కుదుట పడుతున్న జగన్ ఆరోగ్యం | Sakshi
Sakshi News home page

కుదుట పడుతున్న జగన్ ఆరోగ్యం

Published Wed, Sep 4 2013 12:59 PM

కుదుట పడుతున్న జగన్ ఆరోగ్యం - Sakshi

హైదరాబాద్ : నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. కీటోన్స్‌ సాధారణ స్థితికి చేరినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించిన నివేదికను నిమ్స్‌ వైద్యులు చంచల్‌గూడ జైలు అధికారులకు అందజేసినట్టు సమాచారం. నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి ఆరోగ్యం క్షీణించడంతో గత శుక్రవారం రాత్రి జగన్‌ను నిమ్స్‌కు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆరోగ్యం పూర్తిగా కుదుట పడితే వైద్యులు, జైలు అధికారుల నిర్ణయం అనంతరం ఆయనను మళ్లీ చంచల్గూడకు తరలించే అవకాశం కనిపిస్తోంది.

అన్ని ప్రాంతాల వారికీ సమన్యాయం చేయాలని, అలా చేయలేకుంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం వారం రోజుల దీక్ష అనంతరం పూర్తిగా క్షీణించడంతో నిమ్స్ ఆసుపత్రి వైద్యులు శనివారం ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ (గ్లూకోజ్) ఎక్కించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నిరవధిక నిరాహార దీక్ష మొదలుపెడుతున్నట్లు పార్టీ నాయకులతో చెప్పిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజానికి అంతకు ముందు రోజు సాయంత్రం 6 గంటల నుంచీ ఆహారం ముట్టలేదు. దీంతో, శనివారం మధ్యాహ్నం దీక్ష భగ్నమయ్యే వరకు మొత్తం 163.30 గంటలపాటు జగన్‌మోహన్‌రెడ్డి నిరాహార దీక్ష చేసినట్లయింది.

24వ తేదీ నుంచి జగన్‌మోహన్‌రెడ్డి మెతుకు ముట్టకపోవడం, ఆరోగ్యం క్షీణించడంతో 29వ తేదీ అర్ధరాత్రి ఆయన్ను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం, అక్కడ కూడా ఆయన దీక్ష విరమించకపోవడం, ఉస్మానియాలో తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో లేని నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆయన్ను నిమ్స్ ఆసుపత్రికి తరలించడం తెలిసిందే. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు సెలైన్ ఎక్కించి, దీక్షను భగ్నం చేశారు. బుధవారం నాటికి ఆయన ఆరోగ్యం కొద్దిగా కుదుటపడినట్లు నిమ్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Advertisement
Advertisement