విలువలతో కూడిన రాజకీయాలే చేస్తాం | Sakshi
Sakshi News home page

విలువలతో కూడిన రాజకీయాలే చేస్తాం

Published Thu, Dec 28 2017 1:39 AM

ys jagan's praja sankalpa yatra - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :
‘విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉండాలన్నదే మా అభిమతం. ఎవరైనా రాజకీయ నాయకుడు చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి. లేకుంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నదే నా ఉద్దేశం’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 45వ రోజు బుధవారం నంబుల పూలకుంట (ఎన్‌.పి.కుంట) మండలం పాపన్నగారి పల్లె వద్ద ఆయన మీడియా ప్రతినిధుల చిట్‌చాట్‌ లో మాట్లాడారు.

‘అవినీతి సొమ్ముందని ఆయన (చంద్రబాబు) ఒక్కో ప్రజాప్రతినిధికి ఒక్కో రేటు ఖరారు చేసి కొంటున్నాడు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు మొదలు ఎమ్మెల్యేల వరకూ అదే రీతిన కొనేస్తున్నాడు. ప్రపంచంలో మీడియాతో సహా అందరికీ ఈ విషయం తెలుసు. చిన్న పిల్లవాడిని అడిగినా ఈ విషయం చెబుతాడు. కొనుగోలు చేస్తున్న వాళ్లపై అనర్హత వేటూ వేయడ’ని సీఎం తీరును ఎండగట్టారు. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో అభ్యర్థిని నిలబెట్ట కపోవడంపై అడిగిన ప్రశ్నకు సమాధాన మిస్తూ.. చంద్రబాబు మాదిరి అనైతిక రాజకీ యాలకు పాల్పడబోమన్నారు.

‘ప్రశ్నించాల్సి న నాలుగో స్తంభం (మీడియా) కూడా... చంద్రబాబు చేస్తున్నాడు కనుక గళం విప్పదు.. ఎందుకో మీ అందరికీ తెలిసిందే.. (మీడియా ప్రతినిధుల నవ్వులు) అదే పని నేనూ చేసి ఉంటే ఈవేళ ఈ ఎమ్మెల్సీ ఎన్నికే వచ్చి ఉండేది కాదు. చక్రపాణి రెడ్డి మా పార్టీలోకి వస్తానన్నప్పుడు పదవికి రాజీనామా చేయించి తీసుకున్నాం. మా నిబద్ధత అది. ఎలాంటి తప్పుడు పని చేసైనా చంద్రబాబు బొంకుతాడు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించాల్సిన వాళ్లు... చంద్రబాబు నాయుడి విషయంలో మాత్రం మౌనం దాల్చుతున్నార’ని అన్నారు.

ప్రతి హామీని నెరవేరుస్తాం..
ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయలేదని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. తాను చంద్రబాబులా కాకుండా నిబద్ధతతో పని చేస్తానని, తమ ఎన్నికల ప్రణాళికలో పెట్టే ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తానని చెప్పారు. తాము ఏమి చేయబోయేది ముందుగానే ప్రకటిస్తామని, ప్రతి మాటకు కట్టుబడి ఉంటామన్నారు.

ఎన్నికల నాటికి తమ మేనిఫెస్టోను ఇంటర్‌నెట్‌లో పెడతామని చెప్పారు. తాము ఇచ్చే మాటకు కట్టుబడకపోతే ఎవరైనా తమను ప్రశ్నించవచ్చన్నారు.ప్రజా సంకల్పయాత్రలో వచ్చిన ప్రతి అభిప్రాయాన్ని, సూచనలను, సలహాలను పరిగణనలోకి తీసుకుని తుది మెరుగులు దిద్ది సంక్షిప్తంగా రూపొందిస్తామన్నారు.

విచారణకు భయపడి...
ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసే రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు జరుగుతున్నాయని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కేంద్రం ఎక్కడ విచారణ జరుపుతుందోనన్న భయంతోనే ప్రాజెక్టు పనిని ఆపి వేశారన్నారు.  ప్రజా సమస్యలపై వామపక్ష పార్టీలతో కలిసే పని చేస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అవకాశం ఉన్నప్పుడల్లా వామపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉన్నామన్నారు.

చెప్పింది చేసి తీరుతాం..
నవరత్నాలను ప్రకటించినప్పటికీ వాటిని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు మంచి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు వస్తే సవరించుకుంటూ పోతామని జగన్‌ చెప్పారు. రైతు భరోసా కార్యక్రమమే ఇందుకు ఉదాహరణ అన్నారు. మొదట్లో 5 ఎకరాల లోపు ఉన్న సన్న, చిన్నకారు రైతులకే ప్రతి ఏటా రూ.12,500 ఇవ్వాలని అనుకున్నప్పటికీ పాదయాత్రలో వచ్చిన అభిప్రా యాలను పరిగణనలోకి తీసుకుని రైతులందరికీ వర్తించేలా మార్పు చేశామని చెప్పారు.

సమస్యల తీవ్రత, సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకుంటా మన్నారు. ప్రతి సందర్భంలోనూ మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్‌ ఇవ్వాలనే ఆలోచన అలా వచ్చిందేనని చెప్పారు. వైఎస్సార్‌ చేయూత పథకం అని పేరు పెట్టినట్టు తెలిపారు. 45 ఏళ్లకే ఎలా సాధ్యమంటూ కొందరు వేస్తున్న ప్రశ్నలకు ఆచరణే సమాధానం అన్నారు.

చంద్ర బాబు మాదిరి చెప్పింది చేయలేక నెట్‌లో నుంచి ఎన్నికల మేనిఫెస్టోను తీసివే యబోమన్నారు. చెప్పింది చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. చిత్తశుద్ధి, నిజాయితీ ఈరోజు కరువైందని, ఆ రెండే తమకు ప్రాణం అన్నారు. ఫసల్‌ బీమా పథకంలోని లోటుపాట్లను సవరిస్తామని చెప్పారు. పంటల బీమాలో వేరుశనగను (ప్రస్తుతం వాతావరణ ఆధారిత బీమాలో ఉంది) చేర్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.

జర్నలిస్టులకు పెన్షన్‌ ఇచ్చే విషయం పరిశీలిస్తాం
రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ తప్పని సరిగా ఇళ్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎవరెవరికి పెండింగ్‌లో ఉన్నాయో వాటినన్నింటినీ పరిశీలించి న్యాయం జరిగే లా చూస్తానన్నారు. జర్నలిస్టులందరికీ స్థలం ఉండాలని అభిప్రాయపడ్డారు. పెన్షన్‌ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని, ఏయే రాష్ట్రాలలో ఎంతెంత ఇస్తున్నారో, ఎక్కడెక్క డ జర్నలిస్టుల పెన్షన్‌ విధానం ఎలా ఉందో సమాచారాన్ని తెప్పించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

కాగా, జర్నలి స్టులకు ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించాలని కొందరు మీడియా ప్రతినిధులు జగన్‌ను కోరారు. జర్నలిస్టులపై రాష్ట్రంలో దాడులు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మరికొందరు జగన్‌ దృష్టికి తెచ్చారు. తాడిపత్రిలో గతంలో సాక్షి విలేకరి రాజశేఖర్‌ హత్యకు గురైనప్పుడు మీరు (జగన్‌) ఔదార్యం చూపి రూ.10 లక్షలు అతని కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారని, ఇపుడు తిరిగి అదే చోట సాక్షి విలేకరిపై దాడి జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించారు. దీనిపై జగన్‌ మాట్లాడుతూ..  దాడులు జరిగినప్పుడు చంద్రబాబు పట్టించుకోకపోగా, ఆయనే చప్పట్లు కొడతాడన్నారు. చంద్రబాబు ఇలాంటి ఘటనలను పట్టించుకోక పోవడం వల్లే దాడులు పెరుగుతున్నాయన్నారు.

Advertisement
Advertisement