గర్జించిన సింహపురి | Sakshi
Sakshi News home page

గర్జించిన సింహపురి

Published Sun, Jun 3 2018 11:26 AM

YSRCP Party Members Fight For AP Special Status - Sakshi

ప్రత్యేక హోదా నినాదంతో సింహపురి గర్జించింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా హోదా నినాదం వినిపించారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన జనవాహినితో సింహపురి  జనసంద్రంగా మారింది. అన్ని దారులు.. అందరి అడుగులు ఒకే వైపు.. ఉదయం 9 గంటలకే వీఆర్సీ గ్రౌండ్‌ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో నిండిపోయింది. భారీగా తరలివచ్చిన నేతలతోపాటు పోటెత్తిన జిల్లా ప్రజల సాక్షిగా వంచనపై గర్జన దీక్ష సాగింది. ప్రధానమంత్రి మోదీ, సీఎం చంద్రబాబు హోదా విషయంలో ప్రజలను వంచించిన తీరును నేతలు వివరించారు. కొందరు నేతలైతే సామాన్యులకూ అర్థమయ్యే రీతిలో పిట్ట కథలు ద్వారా తెలియజేశారు. మొత్తం మీద శనివారం నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష గ్రాండ్‌ సక్సెస్‌తో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరులో శనివారం  వీఆర్సీ గ్రౌండ్‌లో నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభకు  అశేష జనవాహిని తరలివచ్చి హోదా నినాదాన్ని మరింత బలంగా వినిపించింది. ఉదయం 9 గంటలకే భానుడు ప్రతాపంతో ఎండతీవ్రత అధికంగా ఉన్నా లెక్కచేయకుండా పార్టీ నాయకులు ఎన్నికలకు కొద్ది నెలల ముందే సమరోత్సాహంతో తరలివచ్చారు. చివరకు సాయంత్రం 5 గంటలకు సభ ముగిసే సమయానికి ముందు భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అయినప్పటికీ పార్టీ నేతలు సభ ముగిసే వరకు వర్షంలోనే నేతల ప్రసంగాలను విన్నారు. ఉదయం 9 గంటలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి, రీజినల్‌ కో–ఆర్టినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, నెల్లూరు ఎంపీ  మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలు దీక్షా వేదిక ఉన్న దివంగత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి దీక్ష 

ప్రారంభించారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలు ప్రసంగాలు ప్రారంభించారు. ఉదయం 9.15 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ శ్రేణులు మొత్తం 50 మంది సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రత్యేక హోదా రావాల్సిన ఆవశ్యకతను, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హోదా కోసం పడుతున్న కష్టాన్ని గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమాలను హోదా విషయంలో టీడీపీ, బీజెపీ ప్రభుత్వాలు ప్రజలను వంచించిన తీరును నేతలు తమ ప్రసంగాల్లో ఎండగట్టారు.

బాబు తీరుపై నిప్పులు చేరిగిన ఎంపీ మేకపాటి
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఒక నీచుడు, రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న తీరును తీవ్ర ఉద్వేగంగా చెప్పారు. సభలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తర్వాత మాట్లాడిన నేతలు ఎక్కువ మంది మేకపాటి మాటలను ఉదహరించి ప్రసంగించటం విశేషం. అలాగే మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ కె.వీరభద్రస్వామి తమ ప్రసంగాల్లో చంద్రబాబు చేస్తున్న కుట్రలు, చంద్రబాబు నాయుడు కుర్చీ లాక్కునే వైనాన్ని పిట్ట కథల ద్వారా వివరించారు. గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు సర్కారు రాష్ట్రాన్ని దోచుకున్న వైనాన్ని నిరుద్యోగుల నుంచి రైతుల వరకు అందర్నీ మోసం చేసిన వైనాన్ని నేతలు తమ ప్రసంగాల్లో ఎండగట్టారు. సుదీర్ఘ ప్రసంగాలు అయినప్పటికీ నేతలు తమదైన శైలిలో ప్రసంగించటంతో సభికుల్లో ఉత్సాహం, హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 

నల్లచొక్కాలతో నిరసన
పార్టీ పిలుపు మేరకు పార్టీ ముఖ్య నేతలే కాకుండా, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా నల్లచొక్కాలు ధరించి గర్జన దీక్షకు తరలివచ్చారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు దీక్షకు తరలివచ్చారు. ముఖ్యంగా విజయనగరం మొదలుకుని, అనంతపురం వరకు నేతలు సభకు తరలివచ్చి దీక్షలో పాల్గొన్నారు. నేతలందరూ నల్లచొక్కాలనే ధరించి దీక్షలో పాల్గొని హోదాపై జరుగుతున్న మోసాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో ఢిల్లీ పాలకులకు కనువిప్పు కలిగేలా ప్రజలను వంచించిన చంద్రబాబుకు జీవిత కాలం గుర్తుండేలా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చిన క్రమంలో సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సభ ప్రారంభానికి ముందు జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు భారీ ర్యాలీగా సభకు తరలివచ్చారు.

మండుటెండలో ప్రారంభం.. జోరు వానలో ముగింపు
దీక్ష ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఉదయం 9 గంటలకే ఎండతీవ్రత అధికంగా ఉంది. మండుటెండను కూడా లెక్కచేయకుండా వేలాది అశేష జనావాహిని సభకు తరలివచ్చింది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు వాతవారణం బాగా హాట్‌గా ఉన్నప్పటికీ ఒక్కసారిగా మారిపోయింది. భారీ ఈదురుగాలుల వచ్చి వెంటనే నాలుగు గంటల నుంచి వర్షం మొదలైంది. జోరువానలోనే సభ సాగింది. వర్షం పడి నేతలు కొందరు తడిసినప్పటికీ సభను యథాతథంగా కొనసాగించి ప్రసంగించారు. హాజరైన ప్రజలు, కార్యకర్తలు కూడా వర్షంలోనే ప్రసంగాలు ఆసాంతం విన్నారు. మొత్తం మీద ఎండలో ప్రారంభమైన దీక్ష వర్షంతో ముగిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement