చెవిరెడ్డి తండ్రి పింఛన్ తీసుకున్నారనలేదు | Sakshi
Sakshi News home page

చెవిరెడ్డి తండ్రి పింఛన్ తీసుకున్నారనలేదు

Published Sat, Sep 27 2014 12:38 AM

చెవిరెడ్డి తండ్రి పింఛన్ తీసుకున్నారనలేదు - Sakshi

ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్
పింఛన్ జాబితా నుంచి తొలగించాలా? లేదా? అని మాత్రమే అడిగాను

 
హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తండ్రి సుబ్రమణ్యంరెడ్డి పింఛన్ తీసుకున్నారని తాను చెప్పలేదని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ స్పష్టంచేశారు.ఆయన పేరు పింఛన్ జాబితా నుంచి తొలగించాలా? లేదా? అని మాత్రమే అడిగానన్నారు. తాను దరఖాస్తు చేయకుండా, తన ప్రమేయం లేకుండానే తన పేరు పెన్షన్ జాబితాలో చేర్చారంటూ సుబ్రమణ్యంరెడ్డి ప్రకటన చేయడంతోపాటు, తన తండ్రి వృద్ధాప్య పింఛను తీసుకున్నట్లు నిరూపించమంటూ ఎమ్మెల్యే భాస్కర్‌రెడ్డి సవాలు విసిరిన నేపథ్యంలో.. పరకాల ప్రభాకర్ శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తండ్రి వృద్ధాప్య పింఛన్ తీసుకున్నట్లు తాను ఎప్పుడూ చెప్పలేదని వివరణ ఇచ్చారు. పింఛన్ల జాబితా నుంచి అనర్హులను తొలగించమనే మాట వారినుంచి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
 
కేంద్రం నిధులిస్తుంది.. మేం పింఛన్లు ఇస్తాం


సామాజిక పెన్షన్లకు బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించకపోయినా.. కేంద్రం ఇచ్చే నిధులతో నెట్టుకొస్తామని ప్రభాకర్ చెప్పారు. బడ్జెట్‌లో లోటును భర్తీ చేయడానికి కేంద్రం నిధులు ఇస్తుందని, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోనూ ఉందని గుర్తుచేశారు. జన్మభూమిలో పింఛన్లు పంపిణీ చేస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పింఛన్ల జాబితాలో ఉన్న అనర్హులను గురించే కార్యక్రమం రెండు మూడు రోజుల్లో ముగుస్తుందని తెలిపారు. పింఛన్ల కోసం 3,61,673 దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. అర్హులైన అందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పారు. అర్హుల జాబితాను గ్రామాలు, వార్డుల వారీగా అన్‌లైన్‌లో ఉంచుతామని, అభ్యంతరాలుంటే ప్రభుత్వానికి తెలియజేయమని సూచించారు. అర్హుల పేర్లు జాబితాలో లేకుండా అధికారుల దృష్టికి తీసుకెళితే వారిని చేర్చడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
 
 

Advertisement
Advertisement