దండకారణ్యం జల్లెడ! | Sakshi
Sakshi News home page

దండకారణ్యం జల్లెడ!

Published Tue, Jan 2 2018 10:17 AM

police combing operation in Kothagudem - Sakshi

మావోయిస్టులు గత పది రోజుల్లో నాలుగుసార్లు పేల్చివేతలు, బెదిరింపులకు పాల్పడ్డారు. జిల్లా సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పోలీస్‌ బేస్‌క్యాంపులకు అత్యంత సమీపంలోనే ఈ చర్యలకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముమ్మరంగా కూంబింగ్‌ చేపట్టారు. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్‌తో పాటు కేంద్ర బలగాల సంయుక్త ఆధ్వర్యంలో  దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు.

సాక్షి, కొత్తగూడెం: మూడేళ్లుగా జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు నామమాత్రంగా ఉన్నప్పటికీ సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మాత్రం కొనసాగుతున్నాయి. 2015 నుంచి జిల్లాలో అడపా దడపా పలు చర్యలకు పాల్పడిన మావోయిస్టులు రెండు నెలలుగా భద్రాద్రి జిల్లా చర్ల, దుమ్ముగూడెం, భూపాలపల్లి జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో అనేక విడతలుగా కరపత్రాలు వేశారు. వెంకటాపురం మండలంలో గత డిసెంబరు 4వ తేదీన ప్రధాన రహదారిపై మందుపాతర అమర్చారు. 

పోలీసులు గుర్తించి∙ తొలగించడంతో భారీ పేలుడు తప్పినట్లైంది. మావోయిస్టు వారోత్సవాలు, అమరవీరుల వారోత్సవాలు, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ వారోత్సవాల సమయంలోనూ కార్యకలాపాలు అంతగా లేవు. అయితే ఈ క్రమంలో పది రోజులుగా మాత్రం చర్ల, దుమ్ముగూడెం, భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలాలకు సరిహద్దుల్లో మన రాష్ట్ర సరిహద్దుకు అతి సమీపంలో రెండు రాష్ట్రాల సరిహద్దులను కలిపే రహదారుల పనులను అడ్డగించేందుకు వివిధ విధ్వంసక చర్యలకు దిగుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, బస్తర్, సుక్మా, దంతెవాడ జిల్లాలు, ఒడిశా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లాలో రోడ్డు పనులను అడ్డగించేందుకు దాదాపు 150 వరకు వివిధ రకాల యంత్రాలను, వాహనాలను మావోయిస్టులు తగులబెట్టారు.

 ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా, తెలంగాణలోని భద్రాద్రి జిల్లాకు అనుసంధానమయ్యే రహదారుల పనులను అడ్డుకుంటున్నారు. ఇప్పటికే నిర్మించిన వంతెనలను పేల్చివేశారు. వారం రోజుల కిందట ఛత్తీస్‌గఢ్‌లోని కుంట వద్ద తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సును పేల్చివేసేందుకు యత్నించారు. దీంతో ఆయా జిల్లాల పరిధిలో కేంద్ర బలగాలతో పాటు, మూడు రాష్ట్రాల బలగాలు సైలెంట్‌గా కూంబింగ్‌ చేసేందుకు రంగంలోకి దిగాయి.

 కేంద్ర ప్రభుత్వ సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఎస్‌టీఎఫ్‌(స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌), డీఆర్‌జీ(డిస్ట్రిక్ట్‌ రిజర్వు గార్డ్స్‌), తెలంగాణకు చెందిన యాంటీ నక్సల్‌ స్క్వాడ్, గ్రేహౌండ్స్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రేహౌండ్స్, ఏపీఎస్పీ బలగాలు ఈ ఆపరేషన్‌లోకి దిగినట్లు సమాచారం. సరిహద్దుల వారీగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఆయా మూడు రాష్ట్రాల బలగాలు, కేంద్ర బలగాలు క్లాష్‌ కాకుండా ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. కాగా గత నెల 25వ తేదీన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న, ఆయన భార్య రజిత లొంగిపోవడంతో పాటు ప్రస్తుత మావోయిస్టు చర్యల నేపథ్యంలో సరిహద్దుల్లో కనిపించని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గత 26న తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సైతం జిల్లాలో ఆకస్మికంగా పర్యటించి వెళ్లడం గమనార్హం. 

జిల్లాలో మావోయిస్టు చర్యలు..
∙మావోయిస్టులు ప్రతి ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నిర్వహించే అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు, అదేవిధంగా సెప్టెంబరు 21 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు, డిసెంబరు 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే మావోయిస్టు పార్టీ అనుబంధ పీఎల్‌జీఏ (పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ) వారోత్సవాల సందర్భంగా ఈ మండలాల్లో పోస్టర్లు వెలిశాయి. ఇందులో భాగంగా  గత డిసెంబరు 4వ తేదీన వెంకటాపురం మండలంలో ప్రధాన రహదారిపై మావోయిస్టులు మందుపాతర అమర్చారు. 17వ పీఎల్‌జీఏ వారోత్సవాల్లో భాగంగా పోస్టర్ల కింద మందుపాతర అమర్చారు. దీనిని గుర్తించిన పోలీసులు వెలికితీసి నిర్వీర్యం చేశారు. 

∙2015, మే 25న అప్పటి ఉమ్మడి జిల్లాలో ఉన్న (ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా) వెంకటాపురం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన కుర్సం బాలకృష్ణను ఇన్‌ఫార్మర్‌ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. 

∙2015, అక్టోబరు 14న తిప్పాపురం గ్రామానికి చెందిన మిడియం బాలకృష్ణను హత్య చేశారు. అదేవిధంగా 2017లో జిల్లాలోని దుమ్ముగూడెం మండలం మారాయిగూడేనికి చెందిన ఇద్దరిని అపహరించిన మావోయిస్టులు పది రోజుల తరువాత విడిచిపెట్టారు. 

జిల్లా సరిహద్దు అవతల ఛత్తీస్‌గఢ్‌లో.. 
గత డిసెంబరు 22న కాచారం వద్ద కాచారం, గాజులగుట్ట సీఆర్‌పీఎఫ్‌ బేస్‌క్యాంపులకు సరుకులు తీసుకెళ్లే వాహనాలతో పాటు రోడ్డు పనులకు సంబంధించిన 30వాహనాలను మావోయిస్టులు దగ్ధం చేశారు. 27న ధర్మపేట లోలెవల్‌ బ్రిడ్జిని పేల్చారు. 28న రోడ్డు పనులు చేయొద్దని  కూలీలను  హెచ్చరించారు. 30న దంతెవాడ జిల్లా తోయిలంక వద్ద రోడ్డు పనులు చేస్తున్న జేసీబీ, రోడ్డు రోలర్, పొక్లెయిన్‌ర్, 2 ట్యాంకర్లు, 2 ట్రాక్టర్లు తగులబెట్టారు. ఈ ఘటనలో రూ.80లక్షల ఆస్తి నష్టం జరిగింది.     

Advertisement

తప్పక చదవండి

Advertisement