు. పట్టిసీమపై చర్చించడానికి కేవలం అరగంట సమయం మాత్రమే ఇస్తే ఒప్పుకోమని, సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రతిపక్షం చెప్పే విషయాలను అధికార పక్షం వింటే.. సమస్య ఏంటో అర్థం అవుతుందని జగన్ అన్నారు. చర్చకు అనుమతిస్తూ.. సమయం అంతా అధికార పక్షానికి ఇచ్చి ప్రతిపక్షం నుంచి మాత్రం ఒక్కరే మాట్లాడేందుకు అవకాశం ఇస్తామనడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని..  చర్చకు వైఎస్ఆర్సీపీ వెనక్కి తగ్గుతోందన్నారు. యనమల వ్యాఖ్యలను వైఎస్ జగన్ ఖండిస్తూ 'ఎవరండి డిస్కషన్ వద్దంటుంది...మీరా నేనా' అంటూ ఓ వైపు సమయం కావాలంటే ఇవ్వకుండా, మరోవైపు ప్రభుత్వం ఎదురు దాడికి దిగటం సిగ్గుచేటన్నారు.   ఈ నేపథ్యంలో  అధికార, విపక్షం మధ్య వాగ్వాదం నెలకొనటంతో సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుంది.  దాంతో స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement