పశ్చిమలో ఫ్యాన్‌‘టాస్టిక్‌’ | Sakshi
Sakshi News home page

పశ్చిమలో ఫ్యాన్‌‘టాస్టిక్‌’

Published Fri, May 24 2019 3:22 PM

YSRCP Has Created A Wave In The West Godavari District - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు : అద్భుతం.. మైండ్‌ బ్లోయింగ్‌.. ఫ్యాంటాస్టిక్‌.. ఇది ఓ సినిమాలోని పాపులర్‌ డైలాగ్‌. గురువారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూసి ప్రజలూ ఇదే ఉద్వేగానికి లోనయ్యారు. జిల్లాలో ఫ్యాన్‌ ప్రభంజనం ఉవ్వెత్తున వీచింది. వైఎస్సార్‌ సీపీ అత్యధికంగా 13 స్థానాల్లో జయభేరి మోగించింది. గత ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలనూ స్వీప్‌ చేసిన తెలుగుదేశం పార్టీని 2 స్థానాలకు పరిమితం చేసి అద్భుతాన్ని ఆవిష్కరించింది. మూడు లోక్‌సభ స్థానాల్లోనూ జయకేతనం ఎగురవేసింది.

పశ్చిమలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. ఫ్యాన్‌ గాలికి తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయింది. జనసేన అధ్యక్షుడు కూడా ఘోరపరాజయం పాలయ్యారు. ఇది కచ్చితంగా సామాన్యుడి విజయం.. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి తప్పు చేసినందుకు జిల్లా ప్రజలు ఈసారి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. తాము గతంలో చేసిన తప్పు పునరావృతం కాకుండా చూసుకున్నారు. తొమ్మిదేళ్లుగా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేసిన పాదయాత్రికుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లా ప్రజలు పట్టం కట్టారు.

ఆయనకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలన్న ఆకాంక్షతో  ఘన విజయం కట్టబెట్టారు. ఈసారి ఏకంగా వైఎస్సార్‌ సీపీకి 13 స్థానాలను ఇవ్వగా, తెలుగుదేశం పార్టీ చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా రెండుస్థానాలకు పరిమితమైంది.  వైఎస్సార్‌ సీపీ అభ్యర్ధులకు కూడా భారీ మెజారిటీలు వచ్చాయి. భీమవరం, తణుకు సీట్లలో గెలుపు తీవ్ర ఉత్కంఠకు దారితీసినా ఆ రెండుస్థానాలను కూడా వైఎస్సార్‌ సీపీ గెలుచుకుంది.  మార్పు కోసం అంటూ వచ్చిన జనసేనాని పవన్‌కల్యాణ్‌కు కూడా ఈ జిల్లా ఓటమి రుచి చూపించింది.  
 

ఓడిన ఉద్దండులు 
గతంలో పవన్‌కల్యాణ్‌ సోదరుడు చిరంజీవి పాలకొల్లు నుంచి ఓటమిపాలు కాగా, ఈసారి పవన్‌ కళ్యాణ్, నరసాపురం ఎంపీగా పోటీ చేసిన మరో సోదరుడు నాగబాబు కూడా ఓటమిపాలయ్యారు. సొంత జిల్లాలో ముగ్గురు అన్నదమ్ములు ఓటమి పొందిన చరిత్ర మెగా కుటుంబానికే దక్కింది. మంత్రి పితాని సత్యనారాయణకు ఘోరపరాజ యమే మిగిలింది. గత ఎన్నికల్లో గెలిచిన వారిలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మినహా మిగిలిన వారందరూ మాజీలుగా మారిపోయారు.  

భీమవరం, నరసాపురం సీట్లలో తెలుగుదేశం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, బండారు మాధవనాయుడు మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ తరఫున గెలిచి మంత్రి పదవిని చేపట్టిన మాణిక్యాలరావు నరసాపురం ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.  దాడులు చేస్తూ దుశ్సాసనుడిని మరిపించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఓటమి చవిచూశారు.  చిం తమనేని ప్రభాకర్‌ వివాదాస్పద వైఖరితో దెందులూరు నియోజకవర్గం తరచూ వార్తలలో ఉండేది.

కోడిపందేలు, జూదం అంటే  చెవి కోసుకునే చింతమనేని.. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా తన పంథా మార్చుకోలేదు సరికదా బహిరంగంగానే కొనసాగించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఆయనకు ఓటర్లు గట్టిగానే సమాధానం చెప్పారు.  17వేలపైచిలుకు తేడాతో యువకుడైన అబ్బయ్యచౌదరి చేతిలో ఓటమి చవిచూశారు. 
 

