వంచక పాలనపై కన్నెర్ర | Sakshi
Sakshi News home page

వంచక పాలనపై కన్నెర్ర

Published Thu, Nov 6 2014 2:59 AM

వంచక పాలనపై కన్నెర్ర - Sakshi

జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కదంతొక్కారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అన్నదాతలు, డ్వాక్రా మహిళలకు ఎలాంటి షరతులూ లేకుండా రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. అన్నదాతలకు బాసటగా నిలిచి రైతులకు రుణమాఫీ చేసేవరకు పోరుబాట సాగించాలని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో ఉద్యమబాట పట్టారు. విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని 13 నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ధర్నాలకు నేతృత్వం వహించారు.
 
* రుణమాఫీలో మోసాలపై మండిపాటు
* అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని డిమాండ్
* అన్నదాతలు, డ్వాక్రా మహిళలకు బాసట
* వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు
* పాల్గొన్న పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు
* ధర్నాలకు వెల్లువెత్తిన ప్రజాస్పందన
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో బుధవారం ర్వహించిన ధర్నాలకు ప్రజాస్పందన వెల్లువెత్తింది. గ్రామీణ ప్రాంతాల్లో అన్నదాతలు స్వచ్ఛందంగా తరలివచ్చి ధర్నాలను విజయవంతం చేశారు. రైతులు, రైతు కూలీలు, డ్వాక్రా మహిళలు ధర్నాకు తరలివచ్చి ప్రస్తుత ప్రభుత్వంలో తమకు జరుగుతున్న అన్యాయంపై  గళం విప్పారు. ఎన్నికల ముందు రుణాలన్నీ రద్దు చేస్తామని ఒకటికి పదిసార్లు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికలయ్యాక రుణమాఫీ నుంచి పూర్తిగా తప్పుకొంటున్నారని పార్టీ నేతలు మండిపడ్డారు.

చంద్రబాబునాయుడు రుణమాఫీ హామీ అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలక్షేపం చేస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వారు విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే రుణమాఫీ అమలు చేసేలా ఉద్యమం కొనసాగిస్తామని నేతలు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలో అనుసరిస్తున్న తీరుపై నేతలు నిప్పులు చెరిగారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి, శాంతియుతంగా నిరసన తెలిపి మండల కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు.
 
విజయవాడ నగరంలో...
స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ నయవంచనకు, నమ్మకద్రోహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యాయపదం అని విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు అడ్డదారులు తొక్కి.. ఏ గడ్డిఅయినా కరుస్తారని రుణమాఫీ ద్వారా మరోసారి రుజువైందన్నారు. ఎన్నికల ముందు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని ధ్వజమెత్తారు.

రైతులకు లక్ష కోట్ల రుణమాపీ చేస్తామని చెప్పి కేవలం ఐదు వేల కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారని విమర్శించారు. అదేమంటే రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితిలో ఉందని చెపుతున్నారన్నారు. చంద్రబాబు తన కిడ్నీలు అమ్మి అయినా రైతులకు రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్‌ఖాన్,  పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, ట్రేడ్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ అధికారం కోసం చంద్రబాబు గత ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసగించారన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మాట్లాడారు.
 
జిల్లా అంతటా సమరశంఖం...
* పామర్రులో నియోజకవర్గ ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ ఉప్పులేటి కల్పన నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎన్నికల హామీలను విస్మరిస్తే ప్రజలు క్షమించరని కల్పన హెచ్చరించారు. నియోజకవర్గంలోని మొవ్వ, తోట్లవల్లూరు, పమిడిముక్కల, పెదపారుపూడి మండలాల్లో ధర్నాలు నిర్వహించారు.

* నూజివీడులో సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తీరుపై ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలోని ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు మండలాల్లో పార్టీ శ్రేణులు ధర్నాలు నిర్వహించాయి.

* తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు, విస్సన్నపేట, ఎ.కొండూరు, గంపలగూడెం తదితర మండలాల్లో జరిగిన ధర్నాల్లో ఎమ్మెల్యే రక్షణనిధి పాల్గొన్నారు. ఎన్నికల హామీల విషయంలో ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు.

* జగ్గయ్యపేట నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త సామినేని ఉదయభాను నేతృత్వంలో పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వత్సవాయి మండలంలో జరిగిన ధర్నాలోనూ ఉదయభాను పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు ధర్నాలో వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, భాను పాల్గొన్నారు.

* మచిలీపట్నంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని నాని నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు తీరును పేర్ని నాని ఖండించారు.

* మైలవరంలో నియోజకవర్గ సమనయ్వకర్త జోగి రమేష్ నేతృత్వంలో ధర్నాలు నిర్వహించారు. జోగి రమేష్ మైలవరం, జి.కొండూరు మండలాల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం, రెడ్డిగూడెం మండలాల్లో పార్టీ నేతల ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి.
 
* అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు నేతృత్వంలో ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో ధర్నాలు జరిగాయి. అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, కోడూరు మండలాల్లో పార్టీ నేతలు ధర్నాలు నిర్వహించారు.

* కైకలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్తలు ఉప్పాల రాంప్రసాద్, దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. ముదినేపల్లిలో ఉప్పాల రాంప్రసాద్, కైకలూరులో దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు. కలిదిండిలో నేతలు ధర్నా నిర్వహించారు.
 
* నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేశారు. కంచికచర్ల మండలంలో పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
 
* పెడనలో నిర్వహించిన ధర్నాలో పార్టీ సమన్వయకర్తలు బూరగడ్డ వేదవ్యాస్, ఉప్పాల రాంప్రసాద్ పాల్గొన్నారు. బంటుమిల్లి, గూడూరు, కృతివెన్ను మండలాల్లో ధర్నాలు జరిగాయి.

* గుడివాడ నియోజకవర్గంలో ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో నేతలు ధర్నాలు చేపట్టారు.

* గన్నవరం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు నేతృత్వంలో బాపులపాడులో ధర్నా నిర్వహించారు. ఉంగుటూరు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలాల్లో నేతలు ధర్నాలు జరిపారు.
 
రుణమాఫీ పేరుతో దగా చేశారు : సారథి
పెనమలూరు : నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి నేతృత్వంలో మూడు మండలాల్లో ధర్నాలు నిర్వహించారు. ఆయా ధర్నాల్లో సారథి, పార్టీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి పాల్గొని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సారథి మాట్లాడుతూ ఎన్నికల చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ నేటివరకు అమలు చేయక వారిని దగా చేశారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలకు జగన్‌మోహన్‌రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరిక ఉన్నా.. చంద్రబాబునాయుడు రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించటంతో టీడీపీకి ఓట్లు వేశారన్నారు.

తాను గెలిచిన తరువాత మొదటి సంతకం రుణాలమాఫీపై అని చంద్రబాబు చేసిన ప్రకటనలు ప్రజలు నమ్మారని వివరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందన్నారు. 87 వేల కోట్ల రుణమాఫీ కావాల్సి ఉండగా.. రోజుకో మాట చెబుతూ రైతు సాధికార సంస్థ ఏర్పాటుచేసి కేవలం రూ.5 వేల కోట్లు కేటాయించారన్నారు. ఆ నిధులు కూడా రైతులకు అందజేయడానికి రోజుకో నిబంధన పెడుతూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నిధులతో రైతుల వడ్డీలు కూడా తీరవన్నారు. డ్వాక్రా మహిళలు కూడా చంద్రబాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించలేదని చెప్పారు. నేటివరకు వారి రుణాలపై ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. రైతులు, డ్వాక్రా మహిళలు రుణ విముక్తి అయ్యేవరకు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు.

Advertisement
Advertisement