నటన మానితే మంచిది! | Sakshi
Sakshi News home page

నటన మానితే మంచిది!

Published Sun, Apr 22 2018 6:32 AM

YSRCP Leader Dharmana Prasada Rao Comments On Chandrababu - Sakshi

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం : నటించే కార్యక్రమాలు మానుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నిజాయితీగా పనిచేస్తేనే రాష్ట్రానికి, ఆయనకూ మంచిదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు హితవు పలికారు. ప్రత్యేక హోదా అవసరం ఏమిటో తొలి నుంచి రాష్ట్ర ప్రతిపక్ష నేత, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గళం వినిపిస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అమలు కోసం పోరును తమ పార్టీ తారస్థాయికి చేర్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాలు, తర్వాత ఐదుగురు లోక్‌సభ సభ్యుల రాజీనామాలు, ఢిల్లీలో ఉద్యమం, రాష్ట్రంలో ఆందోళనలు విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. శనివారం శ్రీకాకుళంలోని ఆయన నివాసంలో ‘సాక్షి’తో మాట్లాడారు.

తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఆదివారం నూజివీడు నియోజకవర్గంలోని అగిరిపల్లి వద్ద పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సమావేశం జరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఇటీవల రాజీనామాలు చేసిన ఐదుగురు లోక్‌సభ సభ్యులు, తనతో సహా తొమ్మిది మంది రీజనల్‌ కోఆర్డినేటర్లు పాల్గొననున్నట్లు చెప్పారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వడమనే ప్రక్రియ ఇంతకుముందే పూర్తయ్యిందన్నారు. దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పునరుద్ఘాటించారు. దీన్ని డిమాండ్‌ చేసి సాధించాల్సిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం వద్ద తన పరపతిని కోల్పోయారని విమర్శించారు.

టీడీపీ భాగస్వామిగా ఉన్నా కేంద్రాన్ని ఒప్పించి సాధించే అవకాశం ఉండేదన్నారు. కానీ ఆ అవకాశాన్ని చంద్రబాబు కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం పణంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు వ్యవహరించిన ధోరణి, మాట తీరును చూసే అతని పరిస్థితిని గమనించిందన్నారు. తాను చెప్పిన మాటకే అతను కట్టుబడి ఉండరని, సీరియస్‌నెస్‌ లేదనే విషయాన్ని కేంద్రం గ్రహించిందని ప్రజలందరికీ అర్థమైందని వ్యాఖ్యానించారు. కేవలం చంద్రబాబు స్వార్థపూరిత వ్యవహార శైలి వల్లే కేంద్రం వద్ద పరపతి కోల్పోయారని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదాను సాధించగలరనే విశ్వాసం ప్రజల్లో నెలకొందని ప్రస్తావించారు. కేంద్రంతో ఆయన నిర్విరామ పోరాటం చేస్తున్నారన్నారు.

అందుకే ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు కీలకమైందని చెప్పారు. దీన్ని అమలు చేయడానికి సిద్ధమైనప్పుడే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ పొత్తుకు సిద్ధమవ్వాలని జాతీయ పార్టీలు ఆలోచించే పరిస్థితి జగన్‌ పోరాటం వల్లే సాధ్యమైందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేయడానికి సిద్ధమయ్యే పార్టీతోనే పొత్తు ఉంటుందని ఆయన తొలి నుంచే ఒక్కటే మాట చెప్పారని గుర్తు చేశారు. భవిష్యత్తులో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే పార్టీలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సంప్రదింపులు జరపాలంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ సాధించుకున్న ప్రత్యేక హోదాను అమలుచేయడానికి సిద్ధంకావాలన్న సంకేతాలు వెళ్లాయని చెప్పారు. ఇలాంటి వాతావరణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నప్పుడు ఇంకా చంద్రబాబు చిల్లర వేషాలు, నటించే కార్యక్రమాలు, అసత్య ప్రచారాలను ఆయుధాలుగా చేసుకొని బయటపడాలనుకోవడం అవివేకమే అవుతుందని వ్యాఖ్యానించారు.  

Advertisement
Advertisement