‘పప్పు’ కాక ఇంకేమనాలి! | Sakshi
Sakshi News home page

‘పప్పు’ కాక ఇంకేమనాలి!

Published Sun, Apr 23 2017 6:56 AM

‘పప్పు’ కాక ఇంకేమనాలి! - Sakshi

► వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ధ్వజం
► లోకేశ్‌కు జయంతికి, వర్ధంతికి తేడా తెలియదు
► అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లిలో ‘రైతు పోరుబాట’


సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘జయంతికి, వర్ధంతికి తేడా తెలియదు. పంచాయతీరాజ్‌ మంత్రిగా తాగునీటి సమస్యను సృష్టించడమే లక్ష్యమంటారు. రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయో కూడా తెలియకుండా వచ్చే ఎన్నికల్లో 200 సీట్లలో టీడీపీని గెలిపించాలంటున్నారు. ఇలా మాట్లాడే వ్యక్తిని పప్పు అనకుండా ఇంకేమనాలి? గూగుల్‌లో పప్పు అని కంపోజ్‌ చేస్తే పప్పుదినుసులతోపాటు నారా లోకేశ్‌ ఫొటోలు వస్తున్నాయి. తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం మినహా మంత్రి కావడానికి లోకేశ్‌కు ఏం అర్హతలు ఉన్నాయి? దద్దమ్మ మంత్రిని ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారు’’ అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురా లు, ఎమ్మెల్యే ఆర్‌కే రోజా నిప్పులు చెరిగారు.

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లిలో శనివారం జరిగిన ‘రైతు పోరుబాట’ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. జిల్లాలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను కూల్చివేస్తే సహించ బోమని హెచ్చరించారు. ప్రజలకు మంచి చేసినందుకే వైఎస్‌ విగ్రహాలను కూల్చేసు ్తన్నారా? అని నిలదీశారు. కరువు బారిన పడి జనం వలస వెళ్తున్నా, సాగునీరు లేక రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మూడేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క గడపకైనా, ఒక్క మేలైనా జరగలేదని ధ్వజమెత్తారు. టీడీపీకి జనాదరణ పెరిగిందని సీఎం చంద్రబాబు అంటున్నారని, అదే నిజమైతే వైఎస్సార్‌సీపీ నుంచి కొనుగోలు చేసిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని రోజా సవాలు విసిరారు.

అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు
ఇన్సూరెన్స్‌ను ఇన్‌పుట్‌ సబ్సిడీకి ముడిపెట్టి అనంతపురం జిల్లా రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. 130 ఏళ్లలో కనీవినీ ఎరుగని కరువు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో నెలకొందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని చంద్రబాబు ఇవ్వడం లేదని విమర్శించారు. హంద్రీ–నీవా పేరుతో మరోసారి దోపిడీ చేసేందుకు కాలువను వెడల్పు చేస్తున్నారని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు సిద్ధారెడ్డి, పెద్దారెడ్డి, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు చెన్నేకొత్తపల్లిలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు ఆవిష్కరించారు.

Advertisement
Advertisement