నా బిడ్డను ఆశీర్వదించండి | Sakshi
Sakshi News home page

నా బిడ్డను ఆశీర్వదించండి

Published Mon, Nov 6 2017 1:51 AM

YSRCP's Honorary President YS Vijayamma appealed to the public on jagan padayatra - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపడుతున్నాడు. నా బిడ్డను ఆదరించి.. ఆశీర్వదించండి’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ కోరారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి ‘ప్రజా సంకల్పం’ పేరిట సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో ఆదివారం వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో వైఎస్‌ విజయమ్మ విలేకరులతో సంభాషించారు. పాదయాత్ర గురించి ఆమె ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. ఎన్నో కష్టాల్లో ఉన్న ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేపడుతున్నారని చెప్పారు. జగన్‌ను ఆశీర్వదించి చరిత్రలో నిలిచిపోయేలా పనులు చేయించుకోవాలని ప్రజలను కోరారు. జగన్‌ పాదయాత్ర తనను బాధిస్తోందని విజయమ్మ కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆమె ఇంకా ఏం చెప్పారంటే... 

ప్రజల కోసమే జగన్‌ పాదయాత్ర  
‘‘దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర చూశా... షర్మిలమ్మ చేపట్టిన పాదయాత్ర చూశా... వారిని ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకున్నారు. ఇప్పుడు ప్రజల పక్షాన జగన్‌మోహన్‌రెడ్డి పోరాటం చేస్తున్నాడు. వారి సమస్యలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఆయనే స్వయంగా ప్రజల్లోకి వస్తున్నాడు. పాదయాత్ర చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. నేను మొదట చెప్పినట్లుగా జగన్‌ను మీ చేతుల్లో పెడుతున్నాను. ప్రజల కోసమే జగన్‌ ‘ప్రజాసంకల్పం’ పాదయాత్ర తలపెట్టాడు. ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకం సంక్షేమ కోసం నవరత్నాలను ప్రకటించాడు. పాదయాత్రలో ప్రజలు తమ సమస్యలను జగన్‌కు వివరించి, ఆయనకు బ్లూప్రింట్‌ ఇవ్వాలి.

మీ కుమారుడిగా, సోదరుడిగా, మనవడిగా వైఎస్‌ జగన్‌ను అక్కున చేర్చుకుని ఆశీర్వదించండి. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. తండ్రిలాంటి పాలన అందిస్తాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సీఎం చంద్రబాబు  అమలు చేయలేదు. దీన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. జగన్‌ తలపెట్టిన పాదయాత్రను చూసి చంద్రబాబు భయప డుతున్నారు. ఇబ్బందులకు గురిచేయాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఏం అనుమతులు తీసుకున్నారు? గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి, షర్మిల పాదయాత్ర చేశారు. స్వాతంత్య్రం రాక ముందు మహాత్మాగాంధీ, వినోబా భావే పాదయాత్రలు చేశారు. నిరసన తెలపడం ప్రతిపక్షం బాధ్యత. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, ప్రజలకు మంచి పనులు చేయాలి. ఇచ్చిన హామీల్లో కొన్నింటినైనా నెరవేర్చాలి. 

వైఎస్‌ పాదయాత్ర ఓ చరిత్ర 
దివంగత సీఎం రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్రను ప్రజలు తమ గుండెల్లో దాచుకున్నారు. ఆయనను అమితంగా ఆదరించారు. వైఎస్సార్‌ పాదయాత్ర ఓ చరిత్ర. పాదయాత్రలో ఆయన అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నారు. రైతులు, మహిళ లు, వృద్ధుల సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. ఎన్నో అంశాలను గమనించారు. పాదయాత్రలోనే సంక్షేమ పథకాల బ్లూప్రింట్‌ను తయారు చేసుకున్నారు. వైఎస్సార్‌ అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకమూ పాదయాత్ర నుంచి పుట్టిందే.

యాత్ర తర్వాత వైఎస్సార్‌ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అధికారంలోకి రాగానే బడుగు వర్గాలకు పింఛన్లు నెలనెలా వచ్చేలా చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లేకుంటే, వైఎస్సార్‌ ప్రారంభించిన సంక్షేమ పథకాలు ఈ రోజు ఉండేవి కావు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన పథకాలు వైఎస్సార్‌సీపీ ఉండ టం వల్లే ఎంతోకొంత అమలవుతున్నాయి. హైదరాబాద్‌లో ఏపీ ప్రజలకు ఆరోగ్యశ్రీ  వర్తించడం లేదు. ప్రజలు వివేకవంతులు.. జగన్‌ ఎంత కష్టపడుతున్నాడో వారికి తెలుసు. ప్రస్తుత పాలకులు ఆయనను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో ప్రజలకు తెలుసు. వాళ్లకు అన్నీ తెలుసు. జగన్‌ను ప్రజలు తమ బిడ్డగా ఆశీర్వదించాలి’’ అని విజయమ్మ విజ్ఞప్తి చేశారు. 

‘ప్రజా సంకల్పం–సప్త స్వరాలు’ సీడీ ఆవిష్కరణ
పులివెందుల రూరల్‌:  రాష్ట అభివృద్ధి, శ్రేయస్సు కోసం ప్రజల పక్షాన పోరాటం ప్రారంభించిన తన బిడ్డ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి, పాదయాత్ర విజయవంతమయ్యేలా చూడాలని వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ కోరారు. వైఎస్సార్‌ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ ఎస్టేట్‌లో ఆదివారం ‘ప్రజాసంకల్పం–సప్త స్వరాలు’ సీడీని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ... తన భర్త, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేస్తుంటే అడుగులో అడుగై ప్రజలు నడిచిన విషయం తనకు గుర్తుందన్నారు. ఆ తర్వాత తన కుమార్తె షర్మిలమ్మ పాదయాత్ర చేస్తే అదే రీతిలో ప్రజలు ఆశీర్వదించారని చెప్పారు. మళ్లీ ఇప్పుడు తన బిడ్డ వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని, అందరూ ఆయనను ఆశీర్వదించి అడుగులో అడుగై నడవాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సేవాదళ్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రూపొందించిన ఈ సీడీలోని పాటలు పాదయాత్రలో ప్రజలు పాల్గొనేందుకు ఓ ప్రేరణ కావాలని విజయమ్మ ఆకాంక్షించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement