మాది ఒకే వైఖరి | Sakshi
Sakshi News home page

మాది ఒకే వైఖరి

Published Sun, Aug 25 2013 4:35 AM

మాది ఒకే వైఖరి - Sakshi

*  అన్ని ప్రాంతాలకూ తండ్రిలా  సమన్యాయం చేయాలన్నాం
ఆ ప్రకటనకు నేటికీ కట్టుబడి ఉన్నామన్న వైఎస్సార్ సీపీ
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి వైఎస్సార్ సీపీ ప్లీనరీ నుంచి నేటి దాకా ఒకే వైఖరిని అవలంభిస్తోందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ అన్నారు. శనివారం చంచల్‌గూడ జైలులో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీజీసీ సభ్యులు భూమా నాగిరెడ్డి, శాసనసభపక్ష ఉపనేత ధర్మాన కృష్ణదాస్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గతేడాది డిసెంబర్ 28న కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రకటించిన వైఖరి నుంచి తాము ‘యూ’టర్న్ తీసుకున్నామని అంటున్న వారి వాదనలో నిజం లేదన్నారు. ఆ నాడు షిండే నిర్వహించిన సమావేశంలో పార్టీ వెల్లడించిన వైఖరిని కొణతాల మరోసారి చదివి వినిపించారు. ‘మా పార్టీ మొదటి ప్లీనరీలో 2011 జూలై 8, 9 తేదీల్లో చెప్పినట్లుగా తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవిస్తున్నాం.

ఆర్టికల్ -3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా పూర్తి హక్కులు, సర్వధికారాలూ కేంద్రానికే ఉన్నాయి. అయినా, మీరు మా అందరి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మేం అడిగేదల్లా అన్ని విషయాలు, అన్ని సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా త్వరితగతిన ఈ సమస్యకు ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నాం’ అని చెప్పామని వివరించారు.  
 
రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు పరిష్కారం చూపకుండా రాజకీయ స్వలాభం కోసం సర్వనాశనం చేశారని కొణతాల ఆగ్రహం వ్యక్తం చేశారు.  వైఎస్  పరిపాలనలో దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్‌గా ఉండేదని, ప్రస్తుతం ప్రభుత్వం, ప్రతిపక్షం లేనట్టుగా దౌర్భాగ్యమైన పరిస్థితి నెలకొందన్నారు. రాజకీయంగా జగన్‌మోహన్‌రెడ్డిని అణగదొక్కేందుకే కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై రాష్ట్ర విభజనకు సిద్ధపడ్డారని విమర్శించారు.  ‘కృష్ణా జలాల విషయంలో ఇప్పటికే ఎగువ రాష్ట్రాల నుంచి నిత్యం విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి.

పోలవరం విషయానికొస్తే ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఒడిశా ఎన్నో అడ్డంకులు సృష్టిస్తోంది. అన్నింటినీ అధిగమించి.. ఆఖరుకు సుప్రీంకోర్టు తీర్పు కూడా అనుకూలంగా వచ్చింది. అయినా కేంద్ర జలవనరుల శాఖ పోలవరం నిర్మాణంపై ‘స్టే’ ఇచ్చింది. కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా మన రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం రాలేదు. ఇప్పుడే ఇలా ఉంటే రాష్ట్రం విడిపోతే.. భవిష్యత్తులో కొత్త రాష్ట్రాల పరిస్థితి ఏంటి?’ అని కొణతాల ప్రశ్నించారు.
 
దీక్షకు అనుమతి అవసరం లేదు
జగన్ చేపట్టనున్న నిరవధిక నిరాహారదీక్షకు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదని కొణతాల పేర్కొన్నారు. చంద్రబాబుకు తమ పార్టీని విమర్శించే హక్కు, అర్హత లేవన్నారు. ‘చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెండుసార్లు కాపాడారు. విభజన ప్రకటనలో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించారు’ అని కొణతాల ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement