ఎస్‌ఐ తీరుపై  వైసీపీ కార్యకర్త మౌనదీక్ష | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ తీరుపై  వైసీపీ కార్యకర్త మౌనదీక్ష

Published Tue, Jul 9 2019 10:10 AM

YSRCP Activist Protest Against Sub Inspector Of Visakapatnam - Sakshi

సాక్షి,విశాఖపట్నం : గొలుగొండ ఎస్‌ఐ ఎం.నారాయణరావు తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకుడు సుర్ల గిరిబాబు మౌనదీక్ష చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సోమవారం రాత్రి దీక్ష చేశారు. వివరాల్లోకి వెళితే..చీడిగుమ్మల గ్రామానికి చెందిన లోకారపు రామరాజు తనపై నాలుగు రోజులు క్రితం ఇదే గ్రామానికి చెందిన కామిరెడ్డి గోవింద్‌ రాయితో దాడి చేశాడని.. తీవ్రంగా గాయపడి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత గొలుగొండ ఎస్‌ఐ నారాయణరావుకు ఫిర్యాదు చేశానని తెలిపాడు.

అయితే ఎస్‌ఐ ఎటువంటి చర్యలు తీసుకోలేదని రామరాజు గిరిబాబుకు చెప్పడంతో ఆయన వచ్చి ఎస్‌ఐకి కలసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి కుసిరెడ్డి రాజుబాబుపై ఇంటి దారి స్థలం వివాదం జరిగితే పక్క ఇంటి యజమాని ఫిర్యాదు ఇవ్వడంతో రాజుబాబును ఎస్‌ఐ కొట్టినట్టు గిరిబాబు ఆరోపించారు. ఇదేం తీరు అని ఎస్‌ఐను నిలదీసి పక్కనే ఉన్న గాంధీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు.

గిరిబాబుకు స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు లెక్కల సత్యనారాయణ, పోలిరెడ్డి రాజుబాబు, మాకిరెడ్డి రామకృష్ణనాయుడు, చిటికెల వరహాలబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యులు గండెం ఈశ్వర్రావు మద్దతు తెలిపారు. దీంతో ఎస్‌ఐ వచ్చి గిరిబాబుకు క్షమాపణ చెప్పారు రామరాజుపై దాడి చేసిన కామిరెడ్డి గోవింద్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో గిరిబాబు దీక్షను విరమించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని గిరిబాబు ఎస్‌ఐని కోరారు. 

Advertisement
Advertisement