అధికార దాష్టీకం | Sakshi
Sakshi News home page

అధికార దాష్టీకం

Published Thu, Aug 20 2015 1:54 AM

అధికార దాష్టీకం - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల అరెస్ట్
పుత్తూరుకు తరలింపు
సొంత పూచీకత్తుపై విడుదల
ఎమర్జెన్సీని తలపించిన పోలీసుల తీరు

 
 నగరిలో ఎమ్మెల్యే ఆర్‌కే.రోజా, మున్సిపల్ చైర్‌పర్సన్ శాంతికుమార్‌పై అధికార పార్టీ నాయకుల వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయి. అక్రమ కేసులు బనాయించి శాంతికుమార్ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయించారు. దీనికి నిరసనగా శాంతియుతంగా ర్యాలీ చేసేందుకు నగరికి బయలుదేరిన వైఎస్సార్ సీపీ ఎంపీ,     ఎమ్మెల్యేలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు.  వారిని పుత్తూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయానికి తరలించారు. సాయంత్రం 5 గంటల తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
 
తిరుపతి/పుత్తూరు : నగరిలో అధికార పార్టీ వేధింపులు ఎక్కువయ్యాయి. దీనికి నిరసనగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు శాంతియు తర్యాలీకి సిద్ధమయ్యాయి. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించారు. జిల్లా నలుమూలల్లోని వైఎస్సార్‌సీపీ ప్రధాన నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. కార్యకర్తలు నగరికి రాకుండా రహదారుల్లోనే అదుపులోకి తీసుకున్నారు. పుత్తూరు, నగరి, వడమాలపేట టోల్‌ప్లాజా వద్ద బలగాలను మోహరించారు. తమిళనాడు రాష్ట్రానికి వెళ్లినా వదిలిపెట్టలేదు. నగరి, చుట్టుపక్కల ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం సృష్టించారు. నగరి పట్టణంలో 144 సెక్షన్ విధించినప్పటికీ జిల్లా మొత్తం ఉన్నట్లు నానా హంగామా చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు,  గాలి ముద్దుక్రిష్ణమనాయుడు ఎలాగైనా ధర్నాను అడ్డుకోవాలని పోలీస్ బాస్‌కు వార్నింగ్ ఇవ్వడంతో వారు నానా తంటాలు పడ్డారు. ఎన్నడూ లేని రీతిలో నిరసన ర్యాలీని నిలువరించేందుకు ఐదుగురు డీఎస్పీలు, 10మందికి పైగా సీఐలు, 20 మంది ఎస్‌ఐలు, వందలాది మంది పోలీసులను మోహరించా రు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ద్విచక్ర వాహనాలు, కాలినడకన వందలాది మంది నగరికి చేరుకున్నారు.

 ఎలాగైనా నగరి చేరుకోవాలని..
 వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మె ల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల బృందం ఎలాగైనా నగరి చేరుకోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. ఉదయం 10.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరారు. వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిసి నగరి చేరుకునేందుకు ప్రయత్నించారు. ఓ దశలో పళ్లిపట్టులో పోలీసులకు, ఎమ్మెల్యేల బృందానికి మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు వాహనాలకు అడ్డుపడడంతో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక ఎమర్జెన్సీ చీకటి పాలనలో ఉన్నామా? అంటూ మండిపడ్డారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కాలుపైకి వాహనాన్ని పోనిచ్చి పోలీసులు ఓవరాక్షన్ చేశారు. మొత్తం మీద నేతలను నగరి సమీపంలో అడ్డుకుని పుత్తూరు స్టేషన్‌కు తరలించారు.
 

Advertisement
Advertisement