ప్రజల పక్షాన పోరాటం | Sakshi
Sakshi News home page

ప్రజల పక్షాన పోరాటం

Published Thu, Nov 6 2014 1:08 AM

ప్రజల పక్షాన పోరాటం - Sakshi

రుణ మాఫీ అంటూ ఊరించి పేద రైతులు, మహిళలను ఉసూరుమనిపించిన తెలుగుదేశం పార్టీ సర్కారుపై వైఎస్సార్ సీపీ సమరశంఖం పూరించింది. పేదలకు అండగా నిలబడి, వారి పక్షాన పోరాటానికి శ్రీకారం చుట్టింది. బుధవారం జిల్లావ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి ధర్మాగ్రహం వ్యక్తం చేసింది. పేదలను దగా చేస్తే పుట్టగతులుండవని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ ధర్నాల్లో రైతులు, మహిళలు, ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. పల్లెల నుంచి పట్టణాలకు కదంతొక్కారు. తహశీల్దార్ కార్యాలయాల వద్ద బైఠాయించి ప్రభుత్వంపై మండిపడ్డారు.  ‘రుణాలు చెల్లించొద్దు.. నాదీ భరోసా’ అంటూ నాడు నమ్మబలికి నేడు నయవంచనకు తెగబడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరుపై ధ్వజమెత్తారు.బాబుకు బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధం
 
 ఈ ధర్నాలు ఆరంభం మాత్రమే వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల
 జగ్గంపేట :  రుణాల మాఫీ పేరుతో అధికారాన్ని చేజిక్కించుకుని ఇప్పుడు గుంతనక్క మాదిరిగా ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని శాసనసభలో వైఎస్సార్ సీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. బుధవారం జగ్గంపేట సెంటర్‌లో జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో రుణమాఫీని బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా జరిగింది. ఈ ధర్నాకు భారీ సంఖ్యలో మహిళలు, రైతులు తరలివచ్చారు. వీరినుద్దేశించి జ్యోతుల మాట్లాడుతూ  బాబుకు బుద్ధిచెప్పేందుకు ఈ ధర్నాలు ఆరంభం మాత్రమేనని, అంతం కాదని పేర్కొన్నారు. రైతాంగాన్ని, ఆడపడుచులను రుణమాఫీ పేరుతో చంద్రబాబు వంచించారని ధ్వజమెత్తారు.
 
 డ్వాక్రా రుణాల మాఫీ హామీకి తూట్లు పొడిచి సంఘానికి రూ.లక్ష ఇస్తామని  నమ్మబలికిన ఆయనను మహిళలు విశ్వసించడం లేదని పేర్కొన్నారు. రైతులకు సుమారు 89 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయాల్సి ఉండగా రూ.43 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ఆయన బడ్జెట్‌లో కేవలం రూ.5 కోట్ల నిధులు మాత్రమే కేటాయించారని విమర్శించారు. తీరా చూస్తే కేవలం కోటి రూపాయల మూలధనంతో రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. జాబు కావాలంటే బాబు రావాలని ప్రచారం చేసుకున్న ఆయన ఇప్పుడు ఉద్యోగాలు తీసే పనిలో పడ్డారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ మహిళలు, రైతుల పక్షాన పోరాడుతుదని స్పష్టం చేశారు. జనవరి 6,7 తేదీలలో ఉభయ గోదావరి జిల్లాల సమస్యలపై తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటిం చారు. కార్యక్రమంలో ఆయన తనయుడు, జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్‌కుమార్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
 
 ఇది నయవంచక పాలన : ఎమ్మెల్సీ ఆదిరెడ్డి
 ప్రకాశ్‌నగర్ (రాజమండ్రి) : అధికారంలోకి వస్తే రుణమాఫీ అమలు చేస్తానని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గద్దెనెక్కిన తర్వాత మాయమాటలతో ప్రజలను మోసం చేశారని, నయవంచక పాలన సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దుయ్యబట్టారు. ‘బాబు దగాలు.. జనం దిగాలు’ అనే నినాదంతో రాజమండ్రిలో బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆదిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అమలు సాధ్యం కాని హామీలు గుప్పించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. నగరపాలక సంస్థలో వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిల మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రజా సమస్యలపై ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. దర్నాలో ముందుగా తెలుగుదేశం పార్టీ ప్రజలను మోసం చేస్తున్న తీరును ఇంద్రజాలం కళాకారులు ప్రదర్శించారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వేషధారణ ఆకట్టుకుంది. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ధర్నా అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సబ్ కలెక్టర్ విజయరామరాజుకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, నేతలు ఆర్.వి.వి. సత్యనారాయణచౌదరి, రావిపాటి రామచంద్రరావు, అడపా శ్రీహరి, పోలు కిరణ్‌రెడ్డి, నగరపాలక సంస్థలో పార్టీ చీఫ్ విప్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement