ఎందుకా ఇంట్రస్ట్! | Sakshi
Sakshi News home page

ఎందుకా ఇంట్రస్ట్!

Published Tue, Mar 10 2015 3:15 AM

YSRCP demand Government Medical College in Vizianagaram

    జిల్లాలో ప్రభుత్వ పరంగా వైద్యకళాశాల ఏర్పాటు చేయకుండా మాన్సాస్‌కు
     ఇవ్వడంపై చర్చ ప్రభుత్వ వైద్య కళాశాల కోసం పట్టుపట్టిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
     పశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించిన ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు
     మద్దతుగా నిలిచిన వైఎస్ జగన్, ఎమ్మెల్యేలు రాజన్నదొర, పాముల పుష్ప శ్రీవాణి
     నోరు మెదపని టీడీపీ ఎమ్మెల్యేలు
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుపై అసెంబ్లీలో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల ప్రస్తావన చర్చకు దారితీసింది. అధికార, విపక్షం మధ్య  వాదోపవాదాలు జరిగాయి. ఇంత జరిగినా జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు నోరు మెదపలేదు. ప్రభుత్వ వైద్య కళాశాల కోసం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల డిమాండ్‌కు మద్దతివ్వలేదు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు వేసిన ప్రశ్నకు ఆర్థిక పరిస్థితి కారణంగా విజయనగరం   జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయడం లేదని, మాన్సాస్ ట్రస్టు దరఖాస్తు మేరకు ప్రైవేటు కళాశాల ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కామినేని సమాధానం చెప్పారు. దానిపై సుజయకృష్ణ రంగారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యంత వెనకబడిన విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు       చేయాల్సిన  అవసరం ఉందని, వైద్యకళాశాల ఏర్పాటు చేస్తే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంటుందని, ప్ర స్తుతం విశాఖనగరంలోని కేజీహెచ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని సభ దృష్టికి తీసుకెళ్లా రు. ఇప్పటికే జిల్లాలో ఒక ప్రైవేటు వైద్య కళాశాల ఉందని, రెండోది కూడా ప్రైవేటు కళాశాలైతే పేద విద్యార్థులు ఫీజులు కట్టి చదువుకోలేని పరిస్థితి నెలకోనుందన్నారు. జిల్లాలో ఇప్పటికీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదని, దేశంలో ఎక్కడా ఇటువంటి పరిస్థితి ఉండదని, ఇప్పుడా పరిస్థితిని వైద్య కళాశాల విషయంలో కూడా వచ్చేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
  ఒక ట్రస్టు దరఖాస్తు చేసిందని ఇచ్చేస్తే ఎలా, ఏదైనా పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. దరఖాస్తు చేసుకోండని చెప్పి ఉంటే అందరూ దరఖాస్తు చేసుకుంటారని, ప్రమాణాల మేరకు వాటిలో ఏది మంచిదో తెలుసుకుని మంజూరు చేస్తే బాగుండేదన్న అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుని టీడీపీకి చెందిన గజపతిరాజులకిచ్చి, అదేదో గొప్పగా చెప్పుకుంటున్నారని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గజపతిరాజులు, మాన్సాస్ ట్రస్టు గురించి పాలకపక్షం గొప్పగా చెబుతుండగా వైఎస్ జగన్ జోక్యం చేసుకుని బొబ్బిలి రాజా వారికీ మంచి పేరే ఉందని, వారి ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, వారికి కూడా ప్రైవేటు కళాశాల అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 
 ఈ సందర్భంలో అధికార, విపక్షాల మధ్య కొంతసేపు వాదోపవాదాలు సాగాయి. జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, పాముల పుష్ప శ్రీవాణి ప్రభుత్వ వైద్య కళాశాలే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుజయ కృష్ణ రంగారావుకు మద్దతుగా నిలిచారు. కానీ, జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలెవ్వరూ ఈ విషయమై నోరు మెదపలేదు. కనీసం జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల అవసరమన్న విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. వారడగలేకపోయినా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చేసిన డిమాండ్‌కైనా మద్దతిచ్చే ఉంటే బాగుండేదని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారని, జిల్లా ప్రజల వాణి విన్పించలేకపోయారని పలువురు  ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 21 రోజుల్లోగా జనన వివరాలు నమోదు చేయాలివిజయనగరం ఆరోగ్యం:
 శిశువు పుట్టిన 21 రోజుల్లోగా వివరాలు నమోదు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ డీడీ రాంబాబు అన్నారు. స్థానిక వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం తహశీల్దార్, ఎంపీడీఓలు, ఈఓపీఆర్‌డీలకు జనన, మరణ నమోదుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మరణాల వివరాలను వారం రోజుల్లోగా నమోదు చేయాలన్నారు. ముద్రించిన ఫారాల్లోనే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని సూచించారు. జన్మించిన వెంటనే ధ్రువీకరణ పత్రాలను అందించాలన్నారు. వివరాల నమోదులో లోపాలు లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ఎస్.ఓ దేవవరప్రసాద్, ఏఎస్‌ఓ కైలాష్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement