జనం కోసమే జగన్ దీక్ష | Sakshi
Sakshi News home page

జనం కోసమే జగన్ దీక్ష

Published Tue, Dec 30 2014 12:52 AM

జనం కోసమే జగన్ దీక్ష - Sakshi

 సాక్షి, రాజమండ్రి : వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనవరిలో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టే రెండురోజుల నిరశన దీక్షను విజయవంతం చేయాలని పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఉభయగోదావరి జిల్లాల పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీక్ష సందర్భంగా కార్యాచరణపై చర్చించేందుకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు.. రాజమండ్రిలో సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసన సభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే జగన్ దీక్షకు ఉపక్రమిస్తున్నారని చెప్పారు. వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేస్తుంటే గోడును ప్రధాన ప్రతిపక్షానికి చెప్పుకోవాలని రైతులు చూస్తున్నారన్నారు. అధికారంలోకి రాక ముందు చంద్రబాబు ఏం చెప్పారు, వచ్చాక ఏం చేస్తున్నా చేస్తున్నదేమిటి అన్నదానిపై నాడు, నేడు అంటూ ఊరూరా ఫ్లెక్సీలు కట్టి ఎండగట్టాలన్నారు.
 
 ఇది కోతల సర్కారు : సాయిరెడ్డి
 పార్టీ ప్రధాన కార్యదర్శి, త్రిసభ్య కమిటీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాలకు మధ్యలో ఉంటుం దన్న ఉద్దేశంతోనే నిరశన దీక్షకు జగన్ తణుకును ఎంపిక చేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని సమష్టి కృషితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, పెన్షన్లు ఇలా అన్నింటిలో కోత పెడుతోందని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.
 
 గుణపాఠం నేర్పుదాం : ధర్మాన
 పార్టీ జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన మాట్లాడుతూ వైఎస్ జగన్ దీక్ష ప్రభుత్వానికి గుణపాఠం కావాలన్నారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలబడలేక పోతోందని ప్రజలను నమ్మించాలని కుయుక్తులు పన్నుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలపై గళమెత్తి, ప్రభుత్వ వైఫల్యాలను సమర్థంగా ఎండగట్టాం. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తత్తరపాటుకు గురయ్యారు. అందుకే కొత్త గేమ్‌కు తెరలేపింది. ఈ దీక్షలను విజయవంతం చేయడం ద్వారా ప్రజల పక్షాన మనం గట్టిగా నిలబడతామన్న విశ్వాసానికి బలం చేకూర్చాలి’ అన్నారు.
 
 ‘పశ్చిమ’ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి
 పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ దీక్షను విజయవంతం చేసేందుకు పశ్చిమగోదావరి జిల్లా శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయన్నారు. ప్రభుత్వ హామీలను నమ్మి మోసపోయిన రైతులు, డ్వాక్రా మహిళలు ఉభయగోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్నారన్నారు. తణుకు మాజీ ఎమ్మెల్యే  కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు రుణ మాఫీ బాండ్లంటూ ప్రభుత్వం ఇచ్చిన కాగితాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావని బ్యాంకులు తిప్పి పంపుతున్నాయ న్నారు. చంద్రబాబు మోసపూరిత వ్యక్తిత్వాన్ని రైతులు ఇప్పుడు గమనిస్తున్నారన్నారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల పార్టీ శ్రేణులు జగన్ దీక్షను విజయవంతం చేయాలన్నారు.
 
 పార్టీ తణుకు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ చీర్ల రాధయ్య మాట్లాడుతూ ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ చేస్తున్న తొలి దీక్షను విజయవంతం చేసేందుకు తామంతా సిద్దంగా ఉన్నామన్నారు. సమావేశంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, తానేటి వనిత, తెల్లం బాలరాజు, గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు,  తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ తోట గోపీ, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త  తలారి వెంకట్రావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేష్, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement