హోరెత్తిన పోరు | Sakshi
Sakshi News home page

హోరెత్తిన పోరు

Published Fri, Oct 18 2013 1:04 AM

YSRCP under the auto, rickshaw rallies

 

ఉద్యమం @ 80
=వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆటో, రిక్షా ర్యాలీలు
=స్వయంగా రిక్షా తొక్కిన ఉదయభాను, జోగి రమేష్, డీఎన్నార్
=కొనసాగుతున్న రిలేదీక్షలు
=పలుచోట్ల పురందేశ్వరి దిష్టిబొమ్మల దహనం
=కేంద్ర కార్యాలయాల మూసివేత

 
 ఆటోవాలా, రిక్షా కార్మికుడు, బస్సు డ్రైవర్, ఆస్పత్రి సిబ్బంది, ఉద్యోగి, విద్యార్థి.. ఇలా ప్రతి ఒక్కరూ మేము సైతమంటూ సమైక్యాంధ్ర సమరాంగణంలో కదంతొక్కుతున్నారు. వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు గురువారం జిల్లాలో ఆటోలు, రిక్షాలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. వీధులన్నీ వైఎస్సార్‌సీపీ పతాకాల రెపరెపలయ్యాయి. సమైక్య నినాదాలతో మార్మోగాయి. సీమాంధ్ర అభివృద్ధికి రూట్‌మ్యాప్ అంటూ మంత్రాంగం నడిపిన కేంద్ర మంత్రి పురందేశ్వరిపై సమైక్యవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు బంద్ పాటించాయి.
 
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా ఆటో, రిక్షా ర్యాలీలు జరిగాయి. జగ్గయ్యపేట పట్టణంలో ఆటోలు, రిక్షాబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను స్వయంగా రిక్షా తొక్కుతూ ర్యాలీలో పాల్గొన్నారు. మూడు కిలోమీటర్లకు పైగా ప్రధాన వీధుల్లో రిక్షాతొక్కుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ట్రేడ్ యూనియన్ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ నగర కన్వీనర్, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి జలీల్‌ఖాన్ వన్‌టౌన్‌లో ఆటో ర్యాలీ నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. పెడన నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు వాకా వాసుదేవరావు, ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఆటో, రిక్షాల ర్యాలీ జరిగింది. పెడన పట్టణం, మండలంలో ఉన్న వివిధ ఆటో యూనియన్ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

బంటుమిల్లి సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీగా వచ్చి మహాత్మాగాంధీ, వైఎస్సార్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉప్పాల రాము స్వయంగా ఆటో నడిపారు. నందిగామ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ జరిగింది. 100కు పైగా ఆటోలతో, వైఎస్సార్‌సీపీ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో రిక్షాలు, ఆటోలతో నిరసన కార్యక్రమం చేశారు.

పామర్రు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు, కంకిపాడు మండలాల్లో ఆటో ర్యాలీలు నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్తలు తాతినేని పద్మావతి, పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో ర్యాలీ  జరిపారు. కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆటో, రిక్షా ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఏలూరు రోడ్డు నుంచి మాగంటి థియేటర్ వరకు ర్యాలీ జరిగింది.

సంతమార్కెట్ వద్ద 23 అడుగుల భారీ వైఎస్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జెండాలు, ఆటోలు, రిక్షాలతో నిర్వహించిన ర్యాలీతో జాతీయ రహదారి కిక్కిరిసింది. తిరువూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు.

స్థానిక ప్రజాశక్తి విద్యాసంఘం సెంటర్ నుంచి కోర్టు, వంతెన, బస్టాండు సెంటరు మీదుగా ఈ ర్యాలీ సాగింది. పోలీసుస్టేషన్ సెంటరులో పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ, బస్టాండు సెంటరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు రమేష్‌బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలో పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు.
 
పురందేశ్వరి తీరుపై ఆగ్రహం...

 విభజన తర్వాత సీమాంధ్ర అభివృద్ధికి రూట్‌మ్యాప్ అంటూ కేంద్ర మంత్రి పురందేశ్వరి విజయవాడలో జరిపిన దౌత్యం సమైక్యవాదుల్లో ఆగ్రహానికి గురిచేసింది. ఆమె తీరుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా గురువారం ఆందోళనలు హోరెత్తాయి. కలిదిండిలో డ్వాక్రా మహిళలు పురందేశ్వరి దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతృత్వంలో జాతీయ బ్యాంకులు, పోస్టల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ తదితర కేంద్ర కార్యాలయాల బంద్ జరిపారు. ఇరిగేషన్ ఉద్యోగులు స్వరాజ్య మైదానం వద్దనున్న  తమ కార్యాలయం నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

వారందరినీ అరెస్ట్ చేసి సమీపంలోని సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో రెండు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరిగేషన్ ఉద్యోగులు సోనియా డౌన్ డౌన్ అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవనిగడ్డలో ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ నుంచి ఆయన స్వగ్రామమైన వక్కపట్లవారిపాలెంలో అంగీకార పత్రాన్ని జేఏసీ నాయకులు తీసుకున్నారు. జేఏసీ పిలుపు మేరకు దివిసీమలోని ఆరు మండలాల్లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను నాయకులు మూయించారు.

జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి, గుడివాడ, నూజివీడు మండలాల పరిధిలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ది నాగాయలంక పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యానమిత్రులు దీక్షలో కూర్చున్నారు. ధ్యానమిత్రుల రిలే దీక్షకు సంఘీభావంగా స్థానిక స్కాలర్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూలు విద్యార్థులు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రదర్శన జరిపి మానవహారం నిర్మించారు. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఎదురుగా చేట్టిన రిలేదీక్షలు గురువారం 46వ రోజుకు చేరాయి.

అవనిగడ్డలో చేపట్టిన దీక్షలు 57వ రోజుకు చేరాయి. ది కర్షక ఆటో వర్కర్స్, మేరీమాత ఆటో వర్కర్స్ యూనియన్‌కు చెందిన 46 మంది దీక్ష చేశారు. గుడివాడలో మున్సిపల్ కార్యాలయం ఎదుట విజయవాడ రోడ్‌పై మోకాళ్లపై ఉండి నిరసన తెలిపారు. పామర్రులో జాతీయ రహదారిపై జేఏసీ నాయకులు మోకాళ్లపై నిలబడి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. పెడనలో సెయింట్ విన్సెంట్ పల్లోటి హైస్కూల్ ఉపాధ్యాయులు, డ్రైవర్లు, యాజమాన్యం, సిబ్బంది ఒకరోజు రిలే దీక్ష చేపట్టారు.
 
మచిలీపట్నంలో మూతబడ్డ ఓపీ...

 మచిలీపట్నం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు, సిబ్బంది గురువారం అత్యవసర సేవలకే పరిమితమయ్యారు. దీంతో ఆస్పత్రిలోని ఓపీ విభాగం పూర్తిగా మూతపడింది. ఆగిరిపల్లిలో మండల పెన్షనర్ల సంఘ సభ్యులు దీక్షలో పాల్గొన్నారు. జగ్గయ్యపేట జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షా శిబిరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను సందర్శించి దీక్షలో కూర్చున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. వత్సవాయిలో సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు మానవహారం నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు. నందివాడ మండలం టెలిఫోన్‌నగర్ కాలనీలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షలు 47వ రోజుకు చేరుకున్నాయి.
 

Advertisement
Advertisement