ఉత్కంఠ రేపిన భీమవరం 
భీమవరంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్‌ జనసేనపార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌పై  8,691 ఓట్లు తేడాతో ఘనవిజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిటింగ్‌ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) మూడో స్ధానంతో సరిపెట్టుకోవల్సివచ్చింది. మొదటి రౌండ్‌లో తెలుగుదేశంపార్టీ అభ్యర్థి అంజిబాబు 259 ఓట్లు మెజార్టీ సాధించినా తరువాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌ ఆదిక్యత కనబర్చారు. తరువాత కొన్ని రౌండ్లలో జనసేన పార్టీ అభ్యర్థి పవన్‌కల్యాణ్‌ ముందంజలో ఉండడంతో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. చివరకు శ్రీనివాస్‌  విజయం సాధించినట్లు వెల్లడికావడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
 

జిల్లాలో అత్యధిక మెజార్టీ బాలరాజుదే 
పోలవరం నుంచి తెల్లం బాలరాజు జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు.  తెలుగుదేశం అభ్యర్థిపై 42,405 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఏలూరులో ఎమ్మెల్సీ ఆళ్ల నానీ మూడోసారి ఎమ్మెల్యేగా జయకేతనం ఎగురవేశారు. ఈ లెక్కింపులో అభ్యర్థుల మెజార్టీ రౌండ్‌ రౌండ్‌కీ దోబూచులాడింది. చివరికి నాని 3,235 ఓట్ల మెజార్టీ సాధించారు. పోస్టల్‌ బ్యాలెట్లలో నానికి మొత్తం 828 ఓట్లు పోలవడంతో నాని సాధించిన మెజార్టీ 4,063కు చేరుకుంది.

తాడేపల్లిగూడెంలో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తిరుగులేని ఆధిక్యతను ఇచ్చారు. త్రిముఖ పోటీలో  కొట్టు సత్యనారాయణ 15,877  మెజారిటీతో గెలుపొందారు.  ఆచంటలో  వైఎస్పార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు  చేతిలో మంత్రి పితాని సత్యనారాయణ ఘోరపరాజయం పాలయ్యారు. 14 వేల పైచిలుకు మెజారిటీతో పితానిని చెరుకువాడ ఇంటిదారి పట్టించారు.  కొవ్వూరులో తెలుగుదేశం కంచుకోటను 25 వేలకు పైగా మెజార్టీ ఓట్లతో వైఎస్సార్‌సీపీ బద్దలు కొట్టింది.

 ఐదేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రజల పక్షాన నిలిచిన తానేటి వనిత 25,241 ఓట్ల భారీ మెజారిటీతో కొవ్వూరు నియోజకవర్గ తొలి మహిళా ఎమ్మెల్యేగా గెలుపొందారు. గోపాలపురంలో 37 వేలకు పైగా రికార్డు మెజారిటీతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్ధి తలారి వెంకట్రావు గెలిచారు.  చింతలపూడిలో వైఎస్సార్‌ సీపీ పార్టీ అభ్యర్ధి వీఆర్‌ ఎలీజా 35,264 ఓట్ల ఆధిక్యతో విజయం సాధించారు. నిడదవోలులో రెండుసార్లు గెలిచిన తెలుగుదేశం అభ్యర్థి బూరుగుపల్లి శేషరావుపై జి.శ్రీనివాసనాయుడు 20వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు.

గంట గంటకూ ఉత్కంఠకు గురిచేసిన తణుకు నియోజకవర్గ ఫలితం చివరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వరించింది. తణుకు నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున విజయం సాధించిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు మరోసారి విజయం సాధించి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. నరసాపురంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి ముదునూరు ప్రసాదరాజు 7,221 ఓట్ల తేడాతో జనసేన అభ్యర్థిపై గెలుపొందారు.

ఇక్కడ సిట్టింగ్‌ తెలుగుదేశం అభ్యర్ధి మాధవనాయుడు మూడోస్థానానికి పరిమితమయ్యారు.  ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి తన సమీప వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పీవీఎల్‌ నరసింహరాజుపై 11,300 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  పాలకొల్లు ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడు 18వేల ఓట్ల తేడాతో రెండోసారి గెలిచారు. 
 

లోక్‌సభా స్థానాల్లోనూ వైఎస్సార్‌ సీపీ జయకేతనం 
ఏలూరు పార్లమెంట్‌ సభ్యునిగా కోటగిరి శ్రీధర్‌ సిట్టింగ్‌ ఎంపీ మాగంటి బాబుపై లక్షా 32 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. నరసాపురం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కనుమూరి రఘురామకృష్ణంరాజు 28 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాజమండ్రి పార్లమెంట్‌ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్‌కు కూడా జిల్లాలో మంచి మెజారిటీ వచ్చింది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement