Sakshi News home page

బాబూ.. సీబీఐ అంటే బేజారెందుకు?

Published Sun, Sep 17 2017 1:14 AM

బాబూ.. సీబీఐ అంటే బేజారెందుకు?

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన ప్రశ్న 
 
సాక్షి, హైదరాబాద్‌: గురివింద నీతి వల్లిస్తున్న చంద్రబాబునాయుడు తన ఆస్తులపై సీబీఐతో విచారణ జరిపించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు. రెండెకరాల ఆసామి కొడుకు లక్షల కోట్లకు పడగలెత్తడం వెనుక మతలబేంటని నిలదీశారు. 2014 తర్వాత హెరిటేజ్‌ లాభాలు వందల రెట్లు ఎలా పెరిగాయో చెప్పాలన్నారు. మూడేళ్ల పాలనలో రూ.4 లక్షల కోట్ల అవినీతికి పాల్పడినట్టు వస్తున్న ఆరోపణలకు బదులివ్వాలన్నారు. దమ్ము, ధైర్యముంటే తనపై వచ్చిన ఆరోపణలకు ఆయనే స్వయంగా సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించాలని సవాలు విసిరారు. శనివారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో భూమన మీడియాతో మాట్లాడారు. తమ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులు వెల్లడించాలని చంద్రబాబు కోరడంపై మండిపడ్డారు. నయాపైసాతోసహా ఎన్నికల అఫిడవిట్‌లోనే జగన్‌ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు.
 
జనం రక్తమాంసాలు పిండుకున్నారు
ప్రపంచంలో సాధారణంగా నల్ల, తెల్లడబ్బు ఉంటుందని, కానీ చంద్రబాబు వద్ద ఉన్నదంతా ఎర్రడబ్బని భూమన విశ్లేషించారు. ప్రజల రక్తమాంసాల్ని పీల్చి పిప్పి చేసి, వాళ్లందరినీ పేదరికంలోకి నెట్టేసి, కేవలం అవినీతి అన్న సిద్ధాంతంతో సంపాదించిన నెత్తుటికూడన్నారు. తిరిగి అధికారం చేపట్టిన మూడేళ్లలోనే రూ.4 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రపంచంలోకెల్లా అత్యంత సచ్ఛీలుడినని, తనను మించిన నిజాయితీపరులే లేరని చంద్రబాబు సుద్దులు వల్లిస్తుంటారని, ఇదే నిజమైతే తన ఆస్తులమీద వస్తున్న ఆరోపణలపై సీబీఐతో విచారణకు సిద్ధపడాలని భూమన కోరారు.
 
వీటికి జవాబు చెప్పు బాబు..
1978లో ఆయన ఆస్తులెంతో, ఇప్పుడున్నదెంతో ప్రజలకు వివరించాలని చంద్రబాబును భూమన డిమాండ్‌ చేశారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ సంస్థకు 2014 తర్వాత వందలరెట్ల లాభాలు ఏరకంగా పెరిగాయో సమాధానం చెప్పాలన్నారు. 
 
కాటు వేస్తున్న అవినీతి విషనాగు
చిత్తూరు మొదలుకుని ఇచ్ఛాపురం వరకు చంద్రబాబు అవినీతి వేయితలల విషనాగులా బుసకొడుతోందని, సామాన్యుల్ని అది కాటేసి.. రూ.లక్షల కోట్లు దండుకుందని కరుణాకర్‌రెడ్డి అన్నారు. తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివారిపై బురదజల్లడం, దాన్ని పదేపదే ప్రచారం చేయడం చంద్రబాబుకు అలవాటన్నారు. తమ నేత జగన్‌పైనా ఇదే తరహాలో బురదజల్లి తుడుచుకోమన్నాడని తెలిపారు. సోనియా కలసి అన్యాయంగా, అక్రమంగా అవినీతి కేసులు పెడితే జగన్‌ వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. 
Advertisement

తప్పక చదవండి

Advertisement