ఉద్యమం..జాతిహితం | Sakshi
Sakshi News home page

ఉద్యమం..జాతిహితం

Published Thu, Oct 3 2013 2:53 AM

YSR Congress Party samaikyandhra indefinite fast

 సమైక్యాంధ్ర పరిరక్షణకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ప్రజాపోరులో తన వంతు భాగస్వామ్యం నెరవేరుస్తూనే.. విభజన నిర్ణయంపై సమరశంఖం పూరించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు జాతిపిత గాంధీజీ స్ఫూర్తితో 48 గంటల నిరవధిక దీక్షకు శ్రీకారం చుట్టింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన నిరశన సమైక్యోద్యమానికి ఊతమిస్తోంది.
 
 కర్నూలు, న్యూస్‌లైన్: ప్రజల కష్టాల నుంచి పుట్టిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి వారి తరఫున అలుపెరగని పోరా టం సాగిస్తోంది. అన్ని వర్గాల ప్రజలకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముందుండి అండగా నిలుస్తున్నారు. తాజాగా రాష్ట్ర విభజన నిర్ణయంపై పార్టీ పోరుబాట పట్టింది. రెండు నెలల ఉద్యమంలో ఇప్పటికే చురుకుగా వ్యవహరిస్తున్న పార్టీ మరింత తీవ్రత పెంచే దిశగా కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగానే బుధవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు 48 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. ముందుగా మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించి దీక్షలకు శ్రీకారం చుట్టారు.
 
 ఆళ్లగడ్డలో స్థానిక ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి దీక్ష చేపట్టగా.. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి 64 మంది సర్పంచ్‌లు సంఘీభావంగా దీక్షలో పాల్గొన్నారు. నంద్యాలలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి, ఎ.వి.సుబ్బారెడ్డి నేతృత్వంలో 65 మంది దీక్షలో కూర్చొన్నారు. వేదికపై మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూజలు చేసి దీక్షలు ప్రారంభించారు. కర్నూలులో నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.వి.మోహన్‌రెడ్డి సతీమణి విజయమ్మ స్థానిక శ్రీకృష్ణదేవరాయల కూడలిలో దీక్ష చేపట్టారు. అంతకుముందు భాగ్యనగర్ కాలనీలోని పార్టీ కార్యాలయం నుంచి దీక్షా శిబిరం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం నగర కన్వీనర్ రాజా విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించగా.. మహిళా విభాగం ఆధ్వర్యంలో మొదటి రోజు 20 మంది మహిళలు దీక్షలో పాల్గొన్నారు. 
 
 పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరిత కర్నూలు-నంద్యాల రోడ్డులోని గౌరి శంకర్ ఆస్పత్రి వద్ద ఆమరణ దీక్ష చేపట్టారు. పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి దీక్షను ప్రారంభించారు. ఓర్వకల్లు, గడివేముల, పాణ్యం, కర్నూలు అర్బన్, కల్లూరు రూరల్, కల్లూరు అర్బన్ ప్రాంతాల్లోని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతిచ్చారు. పాత కల్లూరులో వైఎస్సార్సీపీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా.. 50 మంది యువకులు రక్తదానం చేశారు. ఆదోనిలో నియోజకవర్గ సమన్వయకర్త వై.సాయిప్రసాద్ రెడ్డి స్థానిక వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద 50 మందితో దీక్షకు శ్రీకారం చుట్టారు. ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్‌లో వైఎస్‌ఆర్‌సీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన దీక్షను ఆయన తండ్రి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ప్రారంభించారు.
 
 అంతకు ముందు అంబేద్కర్, వైఎస్సార్, సోమప్ప విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులంచారు. మంత్రాలయం రాఘవేంద్ర కూడలిలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దీక్ష చేపట్టారు. కౌతాళం, పెద్దకడబూరు, కోసిగి మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చి పున్నమి అతిథి గృహం నుంచి రాఘవేంద్ర సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. నందికొట్కూరులోని పటేల్ సెంటర్‌లో పార్టీ ప్రచార కార్యదర్శి ఐజయ్య దీక్ష చేపట్టగా.. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గౌరు మురళీధర్‌రెడ్డి, పార్టీ నాయకుడు శివానందరెడ్డి సంఘీభావం తెలిపారు. కోడుమూరులో నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ దీక్షకు శ్రీకారం చుట్టగా.. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, నిడ్జూరు రాంభూపాల్‌రెడ్డి, యు.వి.రాజారెడ్డి, రైతు సంఘం జిల్లా కన్వీనర్ అమడగుంట్ల క్రిష్ణారెడ్డి, కేఈ రాంబాబుతో పాటు 15 మంది పాల్గొన్నారు. ఆలూరులో నియోజకవర్గ సమన్వయకర్త గుమ్మనూరు జయరాం దీక్ష చేపట్టారు. 
 
 

Advertisement
Advertisement