Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీకి విప్ జారీ అధికారం

Published Thu, Jul 3 2014 1:53 AM

వైఎస్‌ఆర్‌సీపీకి విప్ జారీ అధికారం - Sakshi

 శ్రీకాకుళం: మండల, జిల్లాపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి విప్ జారీ చేసే అధికారం వైఎస్‌ఆర్‌సీపీకి కూడా ఉందని జెడ్పీ సీఈవో నాగార్జునసాగర్ స్పష్టం చేశారు. ఈ విషయమై ఎన్నికల సంఘం నుంచి వివరణ తీసుకున్నామన్నారు. ఆ పార్టీకి కూడా విప్ జారీ చేసే అధికారం ఉన్నట్టు తెలిపారని చెప్పారు. మండల, జిల్లాపరిషత్ ఎన్నికల్లో సభ్యులు అనుసరించాల్సిన విధివిధానాలను ఆయన విలేకరులకు బుధవారం వెల్లడించారు. విప్ ధిక్కరించిన వారికి పదవి పోయే ప్రమాదం ఉందన్నారు. అయితే వారు విప్‌ను ధిక్కరించి వేసే ఓటు మాత్రం చెల్లుబాటు అవుతుందన్నారు.
 
 విప్‌ను జారీ చేసే వారుగానీ, పార్టీ ప్రతినిధులుగానీ విప్‌ను ధిక్కరించిన విషయమై మూడు రోజుల్లోగా తెలియజేస్తే ఏడు రోజుల్లోగా సంబంధిత సభ్యులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ తరువాత అనర్హతపై ప్రిసైడింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని వివరించారు. జూలై 4న మండల పరిషత్ అధ్యక్ష, 5న జిల్లాపరిషత్ అధ్యక్ష ఎన్నికలు  పరోక్ష పద్ధతిన జరుగుతాయన్నారు. ముందుగా కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తామని.. వారు మండల పరిధిలో ఓటరై ఉండడంతోపాటు మైనార్టీ సామాజిక వర్గానికి చెంది ఉండాలన్నారు.
 
 ఉదయం 10 గంటలలోగా నామినేషన్ దాఖలు చేయాలని వాటిపై పరిశీలన పూర్తి చేసిన అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఎన్నిక ఉంటుందన్నారు. ఎన్నిక అనివార్యమైతే చేతులెత్తే పద్ధతిన ఓటింగ్ నిర్వహిస్తామన్నారు. తరువాత మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను ప్రత్యేక సమావేశం ద్వారా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఎన్నిక అనివార్యమైతే కేవలం సభ్యులు మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుందని కో-ఆప్షన్ సభ్యులకు ఓటింగ్ చేసే అధికారం లేదన్నారు. మండల, జిల్లాపరిషత్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యులు ఉండరని పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement