యువశక్తి.. తగ్గిన ఆసక్తి | Sakshi
Sakshi News home page

యువశక్తి.. తగ్గిన ఆసక్తి

Published Mon, Dec 1 2014 3:19 AM

యువశక్తి.. తగ్గిన ఆసక్తి - Sakshi

ప్రభుత్వ ఆదరణలేదు...రుణాలు రావు
నిర్వీర్యమైన రాజీవ్ యువశక్తి పథకం
⇒  సీఎంఈవైగా పేరుమార్చినా నిధులివ్వని వైనం

కర్నూలు(జిల్లా పరిషత్): రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది ఒక్క యూనిట్‌ను ప్రారంభించకుండా యువత భవితతో ఆటలాడుకుంటోంది. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు వారి గురించి ఆలోచించడం మానేసింది. రాజీవ్ యువశక్తి పథకం కింద ప్రభుత్వం కేవలం జిల్లాలో ఆరు నుంచి 7 యూనిట్లకు సరిపోయే మొత్తానికి మాత్రమే నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది.
 
సీఎంఈవైగా పేరు మార్చినా
యూత్ అడ్వాన్స్‌మెంట్ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌యువశక్తి పథకం పేరును సీఎంఈవై (ముఖ్యమంత్రి యువజన సాధికారత పథకం)గా మారుస్తూ సెప్టెంబర్ 25న ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీవో జారీ అయి రెండు నెలలు పూర్తయినా సీఎంఈవై నియమ నిబంధనలు విడుదల చేయలేదు. ఈ పథకం కింద ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్ట్రం మొత్తానికి రూ.1.26కోట్లను మాత్రమే కేటాయించింది. ఈ లెక్కన రాష్ట్రం మొత్తానికి 126 యూనిట్లు రాగా,  మన జిల్లాలో 7 నుంచి 8 యూనిట్లు ఏర్పాటు చేసేందుకు మాత్రమే ఈ నిధులు సరిపోతాయి. రాష్ట్రం మొత్తానికి ఎస్టీ వర్గాలకు రూ.5కోట్లతో 500 యూనిట్లు కేటాయించినా అందుకు సంబంధించిన గైడ్‌లైన్స్ విడుదల చేయలేదు.
 
ప్రతిపాదనలు బుట్టదాఖలు

సేవా రంగంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు రూ.2లక్షల సబ్సిడీతో రూ.5లక్షల రుణాన్ని వంద యూనిట్లను, వ్యాపార సంబంధంగా రూ.2లక్షల యూనిట్ కాస్ట్‌తో 200 యూనిట్లను, చిన్న యూనిట్లకు రూ.1లక్షతో 600 యూనిట్లను జిల్లాకు కేటాయించాలని గతంలో అధికారులు చేసిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి.

జాడలేని యువజనోత్సవాలు
గతేడాది నియోజకవర్గ, జిల్లా స్థాయి యువజనోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిఆంచారు. కానీ ఈ సారి నియోజకవర్గ స్థాయి పోటీలకు స్వస్తి పలికి కేవలం జిల్లా స్థాయిలో నిర్వహించాలని రూ.30వేలను ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

గూడూరు మండలం జులేకల్ గ్రామానికి చెందిన శ్రీరాములు 2010లో బీఎస్సీ పూర్తి చేశాడు. ఉద్యోగాల కోసం రెండేళ్ల పాటు వెతికినా లాభం లేకపోయింది. ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక స్థోమత లేక, కుటుంబ సమస్యలు వెంటాడటంతో ఏదైనా వ్యాపారం చేద్దామని భావించాడు. రెండేళ్లుగా ప్రభుత్వం సబ్సిడీల ద్వారా అందించే రుణాల కోసం ఎదురుచూడసాగాడు. గతేడాది మళ్లీ దరఖాస్తు చేసినా ఫలితం లేదు. ఈ ఏడాది ఇప్పటిదాకా రుణాల ఊసేలేకుండా పోయింది.
 
కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు చెందిన రాము స్థానికంగా ఆడియో దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. అతను తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు గతేడాది రాజీవ్ యువశక్తి పథకం ద్వారా రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటిదాకా రాకపోవడంతో మళ్లీ ఈ ఏడాది దరఖాస్తు చేసుకోవాలనుకున్నారు. ఈ సారి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులూ ఇవ్వడం లేదని తెలుసుకుని అప్పులు చేసి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు.

Advertisement
Advertisement