భరోసా.. రైతు ధిలాసా! | Sakshi
Sakshi News home page

భరోసా.. రైతు ధిలాసా!

Published Sat, Nov 9 2019 4:53 AM

YSR Rythu Bharosa Scheme filled a lot of happiness in Farmers Families - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ రైతు భరోసా పథకం అన్నదాతల ఇంట ఆనందోత్సాహాలను నింపుతోంది. ఆర్థిక సాయం కోసం రైతులు ఏ ఒక్కరినీ ఆశ్రయించే పని లేకుండా ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికోసం రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) సాంకేతిక సహకారాన్ని తీసుకుంటోంది. ఇప్పటికే 40.84 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో రూ.4,697.36 కోట్లను జమ చేసింది. అంతేకాకుండా నగదు జమ చేసినట్లు రైతుల ఫోన్లకు సందేశాలు కూడా పంపింది. ఈ 40.84 లక్షల మంది రైతులు కాకుండా ఆర్థిక సాయం పొందడంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్న మరో ఐదు లక్షల మంది రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇందులో సమస్యలను పరిష్కరించి త్వరలోనే ఈ ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో  నగదు జమ చేయనుంది. దీంతో రైతులు, కౌలు రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. 

స్పందన.. చాలా సమస్యలకు పరిష్కారం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం మేరకు ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో జరిగే ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటివరకు ఆర్థిక సాయం పొందని మరో ఐదు లక్షల మందికిపైగా రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రైతులు నమ్మకంగా ఉన్నారు. లబ్ధిదారుల ఎంపికలో.. ప్రత్యేకించి కౌలు రైతుల గుర్తింపులో ఎదురయ్యే సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నారు. రైతులకు, కౌలు రైతులకు మధ్య సయోధ్య కుదిర్చి సాగు ఒప్పంద పత్రాలు రాసుకునేలా ఈ స్పందన కార్యక్రమం తోడ్పడుతుందని విశ్వసిస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో ఎదురయ్యే సమస్యలు కూడా పరిష్కారమవుతాయని భావిస్తున్నారు.కొంతమంది రైతులకు ఆధార్‌ కార్డులు లేకపోవడం, ప్రజాసాధికార సర్వేతో అనుసంధానం కాకపోవడం, బ్యాంకు ఖాతాను ఆధార్‌తో లింక్‌ సమస్యలు  తీరతాయని చెబుతున్నారు. 
‘భరోసా’ ఇలా..
- వైఎస్సార్‌ రైతు భరోసా కోసం నిజమైన రైతులను గుర్తించడానికి ఐదు అంచెల్లో సాంకేతిక విధానాలను ఉపయోగిస్తున్నారు. 
అర్హులైన రైతులను వారి ఆధార్‌ నంబర్, ప్రజా సాధికార సర్వే అనుసంధానం ద్వారా గుర్తిస్తున్నారు. 
అక్రమాలకు తావు లేకుండా వెబ్‌ల్యాండ్‌ నుంచి రైతులకు సంబంధించిన భూముల వివరాలను సేకరిస్తున్నారు. 
క్షేత్ర స్థాయిలో ఈ భూముల వివరాలను మండల వ్యవసాయ విస్తరణాధికారి (ఎంఏఈవో) లేదా మల్టీపర్పస్‌ విస్తరణ అధికారి (ఎంపీఈవో) పరిశీలిస్తారు.
వివరాల నమోదుకు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేసింది. 
ఎంఏఈవో/ఎంపీఈవో పరిశీలించాక మండల వ్యవసాయాధికారులు యాప్‌లో లాగిన్‌ అయి తమ మండలంలోని రైతుల వివరాలను తుది పరిశీలన చేసి ధ్రువీకరిస్తారు. 
మండల వ్యవసాయాధికారులు ఆమోదించి ప్రభుత్వానికి పంపిన తర్వాత రైతులకు వారి ఆధార్‌తో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలకు సొమ్మును జమ చేస్తున్నారు. 
ఇందులో ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) సౌజన్యంతో రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ అవుతుంది. 

అప్పటికప్పుడే సమస్యలు పరిష్కరిస్తాం
నేడు నిర్వహించనున్న ప్రత్యేక స్పందన కార్యక్రమానికి సంబంధించి క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులందరినీ అప్రమత్తం చేశాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా ప్రతి ఒక్క రైతుకూ లబ్ధి చేకూర్చడానికి వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. ఈ మేరకు రెవెన్యూ అధికారులకు జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. నేటి స్పందనలో కొన్ని సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. అప్పటికప్పుడు చేయడానికి వీలు కానివాటిని రెండు, మూడు రోజుల్లోనే పరిష్కరించి త్వరలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం. డిసెంబర్‌ 15లోపు కౌలు రైతుల సమస్యలను పరిష్కరిస్తాం. 
– హెచ్‌.అరుణ్‌కుమార్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ 

రైతు భరోసా కోసం ‘స్పందన’ మంచి నిర్ణయం
వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందని రైతుల కోసం ప్రత్యేకంగా స్పందన నిర్వహించడం అభినందనీయం. దీనివల్ల మాలాంటి వందలాది మంది రైతులకు మేలు జరుగుతుంది. పదే పదే కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా మండలంలో ఒక రోజులోనే సమస్యలను పరిష్కరించి న్యాయం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రైతులు స్వాగతిస్తున్నారు. నాకు కూడా ఇంకా సాయం అందలేదు. త్వరలోనే అందుతుందని విశ్వసిస్తున్నా.    
– బోయ కిష్ట, వేపకుంట, కనగానపల్లి మండలం, అనంతపురం జిల్లా 

పంటల సాగుకు ధైర్యం వచ్చింది 
రైతు భరోసా పథకం ద్వారా రూ.7,500 నా బ్యాంకు ఖాతాకు జమయ్యాయి. దీంతో ఈ రబీ సీజన్‌లో పంటలు సాగు చేసేందుకు ధైర్యం వచ్చింది. పంటల సాగుకు ప్రభుత్వం ముందస్తుగానే పెట్టుబడిని అందించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. 
– మోహన్, రైతు, గుడిపాల మండలం, చిత్తూరు జిల్లా 

ముందే ‘భరోసా’ ఇచ్చారు
నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని చూసీచూసీ కళ్లు కాయలు కాశాయి. నిరాశా నిస్పృహలు ఆవహించిన సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా వచ్చి చెప్పిన సమయం కంటే ముందే ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ అందించారు. నా బ్యాంకు ఖాతాలో ఈ పథకం కింద నగదు జమైంది.         
–బొడ్డేపల్లిఅప్పలనాయుడు,అప్పలఅగ్రహారం,సంతకవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా  

Advertisement
Advertisement