వైఎస్సార్‌ ఆలోచన విధానమే నా అజెండా | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ ఆలోచన విధానమే నా అజెండా

Published Sun, Jul 8 2018 9:11 AM

YS Rajasekhara Reddy Jayanti special story - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  రాజశేఖరరెడ్డి మహానుభావుడు.. వందల మందితో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకునే వరకు సాగింది. 1978లో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. నేను 1982లో రాజకీయాల్లోకి ప్రవేశించాను. 1985లో ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేను గెలుపొందిన క్రమంలో ఆయన సీఎల్పీ లీడర్‌గా ఉన్నారు. వైఎస్సార్‌తో 1982 నుంచి పరిచయం ఉన్నా 1985 నుంచి మంచి పరిచయం ఏర్పడి మూడు దశాబ్దాలకు పైగా  అనుబంధం కొనసాగింది. ఆయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే.

 నేను 1985లో ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాను. అప్పటికే ఆయన సభలో సీనియర్‌. 1978, 82 ,85లో వరుసగా మూడుసార్లు గెలిచి ఎమ్మెల్యేగా, సభలో సీఎల్పీ లీడర్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలో ఆయనతో నాకున్న మంచి పరిచయాల వల్ల అనేక అంశాలపై సభలో పార్టీ తరుఫున మాట్లాడేవాడిని. నియోజకవర్గ సమస్యలపై ఎక్కువగా మాట్లాడాలని, నీటిపారుదల రంగం, ఇతర అంశాలపై సభలో మాట్లాడాలని ప్రోత్సహించేవారు. ఆయనతో అలా మొదలైన అనుబంధం ఢిల్లీలో మరింత బలపడటంతోపాటు మరింత సాన్నిహిత్యం కలిగేలా చేసింది. 

1989లో ఇద్దం ఒకేసారి పార్లమెంట్‌ సభ్యులమయ్యాం. నేను ఒంగోలు పార్లమెంట్‌ నుంచి మొదటిసారే 97,370 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, ఆయన మొదటిసారి కడప పార్లమెంట్‌ నుంచి 1,66,752 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక అప్పట్నుంచి వీలు చిక్కినప్పుడల్లా, ఢిల్లీలో పార్లమెంట్‌ సమావేశాలు జరిగినన్ని రోజులు నిత్యం కలవడంతోపాటు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో గంటల సేపు మాట్లాడుకునేవాళ్లం. ఇద్దరివి పక్కపక్క జిల్లాలు కావడంతో రాజకీయాలు మొదలుకొని అన్ని అంశాలపై చర్చలు సాగేవి. ఆ తర్వాత 2004లో ఆయనే నాకు నరసరావుపేట పార్లమెంట్‌ సీటు ఇచ్చారు.

 ఆ తర్వాత 2009లో నెల్లూరు సీటు ఇచ్చారు. ఆయన సీఎం అయిన తర్వాత కూడా మా అనుబంధం కొనసాగింది. 2004 ఎన్నికలప్పుడు అన్నా మీరు నరసరావుపేట పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని ఆయనే స్వయంగా చెప్పారు. మీ ఇష్టం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని చెప్పాను. దానికి అనుగుణంగానే పోటీ చేశాను. ఆయన నరసరావుపేట పార్లమెంట్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ కూడా మంచి మెజార్టీతో ఎంపీగా గెలుపొందాను.

 నా ఎంపీ నిధులతోపాటు కొన్ని పనులు, జిల్లా అవసరాల గురించి ఆయనను కలిసిందే తడువుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత 2009లో నెల్లూరు పార్లమెంట్‌ జనరల్‌ సీటు కావటంతో అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందాను. ఆయన మరణానంతం ఆయనపై ఉన్న అభిమానం, వైఎస్‌ జగన్‌ నాయకత్వంపై భరోసాతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి కొనసాగుతున్నాను. 2009 తర్వాత 2011 ఉపఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో వరుసగా నెల్లూరు నుంచి గెలుపొందాను. దివంగత వైఎస్సార్‌ రాష్ట్రానికి తండ్రి లాంటి వారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement