మండల కేంద్రాల్లో 3జీ సేవలు | Sakshi
Sakshi News home page

మండల కేంద్రాల్లో 3జీ సేవలు

Published Sun, Jul 20 2014 3:57 AM

మండల కేంద్రాల్లో 3జీ సేవలు

  •     ఆగస్టు 4 నుంచి కంప్యూటరైజ్డ్ సేవలు
  •      సైనికుల కోసం ‘రక్షక్’ సిమ్ పథకం
  •      {పెస్‌మీట్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ జీఎం రవిబాబు
  • తిరుపతి అర్బన్: తిరుపతి టెలికం జిల్లా పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో 3జీ సేవలు ప్రారంభించామని బీఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్ మేరువ రవిబాబు తెలిపారు. సంస్థ కొత్తగా చేపట్టిన, చేపట్టనున్న కార్యక్రమాలను శనివారం ఆయన విలేకరుల సమావేశంలో వివరించారు. సంస్థ ద్వారా వినియోగదారులకు అందిస్తున్న సేవలు, ఉద్యోగులు-సిబ్బంది వివరాలను ఆగస్టు 4వతేదీ నుంచి కంప్యూటరైజ్డ్ చేయనున్నామన్నారు.

    2జీ(సెల్), 3జీ(ఇంటర్నెట్) సేవలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కొత్త ల్యాండ్‌లైన్ కనెక్షన్లను ప్రోత్సహించేందుకు, ఉన్న ల్యాండ్‌లైన్ వినియోగదారులను వదులుకోకుండా తీసుకోవాల్సిన కార్యాచరణపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారి కోసం ప్రత్యేక ఆఫర్లు అమలు చేయనున్నామన్నారు. ఉద్యోగులు, రిటైర్డ్ అయిన వారు, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు బ్రాడ్‌బ్యాండ్ పథకాల్లో 10శాతం తగ్గింపు అందిస్తామన్నారు. 2జీ, 3జీ వినియోగదారుల కోసం సరికొత్త చౌక ధరలతో కూడిన సేవలను అందివ్వనున్నట్లు వెల్లడించారు.

    చిత్తూరు జిల్లాలోని బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ వినియోగదారులకు నెల, మూడు నెలల కాల పరిమితితో కూడిన ఫ్రీ ఇన్‌కమింగ్ రోమింగ్ సేవలను అందివ్వనున్నట్లు చెప్పారు. సైనికులు, వారి కుటుంబ సభ్యుల కోసం అత్యంత చౌక అయిన ‘రక్షక్’ ప్లాన్ అమలు చేస్తామన్నారు. ఈ ప్లాన్ ద్వారా సైనికునికి ఒక సిమ్, మరోటి ఇంట్లోని వాళ్లకు ఇస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అడిషనల్ జీఎంలు వెంకటనారాయణ(ప్లానింగ్), ఎంఎస్ న్యూటన్(అడ్మిన్), ఏజీఎంలు గోపీకృష్ణ, మునస్వామిరాజు(మార్కెటింగ్) సిబ్బంది పాల్గొన్నారు.
     

Advertisement
Advertisement